ఆస్తమా, ఉబ్బసం రోగులకు చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్(84) అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చేప మందు కోసం భారీ సంఖ్యలో ఆస్తమా రోగులు నగరానికి వస్తుంటారు.
ఇటీవల జరిగిన చేపమందు పంపిణీ కార్యక్రమంలో ఆయన వీల్‌చైర్‌లోనే వచ్చారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి పరిస్థితి విషమించి హరినాథ్ గౌడ్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హరినాథ్‌గౌడ్ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమారుడు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. రేపు ఆయన దహన సంస్కారాలు ఉంటాయని కుటుంబ సభ్యులు ప్రకటించారు.
కాగా గత 173 ఏళ్లుగా ఆస్తమా, ఉబ్బసం రోగులకు బత్తిని కుటుంబం ఉచితంగా చేపమందు ఇస్తు వస్తోంది. కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ రెండేండ్ల పాటు మాత్రం నిలిపివేసిన విషయం తెలిసిందే.