ఈమధ్య కాలంలో సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఒకటి ఇస్మార్ట్ శంకర్. అటు హీరో రామ్, ఇటు పూరి జగన్నాధ్ కెరీర్ ను మళ్లీ గాడిలో పెట్టిన సినిమా ఇది. ఈ ఒక్క సినిమాతో తన అప్పులన్నీ తీర్చేశాడు పూరి జగన్నాధ్. ఓ కాస్ట్ లీ కారు కూడా కొనుక్కున్నాడు. అలా చాలామంది జాతకాల్ని మార్చేసిన ఇస్మార్ట్ శంకర్ హంగామా వచ్చేనెల నుంచి మరోసారి మొదలుకానుంది.
అవును.. ఇస్మార్ట్ శంకర్ సినిమాను వచ్చేనెలలో జీ5 యాప్ లో పెట్టబోతున్నారు. అంతేకాదు, అదే టైమ్ లో జీ తెలుగు ఛానెల్ లో కూడా ప్రసారం చేయబోతున్నారు. కేవలం టీవీల్లో ఈ సినిమాకు హైప్ ఇచ్చేందుకే ఇప్పటివరకు ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్, సీన్స్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేయలేదు. సరిగ్గా జీ తెలుగులో ప్రసారానికి కొన్నిరోజుల ముందు నుంచి యూట్యూబ్ లో ఇస్మార్ట్ హంగామా మొదలవుతుంది.
అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ తో పోటీపడేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది జీ5. ఇందులో భాగంగా ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ పెద్ద సినిమా తీసుకున్నప్పటికీ దాన్ని టీవీలో ప్రసారం చేయడానికి ముందే యాప్ లో అప్ లోడ్ చేస్తోంది. ఇలా చేయడం వల్ల జీ5కు ఊపు వస్తుందని అ కంపెనీ భావిస్తోంది. గతంలో టాక్సీవాలా, అరవింద సమేత, గీతగోవిందం లాంటి సినిమాల్ని ఇలానే టీవీ కంటే ముందే యాప్ లో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వబోతోంది.
ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ కోసం చాలామంది ఆడియన్స్ వెయిటింగ్. ఇప్పటికీ సోషల్ మీడియాలో సాంగ్స్ రిలీజ్ చేయమంటూ చాలా పోస్టులు పడుతుంటాయి. వాళ్లందరి కోరిక వచ్చేనెలలో నెరవేరబోతోంది.