ఇదేదో సినిమా డైలాగ్ లా అనిపించినా, తన జీవితంలో మాత్రం నిజంగానే జరుగుతోందని అఁటున్నాడు నవీన్ పొలిశెట్టి. తను షూటింగ్ స్టార్ట్ చేస్తే, బాహ్య ప్రపంచంతో పూర్తిగా కట్ అయిపోతానని చెబుతున్నాడు.
“నేను క్యారెక్టర్ లోకి ఒకసారి దూరానంటే ఎవ్వర్నీ కలవను. షూటింగ్ టైమ్ లో ఇంట్లో వాళ్లతో కూడా పెద్దగా మాట్లాడను. మీటింగ్స్, బయట పార్టీలు, ఫంక్షన్లు ఏవీ పెట్టుకోను. నేను షూటింగ్ స్టార్ట్ చేశానంటే ఇంట్లో వాళ్లు, బంధువులు తిట్టుకుంటారు. ఫోన్ కూడా ఎత్తలేదని తిట్టుకుంటారు. సినిమా షూటింగ్ టైమ్ లో పూర్తిగా ఆ సినీ ప్రపంచంలోనే ఉంటాను. నాకంటూ నేను కూడా ఏమీ చేసుకోను.”
అలా పూర్తిగా సినిమా లోకంలో ఉండడం వల్ల.. ఆడియన్స్ ను కలవడం కోసం ప్రచార కార్యక్రమాల్ని ఉపయోగించుకుంటానంటున్నాడు నవీన్. సినిమా ప్రచారం కంటే, ప్రేక్షకుల్ని కలుస్తున్నాననే ఎక్సయిట్ మెంట్ తనలో ఎక్కువగా ఉంటుందని చెబుతున్నాడు.
“మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” సినిమా ప్రచారంలో భాగంగా గ్రేట్ ఆంధ్రకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు నవీన్ పొలిశెట్టి. ఈ సినిమాలో స్టాండప్ కామెడీ చేశాడు నవీన్. అందుకే త్వరలోనే స్టార్ట్ చేయబోయే ప్రచార కార్యక్రమానికి కూడా స్టాండప్ టూర్ అని పేరుపెట్టారు. ఇందులో భాగంగా కుదిరితే యూఎస్ఏ లో కూడా పర్యటిస్తానంటున్నాడు ఈ హీరో.
ఇక జాతిరత్నాలు కాంబినేషన్ కూడా రిపీట్ అవుతుందని చెబుతున్నాడు నవీన్. ప్రస్తుతం దర్శకుడు అనుదీప్ తో చర్చలు సాగుతున్నాయని, ఓ హిలేరియస్ సబ్జెక్ట్ ఆల్రెడీ అనుకున్నామని, వచ్చే ఏడాది సెట్స్ పైకి వస్తుందని ప్రకటించాడు.