తనకు నచ్చితే ఆకాశానికి ఎత్తడం, నచ్చకపోతే పాతాళానికి తొక్కేసేలా వార్తలను ఎలా రాయాలో ఆంధ్రజ్యోతి బాగా ట్రైనింగ్ ఇస్తోంది. ఏపీ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ ట్వీట్ ఆంధ్రజ్యోతి నగ్నత్వాన్ని బట్టబయలు చేసింది. ఆంధ్రజ్యోతి -ఏబీఎన్ ఎండీ ఆర్కేను ఈనాడు అధినేత రామోజీరావు నగ్నంగా నిలబెట్టాడు. అదెలాగో ఈ కథనాన్ని చదివితే తెలుసుకోవచ్చు.
పీవీ రమేశ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సీఎంవో మాజీ అధికారి. పదవీ విరమణ అనంతరం ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. సీఎం జగన్ ప్రధాన సలహాదారుల్లో ఆయన ఒకరు. పీవీ రమేశ్ శుక్రవారం ఒక ట్వీట్ చేశారు. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పూర్తి విరుద్ధంగా రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకే ట్వీట్‌కు ఆర్కే మార్క్ వక్రభాష్యం ఎలా ఉందో చదివి తరిద్దాం రండి.
‘ప్రభుత్వ పెద్దల కోసమే పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు!’ శీర్షికతో ప్రభుత్వ సలహాదారు పీవీ రమేశ్ ట్వీట్ అంటూ ఇచ్చారు. ఇక వార్తలోకి వెళితే…. ‘రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సీఎంవో మాజీ అధికారి, ప్రభుత్వ సలహాదారు పీవీ రమేశ్ శుక్రవారం చేసిన ట్వీట్ ఉన్నతాధికార వర్గాల్లో సంచలనం రేపింది. ‘ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు’ అని పీవీ రమేశ్ ట్వీట్ చేశారు. దీనిని ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్‌కు ట్యాగ్ చేశారు. దీంతో ఈ ట్వీట్ అధికారవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది’ అని రాసుకొచ్చారు.
ఇదే వార్తను తెలంగాణ ఎడిషన్‌లో ‘ఏపీలో ప్రభుత్వ పెద్దల కోసమే పనిచేస్తున్న ఐఏఎస్, ఏపీఎస్‌లు!’ అంటూ మరింత మసాలా పూసి రాశారు.
పీవీ రమేశ్ ట్వీట్‌ను ఈనాడు పత్రికలో ఏ విధంగా రాశారో తెలుసుకుందాం.
‘కస్టమర్ సర్వీసులా ఐఏఎస్’ అనే శీర్షికతో సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ట్వీట్ అంటూ ఇచ్చారు. ఇక వార్త విషయానికి వస్తే…ఎలా సాగిందంటే… ‘ఐఏఎస్ అన్నది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను సంతృప్తి పరిచే కస్టమర్ సర్వీసులా మారిం దంటూ శ్రీసిద్ధూ అనే ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ ట్వీట్ చేశారు.
‘సర్వీసులో ఉన్న అధికారుల్లో కొందరు ప్రజా ప్రయోజనాల కోణంలో నిర్ణయాలు తీసుకోకుండా అధికారంలో ఉన్న వారిని సం తృప్తి పరిచేందుకు వ్యవస్థలను, చట్టాలను నాశనం చేస్తున్నారు’ అంటూ స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్పాగ్లీ అంతర్జాతీయ అధ్యయన కేంద్రంలో సీనియర్ పరిశోధకులుగా పనిచేస్తున్న పుకుయామా ఫ్రాన్సిస్ చేసిన వ్యాఖ్యలనూ రమేశ్ పోస్టు చేశారు. ఈ పోస్టుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘాలను ట్యాగ్ చేశారు’…అని ఈనాడులో వార్తను ముగించారు.
పీవీ రమేశ్ ట్వీట్ ఏమీ రహస్యం కాదు. అసలు ఈ ట్వీట్లో రమేశ్ సొంత అభిప్రాయం అంటూ ఒక్క పదం కూడా లేదు. ఐఏఎస్ అధికారి శ్రీసిద్ధూతో పాటు సీనియర్ పరిశోధకులు పుకుయామా ఫ్రాన్సిస్ ఉటంకించిన విషయాలను తన ట్వీట్లో ప్రస్తావించడం ద్వారా…వాటితో రమేశ్ ఏకీభవిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆంధ్రజ్యోతిలో రాసినట్టు ఏపీలో ప్రభుత్వ పెద్దల కోసమే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పని చేస్తున్నారని పీవీ రమేశ్ ఎక్కడ చెప్పారు?
అయినా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు రాయడం ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కేకు ఇదేమీ కొత్తకాదు. అసలు ఆయన జర్నలిజం ప్రస్థానమే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అయితే ఈనాడులో రమేశ్ ట్వీట్‌ను ఉన్నది ఉన్నట్టు రాసి ఆర్కేను రామోజీ నట్టి నడిబజారులో దిగంబరంగా నిలబెట్టాడు. బహిరంగంగా అందరికీ కనిపించే విషయాన్నే ఆంధ్రజ్యోతి ఇంతగా వక్రీకరించి రాస్తున్నదంటే…ఇక కనిపించని వాటి గురించి రాసే వాటిలో ఏ మాత్రం నిజాలుంటాయో అర్థం చేసుకోవచ్చు.