నారా లోకేష్ పేరు చెబితే వణుకు వచ్చేస్తోందంటూ సెటైర్లు వేశారు నటుడు పృధ్వీరాజ్. వణుకుతో దుప్పట్లు కప్పుకొని రోడ్లపై తిరగాల్సి వస్తోందంటూ వ్యగ్యంగా అన్నారు. లోకేష్ ట్వీట్ల గురించి ఆలోచించేవారు, స్పందించాలని అనుకునే వారు పార్టీలో ఎవ్వరూ లేరన్నారు.
“టీడీపీ వాళ్లు లోకేష్ ను ఫ్యూచర్ సీఎం అంటున్నారు. అర్థం ఉందా ఆ మాటలో. బహుశా వాళ్ల ఇంట్లో లోకేష్ సీఎం అనుకుంటా. పూర్తిగా రంగంలోకి దిగితే తట్టుకోలేరని లోకేష్ ట్వీట్లు
పెడుతున్నారు. డబ్బులిస్తే ఇలాంటి ట్వీట్లు పెట్టేవాళ్లు చాలామంది ఉన్నారు. వణికిపోవడానికి అక్కడున్నది ఆషామాషీ వ్యక్తి కాదు, జగన్.”
లోకేష్ సవాళ్లకు స్పందించేంత తీరిన, అవసరం వైసీపీకి లేవంటున్నారు పృధ్వి. భారతంలో ఉత్తర కుమారుడితో లోకేష్ ను పోల్చారు.
“లోకేష్ నేరుగా జగన్ కే సవాల్ విసురుతున్నానని అనుకుంటున్నారు. దానికి స్పందించట్లేదని చాలామంది అడుగుతున్నారు. అంటే ఏంటి, లోకేష్ సవాళ్లకు కూడా స్పందించాలా? స్పందించడానికి ఏముంది అక్కడ. ఉత్తర కుమారుడిలా కనిపిస్తాడు లోకేష్. లోకేష్ ట్వీట్లను పార్టీలో ఎవ్వరూ పట్టించుకోరు. అందరికీ చాలా పనులున్నాయి.”
దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి, మినిస్టర్ పదవి దక్కించుకొని, చివరికి మంగళగిరి అనే పదం కూడా పలకలేని వ్యక్తి విమర్శలు చేస్తే మేం పట్టించుకోవాలా అంటూ ప్రశ్నించారు పృధ్వి. ఎన్టీఆర్ మనవడైన లోకేష్, ముందు తెలుగు మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు.