సాయి ధరమ్ తేజ్ ప్రమాదం జరిగిన తరువాత ఒకటి రెండు చానెళ్లు కాస్త అతి చేసి వుండొచ్చు. సాధారణంగా ఇలాంటివి కేవలం సాయి ధరమ్ తేజ్ విషయంలోనే కాదు, చాలా సార్లు జరిగాయి. జస్ట్ అవి ఆ రోజుకో, ఆ మర్నాటికో పరిమితం.
సరే, ఆ సంగతి పక్కన పెడితే ఆ రెండు రోజుల తరువాత మీడియా మొత్తం సాయి ధరమ్ తేజ్ విషయం మరిచిపోయింది. ఆసుపత్రి నుంచి లైవ్ బులిటెన్లు ఆగిపోయాయి. ప్రమాదం జరిగి 15 రోజులు దాటిపోయింది.
ఇంకా ఆసుపత్రిలోనే వున్నారు. బులిటెన్లు లేవు. ఎలా వుందీ అని వార్త ప్రసారం చేసిన మీడియా లేదు. ఇంకా షాక్ కోమాలోనే వున్నారు. అన్న గ్యాసిప్ లు వినిపిస్తున్నా పట్టించుకున్న మీడియా లేదు.
అంతే కాదు, మెగా పీఆర్ టీమ్ ఆయన ఫ్యామిలీ కోరిక మేరకు చాలా చానెళ్ల యూ ట్యూబ్ అక్కౌంట్లు నుంచి చాలా వీడియోలు డిలీట్ చేయించారు. మరి మీడియా సహకారం లేకుంటే ఇలా జరిగేదా? మీడియా ఒకటి రెండు రోజులు మినహా ఇంత సంయమనం పాటిస్తే, పవన్ కళ్యాణ్ పని గట్టుకుని సుద్దులు చెప్పారు.
పైగా నోరు జారారో? మరేంటో కానీ 'సాయి ధరమ్ తేజ్ ఇంకా కోమాలో పడి వున్నాడు కదా' అనేసారు. ఇప్పుడు ఇక మీడియా అదే పని మీద వుంటే? ఆసుపత్రి ఆయాలు, నర్సులు, వార్డ్ బాయ్ లు, తమకు పరిచయం వున్న డాక్టర్లు ఇలా ఏదో ఒక సోర్స్ నుంచి విషయాలు రాబట్టడం, కథనాలు ప్రసారం చేయడం, అసలు ఈ తరహా ప్రమాదాలు ఏమిటి? దాని సమస్యలు ఏమిటి? ఇలా కథనాలు చేయడం మొదలుపెడితే…
ఎవరి పని వారు చేస్తూ వుంటారు. పవన్ ఇలాంటి సినిమాలే చేయడం ఏమిటి? ఈ టైపు చేయవచ్చు కదా? అని చాంతాడంత జాబితా ఇవ్వొచ్చు. పవన్ రాజకీయాలు ఇలా చేయడం ఏమిటి? ఇలా చేయాలి కదా అని సలహాలు ఇవ్వొచ్చు. కానీ ఆయన స్టయిల్ ఆయనది. మీడియా వ్యవహారాలు మీడియావి.
ఆ యొక్క ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఇలా ఎలా పడితే అలా మాట్లాడితే అనవసరంగా కెలుక్కున్నట్లు అవుతుంది. ఇప్పుడు ఆయన బాగానే వుంటారు. మెగా పీఆర్ టీమ్ నానా బాధలు పడాలి. తెరవెనుక మీడియాకు కోపం రాకుండా బాబూ నాయనా అంటూ కిందా మీదా పడాలి.