మొన్నటివరకు తెలంగాణలో గవర్నర్, ముఖ్యమంత్రి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. కొన్ని సందర్భాల్లో వాళ్ల మధ్య అనుబంధం 'అంతకుమించి' అన్నట్టుండేది. కేసీఆర్ ఎంతచెబితే గవర్నర్ కు అంత. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కొత్త గవర్నర్ వచ్చారు. వచ్చీ రావడంతోనే తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కేసీఆర్ కు ఇప్పుడు కొత్త చిక్కులు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి.
అవును.. కేవలం రాజ్ భవన్ కే పరిమితం అవ్వాలని కోరుకోవడం లేదు కొత్త గవర్నర్ తమిళసై సౌందరరాజన్. పరిపాలనలో కూడా కలుగజేసుకోవాలని నిర్ణయించారు. ఇదే ఇప్పుడు కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారింది. మొన్నటివరకు ఉన్న నరసింహన్ కేవలం ఉత్సవ గవర్నర్ గా మాత్రమే కొనసాగారు. రాష్ట్ర విభజన టైమ్ లో కాస్త యాక్టివ్ గా పనిచేసినప్పటికీ ఆ తర్వాత పూర్తిగా కేసీఆర్ మాటకే కట్టుబడిపోయారు. కానీ కొత్త గవర్నర్ సౌందరరాజన్ మాత్రం పరిపాలనలో తన మార్క్ చూపించాలని నిర్ణయించారు.
తెలంగాణ అంతగా ప్రబలుతున్న విషజ్వరాలు, డెంగ్యూ ఫీవర్లపై నివేదిక కోరారు గవర్నర్. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో పెరిగిపోతున్న డెంగ్యూ బాధితులు, మరణాలకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా వైద్య-ఆరోగ్య శాఖను కోరారు. దీంతో ఆరోగ్య శాఖలో కలవరం మొదలైంది. గవర్నర్ కు పంపించే నివేదికపై పూర్తిగా అంతా నిమగ్నమైపోయారు.
అటు కేసీఆర్ సర్కార్ ను అప్రతిష్ఠ పాల్జేసిన ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై కూడా కొత్త గవర్నర్ దృష్టిపెట్టారు. వీలైతే అప్పటి ఘటనలపై నివేదికను కోరే అవకాశం ఉంది. ఈ దిశగా కసరత్తు చేయాల్సిందిగా రాజ్ భవన్ అధికారులకు ఆమె ఆదేశాలు జారీచేశారు. మరోవైపు హోంశాఖ, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్స్ కు సంబంధించి ఇప్పటికే నివేదికలు కోరారు.
ఇవన్నీ ఒకెత్తయితే.. ప్రజాదర్బార్ మరోఎత్తు. ప్రజలు ఎవరైనా నేరుగా రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ కు తమ సమస్యలు విన్నవించుకునే కార్యక్రమం ఇది. ఇది కనుక అమలైతే, గవర్నర్ కు ప్రజలకు మధ్య నేరుగా సంబంధాలు ఏర్పడతాయి. అది కచ్చితంగా కేసీఆర్ కు తలనొప్పిగా మారుతుంది.
ఇప్పటికే రాజ్ భవన్ లో యోగా కార్యక్రమాలు ప్రారంభించిన గవర్నర్.. త్వరలోనే ప్రజాదర్బార్ పై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనతో సమాంతరంగా గవర్నర్ మార్క్ ఆజమాయిషీ కూడా మొదలైతే.. గవర్నమెంట్ కు గవర్నర్ కు మధ్య రగడ తప్పకపోవచ్చు.