Advertisement

Advertisement


Home > Politics - Gossip

అందరిదీ కేసుల గోల.. ఆయనది కాసుల గోల

అందరిదీ కేసుల గోల.. ఆయనది కాసుల గోల

టీడీపీలోని మాజీ మంత్రులంతా తలా ఒక స్కామ్ లో ఇరుక్కుపోయారు. అచ్చెన్నాయుడు ఆల్రెడీ ఊచలు లెక్కబెడుతుంటే.. మిగతావారు లైన్లో ఉన్నారు. చినబాబుకి కూడా త్వరలోనే బేడీలు పడతాయని అంటున్నారు. వీరితోపాటు మరో మాజీ మంత్రి కూడా తీవ్రమైన విచారంలో మునిగిపోయారట. అయితే ఈయనది కేసుల గోల కాదు, కాసుల గోల. తవ్వితే కేసులు చాలానే బయటపడతాయనుకోండి, అది వేరే విషయం. ప్రస్తుతానికైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని సమాచారం.

గత ఎన్నికల్లో కోట్లు కుమ్మరించినా కూడా ఎమ్మెల్యేగా గెలవకపోయాననే బాధ ఓవైపు ఉండగానే.. ఆయన ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలు ఇబ్బందుల్లో చిక్కుకోవడం మరో కారణం అని తెలుస్తోంది. కరోనా టైమ్ లో దాదాపుగా అన్ని విద్యాసంస్థలదీ ఇదే సమస్య. అయితే సదరు మాజీ మంత్రికి చెందిన విద్యాసంస్థలు మాత్రం పూర్తిగా నిబంధనలకు నీళ్లొదిలేశాయి. పవర్ చేతులో ఉన్నన్ని రోజులు అడ్డదిడ్డంగా పర్మిషన్లు తెచ్చుకుని ఆడింది ఆట, పాడింది పాటగా సాగించారు. ప్రభుత్వం మారడంతో విద్యాశాఖ అధికారులు నిబంధనల విషయంలో పట్టి పట్టి చూడటంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితి.

ప్రస్తుతానికి కరోనా సెలవలు ఉన్నా.. కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి సదరు మాజీ మంత్రికి చెందిన విద్యాసంస్థల్లో సగానికి పైగా వేరే యాజమాన్యానికి బదిలీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలివ్వకుండా స్టాఫ్ ని పూర్తిగా తగ్గించేసుకున్నారు. అడ్మిషన్లు లేకపోవడంతో ఆన్ లైన్ క్లాసులు, పాఠ్యపుస్తకాల పేరుతో వ్యాపారం మొదలు పెట్టారని చూశారు. తల్లిదండ్రులు ఉత్సాహం చూపించినా పుస్తకాల వ్యాపారాన్ని కొన్నిచోట్ల విద్యాశాఖ అధికారులు అడ్డుకోవడంతో చిక్కుల్లో పడ్డారు.

టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న ఆయన, పార్టీ అధికారంలో ఉండగా బాగానే వెనకేసుకున్నారు. అయితే తన ఉన్నతికి కారణమైన స్కూల్స్ ఆయనకిప్పుడు భారంగా మారుతున్నాయి. ఎలాగోలా నెట్టుకొద్దామనుకున్నా.. వైసీపీ ప్రభుత్వంలో తనకి ఇబ్బందులు తప్పవని ఆయన డిసైడైపోయారు.

అందుకే కొన్నిరోజులుగా ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. సొంత జిల్లాలో, ఇతర జిల్లాల్లో బినామీల పేరుతో పెట్టిన ఆస్తుల్ని విక్రయించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. వైసీపీ కీలక నేతలతో టచ్ లోకి వెళ్లినా జిల్లాలోని మంత్రి అడ్డుపుల్ల వేయడంతో ఆయన ఎంట్రీని జగన్ కూడా ఇష్టపడటంలేదని తెలుస్తోంది. చేసేదేం లేక అజ్ఞాతంలో కాలం గడుపుతున్నారు సదరు మాజీ మంత్రి. 

మిమ్మల్ని యాంకర్ గా తీసెయ్యాలి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?