ఏం ట్యాలెంటు.. రాహుల్ స‌హ‌చ‌రుడ‌నిపించిన పైల‌ట్!

గ‌త 15 యేళ్ల‌లో రాహుల్ గాంధీకి అత్యంత స‌హ‌చ‌రుడిగా మెలిగిన వారిలో ఒక‌రిగా పేరు స‌చిన్ పైల‌ట్ కు. గ‌తంలో స‌చిన్ పైల‌ట్ తండ్రి రాజీవ్ గాంధీకి స‌న్నిహితుడుగా పేర్గాంచారు. రాహుల్ ఎంపీగా గెలిచిన…

గ‌త 15 యేళ్ల‌లో రాహుల్ గాంధీకి అత్యంత స‌హ‌చ‌రుడిగా మెలిగిన వారిలో ఒక‌రిగా పేరు స‌చిన్ పైల‌ట్ కు. గ‌తంలో స‌చిన్ పైల‌ట్ తండ్రి రాజీవ్ గాంధీకి స‌న్నిహితుడుగా పేర్గాంచారు. రాహుల్ ఎంపీగా గెలిచిన ద‌గ్గ‌ర నుంచి స‌చిన్ పైల‌ట్, జ్యోతిరాధిత్య సింధియాలు ఆయ‌న‌కు అతి స‌న్నిహితులుగా పేర్గాంచారు. మూడూ బ‌డా బిగ్ షాట్ కుటుంబాలు కావ‌డం, ముగ్గురి తండ్రులూ రాజ‌కీయ నేత‌లుగా మంచి పేరు సంపాదించి, మంచి ఊపు మీద ఉన్న‌ప్పుడు హ‌ఠాత్తుగా మ‌ర‌ణించ‌డం, ముగ్గురూ అంద‌గాళ్ల‌నే పేరు తెచ్చుకోవ‌డం.. ఇవన్నీ వీరి సాన్నిహిత్యంలో హైలెట్ అయ్యాయి. అయితే వీళ్ల జాత‌కం ఏమో కానీ.. వీళ్లు ముగ్గురూ ఎంపీలుగా ఓడిపోయారు.

స‌చిన్ పైల‌ట్ 2014 ఎన్నిక‌ల్లోనే అజ్మీర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. 2019లో సింధియా, రాహుల్ లు త‌మ త‌మ సొంత స్థానాల నుంచి ఓడిపోయారు. రాహుల్ ఎలాగో కేర‌ళ నుంచి నెగ్గుకొచ్చి మాట్లాడ‌గలుగుతున్నారు. 

రాహుల్ గాంధీ రాజ‌కీయ సామ‌ర్థ్యంపై ఇప్ప‌టికే కాంగ్రెస్ వీరాభిమానుల్లోనూ సందేహాలు ఏర్ప‌డిపోయాయి. ఆరు నెల‌లు సావాసం చేస్తే వారు వీర‌వుతార‌ని.. ఒక సామెత‌. వీళ్లు 15 సంవ‌త్స‌రాలుగా దోస్తులుగా మెలిగారు.  తండ్రి మంచి విజ‌యాల‌ను సాధిస్తే, జ్యోతిరాదిత్య సింధియా ఎంపీగా ఓడిపోయి, అటు కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల‌దోశాడు. రాజ‌రిక అస‌హ‌నాన్ని అంతా చాటుకున్నాడు.

ఇక పైల‌ట్ కు కాంగ్రెస్ చాలా ఇచ్చింద‌ని ఇప్పుడు దిగ్విజ‌య్ సింగ్ ఏక‌రువు పెడుతున్నాడు. ఆయ‌న‌ను ఎంపీని చేసింద‌ని, కేంద్ర‌మంత్రిని చేసింద‌ని, రాజ‌స్తాన్ డిప్యూటీ సీఎంను చేసింద‌ని, ఆ రాష్ట్రానికి ప్ర‌దేశ్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిని చేసిందంటూ డిగ్గీ రాజా చెబుతున్నారు. అంత చేస్తే.. పైల‌ట్ ఇలా చేస్తాడా? అంటూ ఆయ‌న మండి ప‌డ్డారు. పాపం దిగ్విజ‌య్ వాద‌న‌లోనూ నిజం లేక‌పోలేదు.

కేవ‌లం రాహుల్ కు స‌న్నిహితుడ‌నే పేరుతోనే పైల‌ట్ కేంద్ర‌మంత్రి అయ్యాడు. లేక‌పోతే రాజేష్ పైల‌ట్ కొడుకుని ఎప్పుడో తొక్కేసే వాళ్లు రాజ‌స్తానీ సీనియ‌ర్లు. ఇక రాహుల్ సాన్నిహిత్యం వ‌ల్ల‌నే ఉప‌ముఖ్య‌మంత్రి కూడా అయ్యుండ‌వ‌చ్చు కూడా! అక్క‌డ‌కూ పైల‌ట్ కు పీఠం ఇవ్వాల‌ని త‌ల్లితో వాదించాడ‌ట రాహుల్. చివ‌ర‌కు డిప్యూటీ పీఠం ద‌క్కింది. అయినా సంతృప్తి లేక‌పోయిందేమో పాపం!

పోనీ చేసిన తిరుగుబాటు అయినా స‌రిగ్గా చేశాడా? అంటే.. రెంటికీ చెడ్డ రేవ‌డీలా మారింది స‌చిన్ పైల‌ట్ ప‌రిస్థితి! తిరుగుబాటుతో ప‌ద‌వులు సంపాదించ‌డం ఎలా ఉన్నా, ఉన్న ప‌ద‌వుల‌ను ఇప్ప‌టికే పోగొట్టుకున్నాడు. బీజేపీ వాళ్లు  హ‌ర్యానాలో పైల‌ట్ శిబిరాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టున్నారు. అయితే ఇప్పుడు ఆ శిబిరం చెల్లా చెద‌రు అయ్యే ప‌రిస్థితి.

పైల‌ట్ తో త‌మ‌కు సంబంధం లేద‌న్న‌ట్టుగా బీజేపీ వాళ్లు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చేసిన తిరుగుబాటుతో ఇప్పుడు స‌చిన్ పైల‌ట్ పొందుతున్న ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే.. సందేహం లేదు ఇత‌డు రాహుల్ గాంధీ స‌న్నిహితుడే అని వ్యంగ్యంగా స్పందించాల్సి వ‌స్తోంది. అయితే ఇప్పుడు సందేహం ఏమిటంటే.. రాహుల్, సింధియా, పైల‌ట్.. వీళ్ల 15 ఏళ్ల స‌హ‌చ‌ర్యంలో ఎవ‌రి ట్యాలెంట్ వ‌ల్ల ఎవ‌రి రాజ‌కీయ జీవితం దెబ్బ‌తిన్న‌ద‌నేది! ముగ్గురూ ముగ్గురే!

టీటీడీలో 140 మందికి పాజిటివ్

బాలినేని మీద బురద చల్లొద్దు