ప్రభుత్వం అసంబధ్ద నిర్ణయాలు తీసుకున్నదని భావిస్తే…ప్రతిపక్షాలు గవర్నర్ లేదా కేంద్ర సర్కార్, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆయా సంస్థలు లేదా వ్యక్తులకు సమర్పించే వినతిపత్రాల్లో వాస్తవాలను చెబుతూ….పరిశీలించి న్యాయం చేయాలని అభ్యర్థించడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది.
కానీ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రాసే వాటిని విజ్ఞాపన లేఖలనే కంటే బెదిరింపు లేఖలనడమే సరైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల ఆమోదానికి గవర్నర్‌కు నేడు వెళుతాయనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు యనమల రామకృష్ణుడు లేఖ రాశాడు. ఆ లేఖను జాగ్రత్తగా గమ నిస్తే…చట్టాలు, న్యాయ వ్యవస్థ, శాసన నిబంధనలు తనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు, అందువల్ల తాను చెప్పినట్టు వినాలనే అహంకార ధోరణి ప్రతిబింబిస్తోందనే వాదన తెరపైకి వచ్చింది. అంతేకాదు, కొన్ని వాక్యాల్లో ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ కూడా కనిపిస్తోందంటున్నారు.
అమరావతిని నాశనం చేయాలన్న దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తున్న రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేయడం కాకుండా ఆదేశిస్తున్నట్టుందంటున్నారు. మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల విషయంలో అవసరమైతే కేంద్ర అటార్నీ జనరల్ అభిప్రాయం కూడా తీసుకోవాలని యనమల కోరడం వింతగా ఉంది. ఎప్పుడు ఏ పని చేయాలో గవర్నర్‌కు తెలియదా? అనే ప్రశ్న వస్తోంది.
‘ ఆ రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపించాలి. లేనిపక్షంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం రగిలే అవకాశం ఉంది’ అని లేఖలో ప్రస్తావించాడు. ఈ వాక్యాలు గవర్నర్‌ను బెదిరించడం కాదా? గవర్నర్‌ను నియమించింది కేంద్రం కాదా? గవర్నర్ ఆమోదించకుండానే రాష్ట్రపతికి బిల్లులు పంపుతారా? కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వివాదం చెలరేగితే తప్ప తాము బతికి బట్టకట్టలేమని భావిస్తున్న టీడీపీ…ఈ రాజధాని బిల్లుల విషయంలో మాత్రంగా వింతగా కోరుకోవడం ఏంటి?