విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు ఘాటు బాగానే తగులుతోంది. తొలి ఏడాది గంటా మీద వైసీపీ నుంచి బాణాలేవీ వెళ్ళలేదు, కానీ వైసీపీ రెండవ ఏడాది పాలనలోకి వస్తూనే గంటా ముఖ్య అనుచరుడు నలందా కిషోర్ అరెస్ట్ అయ్యారు.
ఆయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారన్న కారణంతో సీఐడీ విభాగం అరెస్ట్ చేసింది. దాంతో గంటా మౌనరాగం వీడాల్సివచ్చింది. ఆయన తన మీద చేతనైతే వైసీపీ రాజకీయ సమరం చేయాలని బహిరంగ సవాల్ నాడు చేసారు.
దాని ఫలితమా అన్నట్లుగా ఈ మధ్యనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గంటా గణగణ అంటూ ఆయన హయాంలో చోటు చేసుకున్న సైకిల్ కుంభఖోణాన్ని ప్రస్తావించారు. బ్లాక్ లిస్ట్ లో ఒక సంస్థతో ఒప్పందం ఎలా చేసుకుంటారంటూ నిలదీశారు. 12 కోట్ల విలువ చేసే ఆ ఒప్పందంలో 5 కోట్లకు పైగా అవినీతి జరిగిందని కూడా వైసీపీ ఎంపీ ఆరోపించారు.
ఇదిలా ఉంటే తాజాగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఏకంగా గత సర్కార్ హయాంలో విశాఖలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయంటూ ఇండైరెక్ట్ గా గంటాని తగులుకున్నారు. వైసీపీ వచ్చాక నాలుగు వందల కోట్ల విలువైన ప్రభుత్వం భూములను కాపాడామని కూడా చెప్పుకున్నారు. నాటి భూకబ్జాల కధలను వెలికితీస్తామని కూడా ముత్తంశెట్టి పక్కా క్లారిటీతో చెబుతూండడం, గంటా మీద విమర్శలు చేయడంతో మాజీ మంత్రి శిబిరం వేడెక్కుతోందని అంటున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే విశాఖలో గత ప్రభుత్వ హయాంలో చాలా పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని, వాటిని ఒక్కోటిగా బయటపెడతామని వైసీపీ నేతలు అంటూండడంతో ఈ రాజకీయ కధ ముదిరి పాకాన పడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఉత్తరాంధ్రా రాజకీయాలలో ఇంకెన్ని మలుపులూ మెరుపులూ చోటుచేసుకుంటాయో చూడాలి.