పొత్తు ధర్మాలతో ప్రతి ఎన్నికను త్యాగం చేసుకుంటూ పోతున్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద షాకిచ్చింది. రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీ హోదా నుంచి జనసేనను తొలగించినట్టు పరోక్షంగా సంకేతాలిచ్చింది. గాజు గ్లాసుని ఫ్రీ సింబల్ గా మార్చేసింది.
ఏపీలో ప్రాంతీయ పార్టీలుగా కేవలం వైసీపీ, టీడీపీకి మాత్రమే గుర్తింపునిచ్చింది. వైసీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు రిజర్వ్ డ్ గుర్తులుగా ఉంటాయని పేర్కొంది.
జాతీయ పార్టీల హోదాలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీఎంసీ, బీఎస్పీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలకు రిజర్వ్ డ్ గుర్తులుంటాయని చెప్పింది. తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం తోపాటు వైసీపీ, టీడీపీలకు కూడా రిజర్వ్ డ్ గుర్తులను కేటాయించింది. అంటే తెలంగాణలో కూడా వైసీపీ, టీడీపీ అభ్యర్థులు తమ పార్టీ గుర్తులతోనే పోటీ చేయొచ్చనమాట.
గాజు గ్లాసు గాయబ్..
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులంతా గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనసేన, బీజేపీకి సీట్లను త్యాగం చేయడంతో వారికి ఆ గుర్తుని దూరం చేసింది ఎన్నికల కమిషన్.
ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయలేదు. దీంతో గాజు గ్లాసు గుర్తుని స్వతంత్ర అభ్యర్థికి కేటాయించారు. దీనిపై జనసేన న్యాయ పోరాటానికి దిగినా ఫలితం లేకుండో పోయింది. ఇప్పుడు మరోసారి జనసేన గాజు గ్లాసుని ఫ్రీ సింబల్స్ లిస్ట్ లో కేంద్ర ఎన్నికల సంఘం చేర్చడం చర్చనీయాంశమైంది.
ఆటో, టోపీ, ఇస్త్రీ పెట్టె, ట్రక్కు.. ఈ నాలుగు గుర్తులను తెలుగు రాష్ట్రాల్లో వినియోగించుకోడానికి అవకాశం లేకుండా ఆంక్షలు విధించింది. అదే సమయంలో గాజు గ్లాసు గుర్తుని మాత్రం ఫ్రీ సింబల్ గా పేర్కొనడం విశేషం. అంటే వచ్చే ఎన్నికల్లో కేవలం జనసేన అభ్యర్థులే కాదు, ఎవరైనా గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయొచ్చన్నమాట.
దీనిపై జనసేన సమీక్ష కోరే అవకాశం ఉన్నా.. పదే పదే త్యాగాలతో అసలు గుర్తుకే ఎసరు పెట్టుకున్నారని పవన్ కల్యాణ్ పై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే మండిపడుతున్నారు. ఇకనైనా పార్టీ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలని, కనీసం ఇలాంటి విషయాలను పట్టించుకునేవారికైనా పార్టీ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.