విశాఖ సాగర తీరం సందర్శకులకు ఎపుడూ ఆకట్టుకునే అద్భుతమైన ప్రదేశంగా ఉంటూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో విశాఖ బీచ్ ప్రాంతం పొలిటికల్ వాక్ కి కేంద్రంగా మారింది. సరిగ్గా దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆగస్ట్ పదిహేనుని విశాఖ బీచ్ లో సమైక్యా వాక్ అంటూ టీడీపీ అధినేత జాతీయ జెండాతో చంద్రబాబు సందడి చేశారు. టీడీపీ శ్రేణులతో ఆయన పాదయాత్ర చేసి విశాఖ బీచ్ లో కొత్త వేదికను కనుగొన్నారు.
కట్ చేస్తే ఇపుడు బీజేపీ వంతు అయింది. చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ అయింది. ఇస్రో శాస్త్రవేత్తల మేధస్సుకు అది అపూర్వ నిర్వచనంగా ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ విశాఖలో జయహో భారత్ అంటూ మరో వాక్ నిర్వహించింది. జాతీయ జెండాను చేత బూని దగ్గుబాటి పురంధేశ్వరి సహా ఇతర బీజేపీ నేతలు అంతా బీచ్ రోడ్ లో జాతీయ స్పూర్తి వాక్ అంటూ సందడి చేశారు.
నాడు చంద్రబాబు జాతీయ జెండా చేత బట్టి విశాఖ బీచ్ లో వాక్ చేస్తే ఇపుడు బీజేపీ అదే జాతీయ జెండాతో జయహో భారత్ వాక్ నిర్వహించింది. బీచ్ తీరం ఇలా పొలిటికల్ వాక్ కి కేంద్రంగా మారిపోతోంది అని అంటున్నారు. సాయంత్రం వేళ సేదతీరేందుకు వచ్చే సందర్శకులకు ఈ పొలిటికల్ వాక్ ఎలా ఉందో కానీ రాజకీయ పార్టీలకు మాత్రం విశాఖ సాగర తీరం రూపేణ మరో అద్భుత కేంద్రం అయితే దొరికింది అని అంటున్నారు.
రానున్న రోజులలో బీచ్ వేదికగా మరెన్ని వాక్స్ జరుగుతాయో. ఎందుకంటే విశాఖ బీచ్ లో అటు నుంచి ఇటూ పొడవైన రోడ్ లో ఎంత దూరమైనా హాయిగా నడచిపోవచ్చు. ప్రచారానికి ప్రచారం అహ్లాదానికి ఆహ్లాదం. కెరటాల కేరింతల నడుమ రాజకీయ కేరింతలతో సరికొత్త అనుభూతులు వచ్చినా ఆశ్చర్యం లేదంతే.