ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని.. తొలిరోజే పెండింగ్ లో ఉన్న స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం మీద కసరత్తును మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది.
ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో, బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఎస్ఈసీ అధికారులతో ఆమె సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. నేడు బాధ్యతలు స్వీకరించిన ఆమె.. మర్యాదపూర్వకంగా రాష్ట్ర గవర్నర్ తో సమావేశం అయ్యారు. అనంతరం ఆమె విధి నిర్వహణ మొదలుపెట్టినట్టుగా సమాచారం.
ఏపీలో పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను మధ్యలో ఆపేసి వెళ్లారు ఆ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. పదవీకాలం ఉన్నా.. ఆయన వాటి నిర్వహణకు ముందుకు వెళ్లలేదు. ఒకదశలో స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే పదవి నుంచి విరమణ పొందే ఆలోచన ఉన్నట్టుగా వ్యవహరించిన నిమ్మగడ్డ, పంచాయతీ- మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం చిత్తయ్యాకా వెనక్కు తగ్గారనే విమర్శలు వచ్చాయి.
తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా లేని రాజకీయ వాతావరణంలో ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి ఆయన సిద్ధం కాలేదనే అభిప్రాయాలు సర్వత్రా వినిపించాయి. అయితే ఆ విమర్శలను పట్టించుకోకుండా పెండింగ్ లో ఉన్న ఎన్నికలను పెండింగ్ లోనే ఉంచి వెళ్లారు నిమ్మగడ్డ. తెలుగుదేశం పార్టీ వ్యక్తి.. అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపించినట్టుగానే నిమ్మగడ్డ వ్యవహరించి వెళ్లారు.
ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఇంకా మిగిలే ఉంటే.. ఆయన వాటిని అలాగే పెండింగ్ లో పెట్టేసే వారేమో కానీ, ఆయన పదవీకాలం పూర్తయ్యింది. కొత్త ఎస్ఈసీ వచ్చారు. నీలం సాహ్ని నియామకం పట్ల నిమ్మగడ్డ స్వాగతించారట. బహుశా అంతకు మించిన ఛాయిస్ ఆయనకు లేకపోవచ్చు.
ఇక ఇప్పటికే ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బోలెడంత ప్రక్రియ పూర్తయ్యింది. పలు చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. ఆ నోటిఫికేషన్ నే కొత్త ఎస్ఈసీ కొనసాగించే అవకాశం ఉంది. ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలోనే నిర్ణయం జరిగింది. దానిపై కొంతమంది కోర్టుకు వెళ్లగా.. ఏకగ్రీవాలకు కోర్టు ఆమోదం కూడా లభించింది. అయినా ఇంకా ఏవో పిటిషన్లు ఉండనే ఉన్నట్టున్నాయి.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలంలోనే ఎస్ఈసీ విశేషాధికారాలకు కోర్టు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. బహుశా ఇప్పుడు కూడా ఎస్ఈసీ అనుకున్నట్టుగానే జరగవచ్చు. దీంతో.. పెండింగ్ లోని ఎన్నికలను ఏ శక్తీ ఆపే అవకాశం లేనట్టే. అందుకు తగ్గట్టుగా ఎస్ఈసీ కూడా కసరత్తును ప్రారంభించినట్టుగా ఉన్నారు.