ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించడం తప్ప తమకు మరో మార్గం లేదని అన్నారట తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా విభాగం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ఒకవైపు నూతన ఎస్ఈసీ రావడంతో.. పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ-జడ్పీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైనట్టే.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తమకు వచ్చిన సానుకూల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా పెండింగ్ లోని అన్ని ఎన్నికలనూ పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం భావించడంలో విశేషం లేదు.
పలు మున్సిపాలిటీల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి, వాటికి తోడు.. ఎంపీటీసీ-జడ్పీ ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉంది. వీటికి సంబంధించి ఏకగ్రీవాలకు కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు పిటిషన్లు ఇంకా పెండింగ్ లో ఉన్నా.. ఎస్ఈసీ కసరత్తును ప్రారంభిస్తే, అన్నీ అవాంతరాలూ తొలగిపోవడం ఖాయమే.
పార్టీ గుర్తుల మీద జరగని పంచాయతీ ఎన్నికల్లో తాము 40 శాతం సీట్లను గెలిచినట్టుగా చెప్పుకోవడం తెలుగుదేశం పార్టీకి సులువే అయ్యింది. అయితే పార్టీ గుర్తుల మీద జరిగిన మున్సిపల్ ఎన్నికలు మాత్రం తెలుగుదేశం గుట్టును రట్టు చేశాయి. ఈ పరిస్థితుల్లో.. ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలను ఎదుర్కొనడానికి టీడీపీ ససేమేరా అనడం లో సందేహం లేదు.
చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకలేదు, ఇక గతంలో నామినేషన్లు వేసిన వారిలో ఇప్పుడెంత మంది పోటీలో నిలిచే ఆసక్తితో ఉన్నారో ఎవరికీ తెలియదు. ఈ ఎన్నికల ప్రక్రియ పునఃప్రారంభం అయితే తెలుగుదేశం పార్టీ డొల్లతనం మరింత బయటపడే అవకాశం ఉంది. ఈ పరిణామాల్లో.. ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీని కలవరపెడుతూ ఉన్నాయి. దీంతోనే బహిష్కరణ పిలుపును ఇస్తున్నట్టున్నారు కొంతమంది పచ్చ చొక్కా నేతలు!
మరి ఇలాంటి బహిష్కరణలు తెలుగుదేశం పార్టీ చేతగాని తనాన్నే చాటతాయి తప్ప, ఉనికిని కాదు. పోటీలో ఉంటే.. తమకు ఎంతో కొంత శాతం ఓటు బ్యాంకు ఉందని టీడీపీ నిరూపించుకోవచ్చు. అలా కాకుండా.. బహిష్కరణకు పిలుపును ఇస్తే.. పూర్తిగా చేతులెత్తేసినట్టే. అందులో సందేహం లేదు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున పోరాడాల్సింది పోయి, కనీసం ఎన్నికల్లో పోరాడే శక్తి కూడా లేకపోతే తెలుగు రాజకీయ చిత్రపటం నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగవ్వడం స్టార్ట్ అయినట్టే!