ప్రభుత్వాలు ఇచ్చే జీతం తీసుకుంటారు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లుగా మంచి పోస్టుల్లో ఉంటారు. కానీ డ్యూటీ చేయడానికి మాత్రం వారికి మనసు రాదు. ఎప్పుడూ ఎవరికీ నాడి పట్టిన పాపాన పోరు, కనీసం మందుల చీటీ కూడా రాసి ఎరగరు. అందరి గురించి కాదు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తూ ప్రైవేటు వైద్యంతో కోట్లు సంపాదించుకుంటున్న కొంతమంది డాక్టర్ల గురించే ఇదంతా. ఇలాంటి వారి ఆటలు సాగకుండా ఇకపై వైసీపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
గత ప్రభుత్వాలు కూడా ఈ తరహా నిర్ణయాలు తీసుకున్నా.. వాటి అమలు తీరు అయోమయంగా మారింది. అయితే ఈ సారి మాత్రం జగన్ సర్కారు కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. గతంలోని నిబంధనలన్నిటినీ పక్కాగా అమలు చేస్తూ బయోమెట్రిక్ హాజరుతో గాడితప్పిన వైద్యుల ఆటకట్టించాలనే ఆలోచనలో ఉంది.
ఉంటే అటు.. లేదంటే ఇటు..
ప్రభుత్వం ఇచ్చే జీతం కావాలి, ప్రైవేటు ప్రాక్టీసుతో వచ్చే గీతం కావాలి. ఇలా రెండిటికీ అలవాటు పడిన డాక్టర్లు అటు ఉద్యోగాన్ని వదులుకోలేరు, ఇటు ప్రైవేటు ప్రాక్టీస్ ని కూడా పక్కనపెట్టరు. కానీ ఇప్పుడు రెండిటిలో ఏది కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే.. కచ్చితంగా ప్రైవేటు ప్రాక్టీస్ మానుకోవాల్సిందేనంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతోంది.
ప్రభుత్వ టీచర్లు ప్రైవేటుగా ట్యూషన్లు చెప్పడంలేదా. ప్రభుత్వ ఉద్యోగులు ఎల్ఐసీ ఏజెంట్లుగా పనిచేయడంలేదా..? ప్రభుత్వ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంలేదా..? ఇక్కడ ఈ ఉద్యోగాలకు, ఆ ప్రైవేటు పనులతో ఏమాత్రం నష్టం రాదు. కానీ ప్రభుత్వ వైద్యుడు ఆస్పత్రిలో అందుబాటులో ఉండాల్సిన సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్ కి వెళ్తే ఆస్పత్రికి వచ్చేవారి ప్రాణాలే పోతాయి. ఇది మరింత ప్రమాదకరం. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో మరింత స్ట్రిక్ట్ గా ఉండాలనుకుంటోంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులు అమలు చేస్తూ.. వైద్యరంగాన్ని పటిష్టం చేయాలని చూస్తోంది జగన్ ప్రభుత్వం. కానీ వైద్యుల సహాయ నిరాకరణతో వ్యవహారం ముందుకు సాగడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రులకు అతిథులుగా వస్తుంటారు డాక్టర్లు. ఒకటీ రెండు ఓపీలు చూసి.. డబ్బు పెట్టుకోగలరు అనుకుంటే బయటకు రిఫర్ చేస్తుంటారు.
ఎలాగూ సర్కారు ఆస్పత్రుల్లో వైద్యపరీక్షల సామాన్లు సరిగా పనిచేయవు, పనిచేయకుండా చేస్తారంతే.. అందుకే ప్రతి చిన్న పరీక్షకు కూడా బయటకు రిఫర్ చేస్తుంటారు. లేకపోతే సాయంత్రం మన క్లినిక్ కు వచ్చేయండి అంటూ చెప్పి పంపించేస్తారు.
ఇలాంటివన్నీ నిత్య కృత్యాలే. ఈ దశలో అటు ప్రభుత్వం మోసపోతోంది, ఇటు ప్రజలు నష్టపోతున్నారు. ఈ రెండిటికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ప్రాక్టీస్ పై వేటు వేస్తోంది.
2019లో రిటైర్డ్ ఐఏఎస్ సుజాతారావు నేతృత్వంలో సంస్కరణల కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేటు ప్రాక్టీస్ చేయకుండా, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సాయంత్రం 5నుంచి 7 గంటల వరకు సొంత ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించింది. అయితే ఇది మరీ విపరీతంగా తోస్తుంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఫీజులు తీసుకుంటారనే ప్రచారం మొదలవుతుంది. ఇలాంటి వాటిపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం సమగ్రమైన నూతన నిబంధనలు తెరపైకి తేవాలనుకుంటోంది. బయోమెట్రిక్ హాజరుతో ప్రభుత్వ వైద్యులకు బంధనాలు ఏర్పాటు చేయాలనుకుంటోంది.