యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ మాటలు కోటలు దాటుతున్నాయి. తమను ఇబ్బంది పెడుతున్న ప్రత్యర్థులు, ఉన్నతాధికారుల పేర్లు రాసుకుంటున్నా అని, అధికారంలోకి రాగానే ఒక్కొక్కరి అంతు చూస్తానని ఆయన హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. తన తాత ఎన్టీఆర్ దేవుడని, నాన్న చంద్రబాబు రాముడని, కానీ తాను రాక్షసుడిని అని, ఊరికే వదిలి పెట్టనని ప్రగల్భాలు పలకడం చూస్తున్నాం.
రెండు రోజుల క్రితం గన్నవరం బహిరంగ సభలో వల్లభనేని వంశీ, కొడాలి నానిలకు భయం అంటే ఏంటో రుచి చూపిస్తామని, అధికారంలోకి రాగానే కట్ డ్రాయర్‌పై ఊరేగిస్తానని తన పార్టీ శ్రేణులకు ఆనందాన్ని ఇచ్చే భారీ డైలాగ్‌లు కొట్టారు. వాళ్లిద్దరూ లైవ్ వీడియోలో కనిపించే సరికి లోకేశ్ మొహంలో నెత్తురు చుక్క లేకపోవడం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ సందర్భంగా రెండు అంశాలు తెరపైకి వచ్చాయి. పాదయాత్రలో భాగంగా లోకేశ్ ఎక్కువగా జగన్ తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు గుప్పించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరులో, తాజాగా గుడివాడలో లోకేశ్ పాదయాత్ర సాగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినా, చేయకపోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు.
కానీ టీడీపీకి కొరకరాని కొయ్యలుగా భావిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయకపోవడం ఏంటనే చర్చ తెరపైకి వచ్చింది. పుంగనూరుకు ఆనుకుని లోకేశ్ పాదయాత్ర చేశారు. అంతే తప్ప పుంగనూరులో అడుగు పెట్టలేదు. కేవలం దూరం నుంచి వాళ్లిద్దరికీ వార్నింగ్‌లు ఇవ్వడంతోనే సరిపెడుతున్నారని, దగ్గరికి వెళితే ఏమవుతుందో అనే భయం లోకేశ్‌ను భయపెడుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మాత్రం దానికి ఉత్తర కుమార ప్రగల్భాలు దేనికనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పుంగనూరు, గుడివాడలలో పాదయాత్ర చేస్తే పెద్దిరెడ్డి, నాని అనేదేమీ వుండదు. కానీ తనను ఏదో చేస్తారన్న భయం లోకేశ్‌ను వెనకడుగు వేసేలా భయపెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబుకు తగ్గట్టే లోకేశ్‌కు ధైర్యం లేదని, తండ్రీకొడుకులిద్దరూ ఉత్తర కుమారుడి వారసులనే వ్యంగ్య కామెంట్స్ వారిపై వైరల్ అవుతున్నాయి.