వైసీపీ మహిళా ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు పార్టీలో ఇబ్బందులు తప్పడం లేదు. పొమ్మనకుండానే సొంత జిల్లా (చిత్తూరు)కు చెందిన కొందరు ‘పెద్ద’లు ఆమెకు పొగపెడుతున్నారనే వార్తలొస్తున్నాయి. స్వతంత్రంగా వ్యవహరించే రోజా నైజం ఆ ‘పెద్దాయన’కు అసలు గిట్టడం లేదని సమాచారం. దీంతో నగరిలో రోజాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వర్గాన్ని పెంచి పోషిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో రోజాకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి.
విపక్షాల పాలిట రోజా పులి. ఇదే స్వపక్షానికి వచ్చే సరికి పిల్లిలా మారిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆమె అనుచరులు వాపోతున్నారు. తాజాగా నిండ్ర ఎంపీపీ ఎన్నిక విషయంలో రోజాకు వ్యతిరేకంగా, వైసీపీలోని వైరి వర్గం నాటకానికి తెరలేపింది. వైసీపీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రోజాపై తిరుగుబాటు చేయాలంటే, పార్టీలోనే బలమైన ‘పెద్ద’ల అండలేనిదే ఇది సాధ్యం కాదని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు.
గతంలో రోజాకు మంత్రి పదవి రాకుండా ఎవరైతే అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోందే, వారే అడగడుగునా ఆమెను ఇబ్బంది పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా నిండ్ర మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు జరిగాల్సిన ఎన్నికలు వరుసగా రెండోరోజూ కూడా వాయిదా పడడానికి రోజా వ్యతిరేక రాజకీయాలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిండ్రలో ఐదుగురు ఎంపీటీసీలు రోజానుకాదని వేరే అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించడం సంచలనం రేకెత్తిస్తోంది.
రోజాకు మద్ద తుగా ఇద్దరు వైసీపీ, ఒక టీడీపీ ఎంపీటీసీ ఉన్నారు. ఇదే రోజాను వ్యతిరేకిస్తున్న చక్రపాణిరెడ్డి వర్గంలో ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలున్నారు. నగరి వైసీపీ అంతర్గత విభేదాలను నిండ్ర ఎంపీపీ ఎన్నిక బహిరంగపరిచింది. తాను ముఖ్యమంత్రి జగన్‌కు విధేయుడినని, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా తిరిగి పోటీ చేయాలని రోజాకు చక్రపాణిరెడ్డి సవాల్ విసురుతున్నారు. అయినా రోజా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వున్నారు.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. నగరిలో రోజాకు వ్యతిరేక వర్గమైన మున్సి పల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ భార్య శాంతికి ఈడిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టారు. ఇలా రోజా ప్రమేయం లేకుండా, ఆమె వ్యతిరేకులను వైసీపీ ప్రోత్సహిస్తోంది. దీన్ని బట్టి రోజాకు వ్యతిరేకంగా ఎంత బలమైన శక్తి పని చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు జగన్‌పై ఈగ వాలినా ఓర్వలేని రోజాకు సొంత పార్టీలోనే ఇబ్బందులు ఎదురవడంపై వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.