నిర్మాత దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి అని అంటారు. మొత్తానికి ఆయన రెడ్డి సామాజిక వర్గానికే చెందిన వారే. ఆయనకు వైకాపాతో సన్నిహిత సంబంధాలు వున్నాయి. ఆయన అత్యంత సన్నిహిత బంధుగణంలో వైకాపా ఎమ్మెల్యేలు వున్నారు. అయినా పాపం, ఆయనను ఇటీవల సిఎమ్ క్యాంప్ కొంచెం దూరం పెట్టింది. ఇటీవల పేర్ని నానితో జరిగిన మీటింగ్ కు హాజరయ్యారు కానీ, సిఎమ్ ఆఫీసు లోని కీలక అధికార వర్గానికి మాత్రం దిల్ రాజు అంటే గుర్రుగానే వుంది.
వకీల్ సాబ్ విడుదల టైమ్ లో ఓ ఐఎఎస్ అధికారిని కోర్టుకు లాగడం వెనుక దిల్ రాజు వున్నారని, సిఎమ్ కార్యాలయంలోని ఐఎఎస్ లాబీ బలంగా నమ్ముతోంది. అలాగే ఆయన సినిమా ఫంక్షన్ లోనే పవన్ కళ్యాణ్ నేరుగా సిఎమ్ జగన్ ను టార్గెట్ చేసారని కూడా వైకాపాలో ప్రచారం వుంది. అలా అన్ని విదాలా దిల్ రాజుకు వైకాపాలో, వైకాపా ప్రభుత్వంలో కేక్ వాక్ అయితే లేదు.
ఇలాంటి నేపథ్యంలో మరోసారి నిన్నటికి నిన్న రిపబ్లిక్ ఫంక్షన్ జరిగింది. పవన్ స్పీచ్ కు దిల్ రాజు పడిపడి నవ్వడం వీడియోల్లో కాస్త ఎక్కువే చూపించారు. పైగా దిల్ రాజు ను ఉద్దేశించి పవన్ ' ఎందుకండీ నాతో వకీల్ సాబ్ సినిమా తీసారు. మీరు కూడా రెడ్డే కదా. రెడ్డి..రెడ్డి (జగన్ ను ఉద్దేశించి) మాట్లాడుకుని సెట్ చేసుకోండి' అనే అర్థం వచ్చేలా కామెంట్లు విసిరారు.
ఆ మాటలకు దిల్ రాజు సైలంట్ గా వుంటే వేరు ఇంకా పడీ పడీ నవ్వారు. ఆయనకు దగ్గరగా వుండే వాళ్ల సంగతి చెప్పనక్కరే లేదు. ఇప్పడు ఇవన్నీ కూడా నేరుగా సిఎమ్ దృష్టికి వెళ్తాయి. అందులో సందేహం లేదు. చాలా మంది ఇలాంటి పనుల మీదే వుంటారు. 'అసలుకే దిల్ రాజుకు అక్కడ ఎంట్రీ అంతంత మాత్రంగా వుంది. ఇప్పుడు దీంతో ఆయనకు మరింత ఇబ్బంది' అని ఇండస్ట్రీ వ్యవహారాలను ప్రభుత్వం దగ్గర ప్రస్తావించి పరిష్కరించడం లో కీలకంగా వ్యవహరించే ఓ ప్రముఖ నిర్మాత అన్నారు.