పార్టీ ప్రకటించాక తీవ్ర విమర్శలుంటాయా ?

వైఎస్ షర్మిల తెలంగాణా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నానని, కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించగానే అన్న జగన్ మద్దతుతోనే ఆమె తెలంగాణలో అడుగు పెడుతోందని, జగన్, కేసీఆర్ కలిసే ఆమెతో పార్టీ ఏర్పాటు చేయిస్తున్నారని…

వైఎస్ షర్మిల తెలంగాణా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నానని, కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించగానే అన్న జగన్ మద్దతుతోనే ఆమె తెలంగాణలో అడుగు పెడుతోందని, జగన్, కేసీఆర్ కలిసే ఆమెతో పార్టీ ఏర్పాటు చేయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇది టీఆర్‌ఎస్, వైసీపీ పనేనని బీజేపీ నాయకులు అన్నారు. 

దీంతో ఇది తాము చేస్తున్న పని కాదని, బీజేపీయే ఈ పని చేయిస్తోందని టీఆర్‌ఎస్ నాయకులు విరుచుకుపడ్డారు. ఇలా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో తాను ఎవరు వదిలిన బాణాన్ని కాదని, రాజన్న రాజ్యం తేవడం కోసమే తాను సొంతంగానే రాజకీయాల్లోకి వచ్చానని షర్మిల క్లారిటీ ఇచ్చింది. ఇందుకు తగినట్లే ఆమె కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ప్రారంభించింది.

సమస్యను వివరిస్తున్న షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నట్లయితే ఇలా కాకపోయేదని అంటోంది. అంటే కేసీఆర్ పాలన కంటే వైఎస్సార్ పాలన ఇంకా బాగుందని, ఈ సమయంలో ఆయన ఉన్నట్లయితే ఈ సమస్యలు రాకుండా ఉండేవని చెబుతోంది. వివిధ జిల్లాల్లోని వైఎస్సార్ అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల ముందుగా ఆయా జిల్లాల సమస్యలు తెలుసుకొని వాటి గురించి ప్రస్తావిస్తోంది.

ఆ జిల్లాకు చెందిన ప్రముఖులను గురించి చెబుతోంది. సీఎం కేసీఆర్ జిల్లాగా చెప్పుకునే మెదక్‌లో 20 కరువు మండలాలు ఉండడం బాధాకరమని షర్మిల విమర్శించింది.  పటాన్ చెరు ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుందని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారికి ఇంకా న్యాయం జరగలేదని సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసింది. అందుకే వారు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారని చెప్పింది.  

దళితుల భూములను లాక్కుంటున్నారని  విరుచుకుపడింది. టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు చేసుకుంటున్నారని అన్నది. యువతకు అన్యాయం జరుగుతోందని చెప్పింది. ఇక మెదక్ జిల్లా… పాటకు ప్రాణం, విప్లవానికి ఊపిరిపోసిన గద్దర్ పుట్టిన గడ్డ అని కొనియాడింది. 

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా మెదక్ జిల్లాకు 5.19 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావించారని..దానిని రీడిజైన్ చేసిన నాయకులు, ఇప్పటి వరకు ఏం చేశారో ఎవరికీ తెలియదని విమర్శలు గుప్పించింది. మొత్తం మీద షర్మిల క్రమంగా దూకుడు పెంచుతోంది. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే ఆమె ఇంకా పార్టీ ఏర్పాటు చేయలేదు కాబట్టి విమర్శల్లో అంతగా తీవ్రత లేదు. ఆమె విమర్శలపై టీఆర్‌ఎస్ నాయకులు కూడా అంతగా స్పందించడంలేదు.

షర్మిల రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన కొత్తలో కొందరు టీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆంధ్రా పార్టీకి తెలంగాణలో స్థానం లేదన్నారు. ఇంకా చాలా అన్నారు. మరి కేసీఆర్ వాళ్లకు ఏం చెప్పారో తెలియదు. ఆమె మీద విమర్శలు చేసి అనవసరంగా పెద్ద నాయకురాలిని చేయొద్దని చెప్పారేమో. ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొద్దు అన్నారేమో. ఏమైందో తెలియదుగాని తగ్గిపోయారు.

బీజేపీ నాయకులు కూడా ఇదివరకులా దూకుడు ప్రదర్శించడంలేదు. షర్మిల ఇప్పటివరకైతే ప్రధాని మోడీ గురించి, ఆయన పాలన గురించి మాట్లాడలేదు. అలా మాట్లాడినప్పుడు బీజేపీ నాయకులు తప్పనిసరిగా విమర్శిస్తారు. ఇక ఖమ్మం సభకు వారం సమయం మాత్రమే ఉంది. లక్షమందితో సభ జరపాలనుకుంటే కరోనా ఆంక్షలు పెట్టి ప్రభుత్వం షర్మిల ప్రయత్నాలపై నీళ్లు చల్లింది. సభ జరపాలనుకుంటే నిబంధనల ప్రకారమే జరపాలి. 

అంతేకాదు ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ వంటి పండుగలపైనా ఆంక్షలు విధించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని.. లేదటే భారీగా జరిమానాలు విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొత్తంగా ఏప్రిల్ 30 వరకు తెలంగాణ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈ క్రమంలో కోవిడ్ ఆంక్షల ప్రభావం షర్మిల సభపై పడే అవకాశముంది.