ఎన్నికల ప్రచార సమయం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాడుతున్న భాష చాలా చాలా అద్వాన్నంగా ఉంటోంది. ప్రత్యేకించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు వాడుతున్న భాష పరమలేకిగా ఉంటోంది. టీ కొట్లో వాదోపవాదాలు చేసుకునేవాళ్లు కూడా అలా మాట్లాడుకోరేమో!
గత కొన్నాళ్లలో జగన్ విషయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు కొన్ని కొన్ని వంటే ఆశ్చర్యం కలగకమానదు. 'చెడ పుట్టాడు..' అంటూ వైఎస్ జగన్ విషయంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడు ఇలాంటి పదప్రయోగాలు చాలా చేశారు. జగన్ మీద ఏదో ముద్ర వేసేయాలనే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు అలాంటి మాట్లాడారు.
ఒకటి చంద్రబాబుకు జగన్ మీద అత్యంత తీవ్రమైన అసహనం ఉంది. ఆ అక్కసుతో ఇలా మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. రెండో అంశం.. ఇలా మాట్లాడి, ఇలాంటి మాటలతో ప్రజల్లో జగన్ మీద ఒక ఒపీనియన్ క్రియేట్ చేయాలని చంద్రబాబు చూశారు. అయితే అది సఫలం కాలేదు. ప్రజలు భారీ మెజారిటీతో జగన్ ను గెలిపించారు.
ఇక ఓడిపోయిన తర్వాత అయితే చంద్రబాబు నీఛ భాషకు హద్దులేకుండా పోయింది. చాలా లేకి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీనికితోడు లోకేష్ కూడా తయారయ్యారు. 'నీ బాబు..' అంటూ లోకేష్ ట్వీట్లు పెడుతూ ఉన్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల వ్యాపారాల్లో వినియోగించుకోవడం గురించి చంద్రబాబు మాట్లాడుతు.. 'అది మీ తాత సొమ్మా..' అని ప్రశ్నించారు. అది ఎవరి తాత సొమ్మూ కాదు. అది ప్రజల సొమ్ము.
దాన్ని తీసుకెళ్లి కోడెల తనయుడి షాపుల్లో వాడుకోవడాన్ని చంద్రబాబు ఇలా సమర్థిస్తూ ఉన్నారు. ఈ విషయంలో జగన్ కు కాదు చంద్రబాబు మీరు జవాబుదారీగా ఉండాల్సింది, ప్రజలకు. ప్రజలను ఉద్దేశించి కూడా మీరు ఇదే మాట మాట్లాడుతున్నట్టా? అని ప్రశ్నించాల్సి వస్తోంది. చంద్రబాబు నాయుడు లీకుల రూపంలో ఇస్తున్న మాటల్లో కూడా.. పదప్రయోగాలు మరీ దిగువ స్థాయిలో ఉంటున్నాయి. అధికారం కోల్పోతున్న దశ నుంచి.. చంద్రబాబు నాయుడు తన మాటలను మరింత దిగువస్థాయికి తీసుకెళ్లిపోతున్నట్టున్నారని పరిశీలకులు అంటున్నారు.