చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంపై భారతదేశం వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో అమెరికా, రష్యా, చైనా లాంటి అగ్రరాజ్యాల సరసన మనదేశ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. అంతేకాదు, మరే దేశానికి ఇప్పటి వరకూ సాధ్యం కానిది, జాబిల్లిపై దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
గత నెల 14న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 మిషన్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 సక్సెస్ వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయంపై మీడియా అనేక కథనాలు వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ప్రయోగంలో ప్రతి ఒక్కరి కృషిని సమాజానికి మీడియా చాటి చెబుతోంది.
ఇదే సందర్భంలో చంద్రబాబునాయుడిపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. ఏ వస్తువు తీసుకున్నా, దాని తయారీ వెనుక తానున్నానని చెప్పుకునే చంద్రబాబుపై నెటిజన్లు సరదా కామెంట్స్ చేయడం విశేషం. చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ ఘనత తనదే అని ఇంకా చంద్రబాబు ప్రకటించుకోలేదా? అంటూ నెటిజన్లు సెటైర్స్ విసరడం గమనార్హం.
విజన్-2047 అంటూ ఇటీవల భారత్‌ను ఉద్దరించేందుకు సరికొత్త ఐడియాతో చంద్రబాబు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్ర మండలాన్ని కూడా కలుపుకుని విజన్ డాక్యుమెంట్‌ను ప్రకటించే పనిలో చంద్రబాబు నిమగ్నం అయ్యారంటూ ప్రత్యర్థులు విసుర్లు విసురుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానానికి తాను పునాది వేయడం వల్లే, ఇవాళ చంద్రయాన్-3 మిషన్ ప్రయోగానికి బీజం పడిందని చంద్రబాబు ఇంకా ప్రకటించుకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
చంద్రయాన్-3 మిషన్ ప్రయోగంలో భాగస్వాములైన వారికి చంద్రబాబు రాఖీలు పంపడం, వాటికి 41 రోజులు పూజలు చేసి, చంద్రబాబును తలచుకోవడంతో జాబిల్లిపై విజయవంతంగా కాలు మోపగలిగామని నెటిజన్లు సందర్భోచితంగా సోషల్ మీడియాలో చురకలు అంటించారు. తానే సృష్టికర్త అని బాబు ప్రచారం చేసుకోవడం వల్లే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా చంద్రయాన్-3 సక్సెస్‌తో భారతీయులుగా చెప్పుకోవడానికి మనమంతా గర్వించాల్సిన క్షణాలివి. ఇందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలు చరిత్రలో నిలిచిపోతారు.