సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు, చారిత్రక గ్రంథకర్త ఎం.వి.ఆర్.శాస్త్రి కొత్త పుస్తకం “సుభాస్ చంద్ర బోస్''లో చరిత్రాత్మకమైన గాంధీ- బోస్ ఘర్షణను ఆసక్తికరంగా, సాక్ష్యాధారాలతో వివరించే అధ్యాయటం. ఇది గ్రేట్ ఆంద్ర ఎక్స్ క్లూజివ్. స్వాతంత్ర్యపోరాటానికి సంబంధించి మరుగునపడిన చారిత్రక వాస్తవాలను, మన జాతీయ నాయకులలో చాలామందికి తెలియని కోణాలను, నాటి కాంగ్రెసులో నమ్మశక్యంకాని ముఠారాజకీయాలను ఈ అధ్యాయం వివరిస్తుంది. ఈనెల చివరివారంలో వెలువడనున్న ‘సుభాస్ చంద్ర బోస్’ పుస్తకం అమెజాన్లో దొరుకుతుంది.
మనిషిని చంపాలంటే హత్యే చేయనక్కర్లేదు. అహింసతో కూడా పగవాడిని హతం చేయొచ్చు. అహింసాత్మక హననంలో గాంధీ గారి శిష్యాగ్రేసరులు సూపర్ స్పెషలిస్టులు!
సుభాస్ చంద్ర బోస్ భారతదేశంలో ఉన్న చివరి సంవత్సరకాలంలో అతడిని అడ్డగించి, రాజకీయంగా అణగదొక్కి, అహింసాత్మకంగా ఖతం చెయ్యటానికి గాంధీ వర్గం చేయని కుయత్నం లేదు. పన్నని కుతంత్రం లేదు. 1938లో గాంధీ అజ్ఞానుసారం బోసును కాంగ్రెసు అధక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నవారే , అతడు కీలుబొమ్మలా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించేసరికి సంవత్సరం తిరక్కుండా నిష్కారణంగా కత్తికట్టారు. మరుసటి ఏడు (1939) గాంధీ నిలబెట్టి సర్వశక్తులూ ఒడ్డిన పట్టాభి సీతారామయ్యను ఓడించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలో గెలిచి బోస్ మళ్ళీ కాంగ్రెసు ప్రెసిడెంటు అయ్యాడు. అతడిని పనిచేయనివ్వకుండా గాంధీ వర్గం ముంతపోగ పెట్టింది. వారితో వేగలేక మనసు విరిగి అతడు రెండు నెలలకే రాజీనామా చేసి కాంగ్రెసు లోపలే వేరే పార్టీ ఫార్వర్డు బ్లాక్ ను పెట్టుకుంటే ఆహింసామూర్తులు అక్కడా అతడి వెంటపడి నానావిధాల సతాయించారు.
కక్షసాధింపు ఎంతదాకా వెళ్లిందంటే – బోస్ రాజీనామా చేశాక మిగిలిపోయిన అతడి పదవీకాలానికి ఆపద్ధర్మంగా ఎంపికైన రాజేంద్రప్రసాద్ ఎఐసిసి చేత ఇప్పించిన అప్రజాస్వామిక ఆదేశాన్ని బోస్ బహిరంగంగా వ్యతిరేకించాడు. అదే మహాపరాధమైనట్టూ కాంగ్రెసు క్రమశిక్షణ దానివల్లే మంటకలిసినట్టూ ఆవేశపడి కాంగ్రెసు వర్కింగ్ కమిటీ కనీసం ముందు నోటీసు అయినా ఇవ్వకుండా సుభాస్ చంద్ర బోసును మూడేళ్ళపాటు కాంగ్రెసునుంచి బహిష్కరించింది. ఆపద్ధర్మ అధ్యక్షుడి ఆదేశం ధిక్కరించినందుకు ఎన్నికైన అధ్యక్షుడిని ఉన్నపళాన గెంటేయటం నీతులమారి కాంగ్రెసు నేతలకే చెల్లింది. ఇంకా విశేషమేమిటంటే బోసును బహిష్కరించే తీర్మానాన్ని గాంధీ మహాత్ముడే స్వయంగా రాశాడు. తనకు విధేయులు కాని వారందరూ తన విరోదులేనని తలచి వేటాడటం గాంధీజీకి మొదటినుంచీ రివాజు.
ఇంతలా పగబట్టటానికి బోస్ చేసిన నేరమేమిటి? అతడేమైనా పెత్తనం కోరాడా? ఎవరి పవరుకైనా ఎసరు పెట్టాడా? ముఠాలు కట్టాడా? కుట్రలు పన్నాడా? అతడు అడిగిందల్లా కాంగ్రెసులో ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వమని! చెప్పుడు మాటలు విని దేశానికి చెరుపు చేయవద్దని. ముఠా రాజకీయాల స్థాయికి మహానాయకుడు దిగజారరాదని! త్రిపురి కాంగ్రెసులో గాంధీ వర్గం తనను పథకం ప్రకారం అడకత్తెరలో ఇరికించిన తరవాత 1939 మార్చి31న “మై డియర్ మహాత్మాజీ”కి బోస్ రాసిన లేఖలోని ఈ వాక్యాలు చూడండి:
“It is in your hands to save the Congress and the country from calamity. People who are bitterly opposed to Sardar Patel and his group, still have confidence in you and believe that you can take a dispassionate and non-partisan view of things. To them you are a national figure – above parties and groups – and you can therefore restore unity between the warring elements. If for any reason that confidence is shaken and you are regarded as a partisan , then God help us and the Congress.
[Crossroads , Subhas Bose Works, , P.135]
(కాంగ్రెసునూ దేశాన్నీ ఉపద్రవంనుంచి కాపాడటం మీ చేతుల్లో ఉంది. సర్దార్ పటేలునూ అతడి గ్రూపునూ వ్యతిరేకించేవారికి కూడా మీరంటే విశ్వాసం ఉంది. ఏ విషయాన్నయినా మీరు నిర్వికారంగా , నిష్పాక్షికంగా చూస్తారని అందరూ నమ్ముతారు. పార్టీలకంటే గ్రూపుల కంటే ఉన్నతమైన జాతీయ నాయకుడుగా మిమ్మల్ని తలుస్తున్నారు. కలహించుకుంటున్న వర్గాలను మీరు ఐక్యపరచగాలరని అందరూ ఆశిస్తున్నారు. ఏ కారణం చేతైనా ఆ విశ్వాసం సడలి, మీరూ పక్షపాతులేనని ప్రజలు భావించే పక్షంలో మనల్నీ, కాంగ్రెసునూ దేవుడే ఆదుకోవాలి.) గాంధికీ బోసుకూ తగువల్లా ప్రధానంగా – స్వాతంత్ర్యం ఎలా సాధించాలి , దానికి ఎలా ఉద్యమించాలి అన్న దగ్గర. ఉద్రిక్తంగా ఉన్న అంతర్జాతీయ పరిస్థితులను మనకు అనుకూలంగా మలచుకొని బ్రిటన్ చిక్కుల్లో ఉన్నప్పుడే.
జాతీయపోరాటం చేసి స్వరాజ్యం సాధించాలని సుభాస్ 1938 నుంచీ చెపుతున్నాడు. గాంధీ వర్గం చలించలేదు. బోస్ ముందుగా చెప్పినట్టే త్రిపురి కాంగ్రెసు జరిగి ఆర్నెల్లు తిరక్కుండా రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది మాతృదేశ విముక్తికి అది బంగారు అవకాశమని సుభాస్ తలిచాడు. తన అధ్యక్ష పదవి ఊడగొట్టేదాకా నిద్రపోని గాంధీ లీలలు మరచి బోస్ గాంధీ చెంతకు పరిగెత్తాదు. బ్రిటిషు వారిపై మహాపోరాటానికి శంఖం పూరించమన్నాడు. గాంధీ వినలేదు. తన సానుభూతి బ్రిటన్ వైపే అని మహాత్ముడు బహిరంగంగా ప్రకటించాడు. “సుభాస్ బాబు ఆరోపిస్తున్నట్టు నేను బ్రిటిషు ప్రభుత్వంతో రాజీపడగోరుతున్న మాట నిజమే. నాకింకా బ్రిటన్ మీద నమ్మకం పోలేదు” అని 1940 జనవరి 20న గాంధీజీ ‘హరిజన్’ పత్రికలో రాశాడు.
కాంగ్రెస్ పెద్దలు కలిసిరాకపోయినా బోస్ ముందుకు కదిలాడు. దేశమంతటా తిరుగుతూ బ్రిటిషు సామ్రాజ్యం పై తుడిపోరుకు ప్రజలను సమీకరించసాగాడు. తాము ఊరక ఉంటే బాగుండదని కాంగ్రెస్ నాయకులు 1940 మార్చిలో బీహారులోని రామగడ్ లో ఎఐసిసి సభ పెట్టారు. అదే సమయంలో అదే ఊళ్ళో బోస్ ‘రాజీ వ్యతిరేక మహాసభ’ పెట్టాడు.దానిముందు కాంగ్రెస్ సభ వెలవెలపోయింది. కిక్కిరిసిన జనంతో బోస్ సభ దిగ్విజయంగా జరిగింది. అయినా కాంగ్రెస్ మహాత్ములు బ్రిటిషువారితో సంధికి వెంపర్లాడటం మానలేదు. తెగించి పోరాడాల్సిన సమయంలో జాతీయ కాంగ్రెసు మహాసంస్థకు కమ్మిన బానిస మనస్తత్వానికి బోస్ రక్తం ఎలా మరిగిందో 1940 మే11న ‘ఫార్వర్డ్ బ్లాక్’ పత్రికలో ‘Wake up India’ శీర్షికతో అతడు రాసిన సంపాదకీయంలోని ఈ వాక్యాలు చెబుతాయి.
“జర్మనీ మెరపు వేగంతో దేశం తరవాత దేశాన్ని ఆక్రమిస్తున్నది. నార్వేపై దాడి తరవాత లండన్ దిమ్మతిరుగుతున్నది. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమి చేస్తున్నది? కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా ఊగిసలాడుతున్నది. అంతర్జాతీయ సంక్షోభం అదనులో మన స్వాతంత్ర్యం ఎలా సాధించాలి? ఇదీ అసలు సమస్య. ఒక్కో రోజు గడిచేకొద్దీ ఏమీ చేయలేని నిస్సహాయతతో వేళ్ళు కొరుక్కుంటున్నాం. కాంగ్రెస్ సుప్రీం నాయకత్వం పోరాటాన్ని ప్రారంభిస్తే అందరం వారివెంట నడుస్తాం…. ….” [Crossroads, pp.292-293]
దీనికి జవాబుగా వారం తరవాత గాంధిజీ ఒక ప్రకటన చేశాడు. ఏమని? “బ్రిటిషు నాశనంనుంచి మన స్వాతంత్ర్యం సంపాదించాలని మనం కోరుకోము. అహింస మార్గం అది కాదు” అని. నెహ్రూ పండితుడు ఇంకో అడుగు ముందుకేశాడు. “బ్రిటన్ జీవన్మరణ పోరాటంలో ఉన్న సమయాన శాసనోల్లంఘన మొదలెట్టటం భారత గౌరవ ప్రతిష్ఠలకు భంగకరం.”అని! దాదాపు రెండు శతాబ్దాలు తనను క్రూరంగా అణచిన విదేశీ రాకాసులకు బానిసలా పడి ఉండటం భారత గౌరవప్రతిష్ఠలను ఇనుమడింప చేస్తుందేమో నెహ్రూ దృష్టిలో!
ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా ఎంతకష్టపడ్డా మహాత్మా గాంధీ కలిసిరానిదే , జాతీయ కాంగ్రెస్ పూనుకోనిదే జాతీయ ఉద్యమం పటిష్టంగా సాగదు.అవసరం దేశానిది కాబట్టి పంతాలకు పోకుండా బోస్ వార్ధా వెళ్లి మహాత్ముడికి వినమ్రంగా విన్నవించాడు: “బాపూ! మీరు పిలుపిస్తే చాలు కదలటానికి జాతి మొత్తం సిద్ధంగా ఉంది”
“జాతి సిద్ధంగా ఉన్నా ఇది సమయం కాదు“ అని బాపూజీ జవాబు.
“మీరు సమయం కాదనుకుంటే నేను ఉద్యమం ప్రారంభిస్తాను. దానికి మీ దీవెన కావాలి.”
“నీకు నా దీవెనలు అవసరం లేదు సుభాస్! సమయం కాదనుకున్నప్పుడు దాన్ని నేనెలా దీవిస్తాను? నీకు గొప్ప నాయకుడి లక్షణాలున్నాయి.దెబ్బతీయటానికి ఇదే మంచి సమయమని నీ అంతరాత్మ చెపితే మున్డుకేల్లు. చేయడలచుకున్నది చేసెయ్! నువ్వు జయిస్తే నిన్ను అభినందించే మొదటి వ్యక్తిని నేనే “ అన్నాడు గాంధిజీ. గాంధీ, బోసుల మధ్య ఇది చివరి కలయిక.
[Quoted in The Mahatma and The Netaji , Samar Guha, p.70]
ఎంత వేడినా మహాత్ముడు కదలనందున సుభాస్ బోస్ సొంతంగానే గాంధేయ పంథాలో శాసనోల్లంఘన ఉద్యమం మొదలెట్ట్టాడు. జాతికి అవమానం, బానిసత్వానికి చిహ్నం అయిన బ్రిటిష్ మాన్యుమెంట్లను కూల్చాలని ఫార్వర్డ్ బ్లాక్ నిశ్చయించింది. అందులో భాగంగా కోలకతాలో హాల్వెల్ స్మారకకట్టడాన్ని కూల్చాలని బోస్ పిలుపిచ్చాడు. ఆందోళన ఫలించింది. ప్రజల ఆగ్రహ తీవ్రతకు తాళలేక బ్రిటిషు సర్కారే దిగివచ్చి దానిని కూలగోట్టించింది. కాని ప్రజాన్దోలనకు ఒక్కరోజుముండు బోసును నిర్బంధించారు.
సుభాస్ చంద్ర బోస్ స్వదేశంలో స్వేచ్చగా ఉన్న చివరి రోజు 1940 జూలై 2. ఆరోజు ఏదో పనిమీద రవీంద్రనాథ్ టాగూరుని కలిసి ఇంటికి రాగానే పోలీసులు అరెస్టు చేసి అతడిని ప్రెసిడెన్సీ జైలుకు పంపారు. 19 ఏళ్ల రాజకీయ జీవితంలో బోస్ అనుభవించిన 11 ఖైదుల్లో అదే చివరిది. ఏ కారణం చెప్పకుండా డిఫెన్స్ ఆఫ్ ఇండియా(డి.ఐ.) రూల్స్ కింద అరెస్టు చేశారు. వాటి కింద- కోర్టుముందు పెట్టనక్కరలేకుండా ఎవరినైనా ఎంతకాలమైనా జైల్లో ఉంచవచ్చు. కట్టడంకూల్చే ఆందోళన సందర్భంలో బోసును అరెస్టు చేశామనీ, ఆందోళన కొనసాగుతూ ఉండటమే అతడి విడుదలకు అడ్డంకి అని బ్రిటిష్ కామన్స్ సభలో విదేశాంగ మంత్రి , బెంగాల్ శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. రెండునెలలకు సత్యాగ్రహం ఆగింది. కట్టడం కూలింది. ఆందోళనకు సంబంధించి నిర్బంధించిన వారందరినీ అరెస్టు చేశారు- ఒక్క బోసుని తప్ప! ఇతడిని ఇంకో జైల్లోనే ఎందుకు ఉంచారని మహాత్ముడు అడగలేదు.
విదిచిపెట్టకపోగా అదే డి.ఐ. రూల్సు లోని ఇంకో సెక్షనుకింద బోసుమీద వేర్వేరు మెజిస్ట్రేటు కోర్టుల్లో రెండు క్రిమినల్ కేసులు పెట్టారు.ఆర్నెల్ల కింద ఒక ఉపన్యాసంలో , నాలుగు నెలలకింద ఒక సంపాదకీయంలో రాజద్రోహ వ్యాఖ్యలు చేశాడని అభియోగం. ఒకే డి.ఐ. రూల్సులో ఒక సెక్షను కింద విచారణ అవసరంలేని ఖైదీగా , ఇంకో సెక్షను కింద విచారణ ఖైదీగా ఒకే మనిషిని నిర్బంధించటం చట్టవిరుద్ధం అని బారిస్టర్ గాంధీకి తెలుసు. అయినా అలా ఎలా చేస్తారని సర్కారును నిలదియ్యలేదు.
ఒకే మనిషి ఇంచుమించు ఒకేకాలంలో ఒకే ఊళ్ళో అన్నదీ, రాసిందీ రాజద్రోహమని భావిస్తే రెండు వేరువేరు కోర్టుల్లో ప్రాసిక్యూట్ చేయాల్సిన పనిలేదు. ఒక కోర్టు కేసు కొట్టేసినా బెయిలు ఇచ్చినా విడిచి పెట్టకుండా రెండో కోర్టు ద్వారా కథ నడిపించాలని ప్రభుత్వ దురుద్దేశం.అదే డి.ఐ.రూల్సు కింద మురాపరా మౌల్వి వంటి ఎందరో ముస్లిముల మీద కేసులను ఇట్టే ఎత్తేసిన సర్కారు బోస్ విషయంలో మాత్రం అది కష్టమని బుకాయించింది. బెంగాల్ గవర్నరుకూ, ముఖ్యమంత్రికీ జాయింటుగా రాసిన ఉత్తరంలో బోస్ ఈ ద్వంద్వనీతిని ఏకేశాడు. “Are we to understand that under your rule, ther is one law for the Muslim and another for the Hinduand that the D.I.Rules have a different meaning when a Muslim is involved?” (మీ పరిపాలనలో ముస్లిముకొక న్యాయం, హిందువుకు ఇంకొక న్యాయమా? ముస్లిం దగ్గరికి వచ్చేసరికి డి.ఐ. రూల్సు అర్థాలు మారిపోతాయా? అని నిగ్గదీశాడు. ఈ ద్వంద్వనీతి గాంధీకీ తెలుసు. అయినా కిమ్మనలేదు.
బోస్ నిర్బంధంలో ఉన్నప్పుడే ఎన్నికలోచ్చాయి. పార్లమెంటుకు డాకా నుంచి పెద్ద మెజారిటీతో బోస్ జైలునుంచే గెలిచాడు. అతడిని ఓడించాలని కాంగ్రెస్ పెద్దలు పాపం విశ్వప్రయత్నం చేశారు కానీ అది వారి తరం కాలేదు. బోస్ జైల్లో ఉన్నది కోర్టులో శిక్షపడి కాదు. ఒక సెక్షను కింద విచారణయోగంలేని డిటెన్యూగా; ఇంకో సెక్షనుకింద విచారణ ఖైదీగా! పార్లమెంటుకు హాజరయ్యేందుకు అతడిని సమావేశాల కాలంలో విడుదల చేసి తీరాలి. పార్లమెంటు మెంబర్లకుండే ఇమ్యూనిటీని లక్ష్యపెట్టకుండా… ఒక జాతీయ నాయకుడిని పార్లమెంటుకు వెళ్ళకుండా అడ్డుకోవటం అనుచితం,అక్రమం అన్న మాట మహాత్ముడి నోటినుంచి రాలేదు.
అక్రమ నిర్బంధంనుంచి బయటపడటానికి బోస్ నాలుగు నెలలపైగా న్యాయపోరాటాలు చేసినా, సర్కారుకు ఉత్తరాలు రాసినా ప్రయోజనం లేకపోయింది. యుద్ధం ముగిసేంతవరకు బోసును ఎలాగైనా బయటికి రానివ్వకూడదని బ్రిటిషు దొరతనం తీర్మానించుకుంది.విసిగి వేసారిన బోస్ ప్రాణాలకు తెగించి ప్రాయోపవేశానికి నిశ్చయించాడు. ఐరిష్ యోధుడు టెరెన్స్ మాక్ స్వెయినీ లా,లాహోర్ జైల్లో యతీన్ దాస్ లా తనూ ఆత్మబలిదానానికి సిద్ధపడ్డాడు. జైలునుంచి విడుదల చేయకపోతే తాను బతికేదిలేదని, 1940 నవంబరు 29న నిరాహారదీక్ష మొదలుపెట్టి తీరతానని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం ఇచ్చాడు.
“Life under existing conditions is intolerable for me. To purchase one’s continued existence by compromising with illegality and injustice goes against my very grain. Government are determined to hold me in prison by brute force. I say in reply: Release me or shall I refuse to live- and it is for me to decide whether I choose to live or die.
“In this mortal world everything perishes and will perish – but ideas, ideals and dreams do not. One individual may die for an idea , but that idea will , after his death incarnate itself in a thousand lives…The individual must die , so that the nation may live. Today I must die , so that the nation may live … The grossest crime is to compromise with injustice…”
(ఇప్పడున్న పరిస్థితుల్లో నాకు బతుకు దుర్భరంగా ఉంది. చట్టవిరుద్ధమైన అన్యాయంతో రాజీపడి బతకటం నా మౌలిక తత్వానికే విరుద్ధం. పసుబలంతో నన్ను ఖైదులో ఉంచాలని ప్రభుత్వం కృతనిశ్చయమైంది. దీనికి నా జవాబు ఇది: నన్ను విడిచి వేయండి. లేదా నేను జీవించేది లేదు. నేను బతకాలో చావాలో నిర్ణయించవలసింది నేను.
“ఈ మర్త్య ప్రపంచంలో ప్రతిదీ నశిస్తుంది. ఆలోచనలు, ఆదర్శాలు,స్వప్నాలు మినహా! ఒక ఆదర్శంకోసం ఒక వ్యక్తి మరణించవచ్చు.కాని ఆ ఆదర్శం అతడి మరణానంతరం వెయి జీవితాలుగా అవతరిస్తుంది… జాతి జీవించాలంటే వ్యక్తి మరణించక తప్పదు. ఇండియాజీవించి తన స్వాతంత్ర్యాన్ని, వైభవాన్ని పొందాలంటే ఇవాళ నేను చావాల్సిందే… అన్యాయంతో రాజీ పడటం నిష్కృతి లేని నేరం.''
మనసు,మానవత్వం ఉన్నవారెవరినైనా కదిలించే, కరిగించే ధీరోదాత్తత ఇది.తన ప్రయోపవేశాన్ని భగ్నం చేయటానికి బలవంతంగా ఆహారం ఎక్కిస్తే సహించేది లేదని , పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వాన్ని సీరియస్ గా హెచ్చరించి , అన్నప్రకారం 1940 నవంబర్ 29న బోస్ ప్రెసిడెన్సీ జైలులో నిరాహార దీక్ష మొదలెట్టాడు. అ వార్త తెలిసి దేశమంతా అట్టుడికింది. అతడి ప్రాణానికి ఏ ప్రమాదం వస్తుందోనని జాతి హడలిపోయింది.పంతానికి పోకుండా ప్రభుత్వం దిగి వచ్చితమ అభిమాన నాయకుడిని క్షేమంగా విడవాలని యావద్భారతం భగవంతుడిని ప్రార్థించింది. బోసుని తక్షణం విడుదల చేయాలని దేశం లో మానవత్వం ఉన్న ప్రతి నాయకుడూ డిమాండ్ చేశాడు.
ఒక్క ఎం.కె.గాంధి తప్ప! ఉపవాసాలు చేయటంలో తాను ఆరితేరిన వాడు కనుక, గతంలో తనలాగే ఆమరణ నిరశన దీక్షకు ఉపక్రమిస్తున్న తనకు కొడుకులాంటి సుభాస్ బాబును మెచ్చుకుంటూనో , ధైర్యం ఇస్తూనో ఒక్క మంచి మాట కూడా మహాత్ముడు అన్న పాపానపోలేదు. అంతేకాదు. సరిగ్గా బోస్ తన ప్రాణాన్ని పణం పెట్టి ఉపవాసానికి కూర్చోబోతున్న సమయంలోనే మహాత్ములవారు కాంగ్రెసునుంచి బోస్ బహిష్కరణ ఎత్తేసేది లేదు; క్షమాపణ చెప్పనిదే క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదంటూ బెంగాల్ లో ఒకరికి టెలిగ్రామ్ పంపాడు.
బోస్ నిరాహారదీక్ష చేస్తాడంటే మొదట నవ్వుకున్న అధికారులు మృత్యువును ఆహ్వానించే అతడి తెగువను , ధర్మాగ్రహ తీవ్రతను చూశాక కంగారు పుట్టింది. బలావంతాన అతడి దీక్ష చెడగొట్టబోతే ప్రాణానికే అపాయమని అర్థమయింది. ఎలాగైనా అతడిని జైల్లోనే ఉంచాలని పట్టుబడితే పర్యవసానాలకు తన బాధ్యత ఉండదని జైలు సూపర్నెంటు చెప్పాడు. కొంచెం ఉప్పు కలిపిన నీరు తప్ప బోస్ ఏమీతీసుకోలేదు. మనిషి బాగా నీరసించాడు.మూడు రోజుల తర్వాత పరీక్ష చేసిన డాక్టర్లు ఆలస్యం చేస్తే ప్రాణం పోవచ్చని హెచ్చరించారు. రిస్కు తీసుకోవటానికి సర్కారుకు ధైర్యం చాలలేదు. దీక్ష మొదలెట్ట్ట్టిన వారానికి 194డిసెంబరు 5న బోసును బేషరతుగా విడుదల చేసి 38/2 ఎల్గిన్ రోడ్డ్డు లోని అతడి ఇంటికి అంబులెన్సుల –చేర్చారు కాస్త కోలుకోగానే మళ్ళీ బంధించే దురాలోచనతో!
బోస్ ఇంటికెళ్ళాడని తెలిశాక ఎలా ఉన్నాడో చూసి కుశలం కనుక్కురమ్మని గాంధీజీ తన కార్యదర్శి మహాదేవ్ దేశాయిని పంపించాడు. అంతకుమించి ఆయన నుంచి మాటామంతీ లేదు .ఇప్పటికైనా తమరు శాసనోల్లంఘన ఉద్యమాన్ని చేపడితే మా ఫార్వర్డ్ బ్లాక్ కూడా కూడా దానిలో సంతోషంగా చేరుతుందని సుభాస్ ఆఖరు ప్రయత్నంగా మహాత్ముడికి ఆఫర్ చేశాడు. దానికి 1940 డిసెంబరు 29న ఆయన ఇచ్చిన సమాధానం ఇది:
I think, with the fundamental differences between you and me, it is not possible. Till one of us is converted to the other’s view, we must sail in different boats, though their destination may appear, only appear, to be the same.
[Collected Works of Mahatma Gandhi , vol.80, p.4]
(మన మౌలిక విభేదాల దృష్ట్యా అది సాధ్యపడదు.మనలో ఒకరు ఇంకొకరి దృక్కోణానికి మారేవరకూ మనం వేరు పడవల్లో పయనించవలసిందే. వాటి గమ్యం ఒకటిగా కనపడవచ్చు. కాని అది కనపడటం మాత్రమె.)
ఇంటికి వెళ్ళిన నాలుగు రోజులకు బోసుని ఒక మిత్రుడు కలిశాడు. మీ బహిష్కరణ ఎత్తేయటం కుదరదన్న గాంధీ టెలిగ్రాంకు మీ స్పందన ఏమిటని అడిగాడు.సుభాస్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న ఒక పద్యాన్ని ఉటంకించాడు. స్విట్జర్లాండ్ మహావీరుడు విలియం టెల్ మీద రాసిన కవిత అది:
My knee shall bend, he calmly said
To God and God alone,
My life is in the Austrians’ hands
My conscience is my own
(నా మోకాలు ఒంగేది దేవుడికి .. దేవుడికి మాత్రమే . నా ప్రాణం ఆస్ట్రియన్ల చేతిలో ఉంది. కాని నా ఆత్మ నాకే సొంతం.)
ఇదే సందర్భంలో ప్రెసిడెన్సీ జైలునుంచి తన సోదరుడు శరత్ కు సుభాస్ రాసిన ఈకింది పర్సనల్ ఉత్తరాలను చూడండి:
ప్రెసిడెన్సీ జైలు, కోలకతా ,24-10-40
ప్రియమైన అన్నయ్యా
…ఎవరినో ఎంచుకుని మహాత్మా గాంధీ మొదలుపెట్టించిన వ్యష్టి సత్యాగ్రహం వట్టి కంటితుడుపు కాదా ? అది ప్రభుత్వానికి సహకారమూ కాదు; ప్రజాపోరాటమూ కాదు. అది మనల్ని ఎక్కడికీ తీసుకు వెళ్ళదు. గాంధీజీ ఏదో ఘనకార్యం చేస్తున్నాడని దేశంలో కొన్ని వర్గాలకు భ్రమకొల్పుతుందంతే..
గాంధీయిజం తాజా దశనూ , పవిత్రతను నటించే దాని దంభాచారాన్నీ, ప్రజాస్వామ్యం మీద దాని ఆఘాయిత్యాన్నీ, రాజకీయ చేడుగులకు దాని వింత పరిష్కారాలనూ చూస్తుంటే రోత పుడుతున్నది.భారత రాజకీయ వ్యవస్థకు పెద్ద బెడద బ్రిటిషు ప్రభుత్వ వ్యవస్థా లేక గాంధీయ దేవగణమా అన్నసందేహం వస్తున్నది.
ఈ దబాయింపుల జిత్తులు ఎవరినీ మోసగించలేవు… గాంధీయిజం ముసుగు తొలిగే రోజు ఎంతో దూరంలో లేదు.
[Crossroads p.327]
ప్రెసిడెన్సీ జైలు , కోలకతా , 31-10-40
ప్రియమైన అన్నయ్యా… కాంగ్రెసు రాజకీయాల గురించి ఆలోచించేకొద్దీ హైకమాండుతో కొట్లాటకు మనం ఇంకా ఎక్కువ శక్తి, సమయం వెచ్చించటం అనవసరం అనిపిస్తున్నది. ఇలాంటి కక్షలు గట్టే, నీతిమాలిన , అల్పబుద్ధుల చేతుల్లోకి అధికారం వెళితే దేశం ఏమవుతుంది? ఇప్పుడు కనుక మనం వాళ్ళతో పోట్లాడకపోతే వాళ్ళ చేతికి అధికారం అందకుండా ఆపలేము… గాంధీయ , అహింసా సూత్రాల ప్రకారం స్వతంత్ర భారత్ ను పునర్నిర్మించదలిస్తే గాంధీయిజం స్వతంత్ర దేశాన్ని గోతిలో పడేస్తుంది.
[అదే పేజీ]
దేశసేవ కోసం బంగారుబాతులాంటి ఐ.సి.ఎస్. కొలువును వదులుకుని పందొమ్మిదేళ్ళు స్వాతంత్ర్యం కోసం పోరాడి, అందులో ఆరేళ్లు జిల్లాలో మగ్గి ప్రజాబలంతో జాతీయ కాంగ్రెసు అధ్యక్షుడుగా ఎన్నిక కాగలిగిన ఒక నికార్సయిన దేశభక్తుడికి కాంగ్రెసు గురించి , గాంధీ గురించి చివరికి కలిగిన నిశ్చితాభిప్రాయమిది! గాంధీ, ఆయన వర్గం తనను ఎలా వేదించినా బోస్ కడదాకా గాంధి పట్ల అపార గౌరవం, కాంగ్రెసు పట్ల అచంచల విధేయతే కనపరచాడు. బ్రిటిష్ పాలక వ్యవస్థ కంటే గాంధీ గణం దేశానికి ఎక్కువ ప్రమాదకారి అనీ… నీతిమాలిన, హీనబుద్ధులైన కాంగ్రెసు చేతుల్లోకి అధికారం వెళితే దేశానికి అరిష్టమనీ తన మనసులోని బాధను అంతరంగికంగా తోదబుట్ట్టిన వాడితో పంచుకున్నాడే తప్ప బాహాటంగా ఎన్నడూ అలా అభిశంసించచలేదు.
ఇంతకీ మహానుభావుడు, సత్య ప్రవక్త, అపర ఋషి అని నిఖిల లోకం ప్రస్తుతించే మహాత్ముడు సుభాస్ చంద్ర బోస్ పట్ల అంత కక్ష పూరితంగా ఎందుకు వ్యవహరించాడు? ఆ ఇద్దరు నాయకులనూ అభిమానించే సమర్ గుహ ఎంత ఆలోచించినా జవాబు దొరకక చివరికి ఇలా సరిపుచ్చుకున్నాడు:
సుభాస్ పట్ల గాంధీజీ మరీ అంత అగాంధీయంగా ఎందుకు ప్రవర్తించాడన్నది ఇప్పటికీ మిస్టరీయే. బహుశా విధి విలాసమే మహాత్ముడిని అలా నడిపించిందేమో! మహోగ్రమైన అగ్నిగుండంలోకి సుభాసుని ఆయన విసిరేయడం వల్లే ఐతిహాసిక మహావీరుడివలె అతడు అనంతరకాలంలో పైకి లేచాడేమో! గాంధీ ఒకవేళ సుభాస్ తో రాజీకి అంగీకరించి వుంటే భారత స్వాతంత్ర్య చరిత్రలో మహా అయితే గాంధీ తరవాత నాయకుడుగా గుర్తించబడేవాడు. గాంధీ నిర్దాక్షిణ్య వైఖరివల్లే సుభాస్ చంద్ర బోస్ రెండో ప్రపంచ యుద్ధ అగ్నిగుండంలో దూకి భారతీయుల ప్రియతమ నేతాజీగా చెంగున పైకి లేచాడు. ఆధునిక మానవ చరిత్రలో విప్లవ ఆదర్శాలకు గొప్ప ప్రతీకగా నిలిచిపోయాడు.
[The Mahatma and The Netaji , Samar Guha , p.66]
రాముడిని అడవులకు పంపిన కైక, మందరలురావణ సంహారానికి, లోక కల్యాణానికి కారకులైనట్టు, నేతాజీ లోకోత్తర ఆవిర్భావానికి క్రెడిటు గాంధీజీకి ఇవ్వవచ్చు అంటున్నాడు ఈ బెంగాలీ మేధావి. ఔనేమో!!