ఒకప్పటి తెలంగాణా ఉద్యమకారుడు, ప్రస్తుత తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఇప్పటినుంచే ఓ పని కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. కేసీఆర్ ను ఏ విధంగా గద్దె దించాలో ప్లాన్ చేస్తున్నారా? ఏదైనా సమస్య మీద పోరాటానికి ప్లాన్ చేస్తున్నారా? కేసీఆర్ ను గద్దె దించడానికి కోదండరాం ప్రత్యేకంగా ప్లాన్, కుట్ర చేయరు. ప్రజల్లో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందనుకోండి గద్దె దింపడానికి ఎన్నికల్లో అవకాశం ఉంటుంది.
సో.. కోదండరాం ప్లాన్ అదికాదు. ఒక పక్క ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే, మరోపక్క చట్టసభలో కూడా ఉండాలనేది కోదండరాం ఆలోచన. గత ఎన్నికల్లో అందుకు ప్రయత్నించినా కుదరలేదు. అప్పట్లో ఆయన జనగామ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ అప్పట్లో ప్రతిపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి కదా. పొత్తు ఉన్నప్పుడు సర్దుబాట్లు తప్పవు కదా. ఆ సర్దుబాట్ల కారణంగా కోదండరాంకు పోటీ చేసే అవకాశం రాలేదు.
చట్టసభలోకి వెళ్లాలనుకున్న ఆయనకు ఓ మార్గం కనిపించింది. చట్టసభ అంటే శాసన సభ ఒక్కటే కాదు. శాసన మండలి కూడా ఉంది కదా. ఖమ్మం -నల్గొండ -వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి వచ్చే ఏడాది ఎన్నిక జరుగుతుంది. ఈ నియోజకవర్గం నుంచి మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగుస్తుంది. సో.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోదండరాం ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు ఇప్పటి నుంచే వర్కౌట్ చేస్తున్నారు.
టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీల మద్దతు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో మొదటినుంచి టీడీపీకి, కమ్యూనిస్టు పార్టీలకు, సీపీఐ (ఎం ఎల్ ) న్యూ డెమోక్రసీ పార్టీలకు బలం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభావంతో కొంతమేరకు తగ్గినా నామరూపాలు లేకుండా పోలేదు. కోదండరాం ఇది కూడా ఆలోచిస్తున్నారు. నల్లగొండ, వరంగల్లో కూడా ఇదే పరిస్థితి. ప్రభుత్వం మీద ప్రజల్లోనూ వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇది పట్టభద్రుల నియోజకవర్గం కాబట్టి ఓటేసేవారు విద్యావంతులే.
ఇది కోదండరాంకు కలిసొచ్చే అంశం. తెలంగాణా ఉద్యమంలో చురుకైన, కీలకమైన పాత్ర పోషించిన కోదండరాం ప్రభ రాష్ట్రం ఏర్పడిన తరువాత తగ్గిపోయింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్- కోదండరాం మధ్య విభేదాలు వచ్చేశాయి. కోదండరాం ను కేసీఆర్ తీవ్రంగా అవమానించారు. పార్టీ పెట్టి దమ్ము లేదన్నారు. అయితే పార్టీ పెట్టిన కోదండరాంకు అనుకున్న ఆదరణ మాత్రం లభించలేదు. ఎన్నికల్లో టీఆరెస్ ప్రభంజనం, కేసీఆర్ ఇమేజ్ ముందు కోదండరాం వెలవెలబోయారు. అయినా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. నిలదీస్తూనే ఉన్నారు. కానీ చట్ట సభ వేదికగా కొట్లాడితే ఆ ఇంపాక్ట్ మరోవిధంగా ఉంటుంది.