ఓ దర్శకుడు సినిమా చేయాలి అంటే కావాల్సింది ముందుగా కథ. గతంలో అయితే వేరే వాళ్ల కథతో సినిమాలు చేసేవారు కానీ, ఇప్పుడు ఎక్కువగా ఎవరు కథ తెచ్చుకుంటే వాళ్లే దర్శకులు. లేదా ఘోస్ట్ లుగా ఇద్దరినో, ముగ్గురినో పెట్టుకుని, జీతాలు ఇచ్చుకుంటూ కథలు వండించుకోవాలి. పైగా ఆ కథ ఏ హీరోకి అయినా నచ్చాలి. ఇదంతా పెద్ద తతంగం.
అదే రీమేక్ అయితే, ఇంకేముంది? సీన్ టు సీన్ దింపేయచ్చు. పోనీ మార్పులు చేర్పులు సంగతి ఎలా వున్నా, ముందుగా ఓ సినిమా డైరక్ట్ చేసే చాన్స్ వచ్చేస్తుంది. అందుకే సినిమాలు చేతిలో లేక ఖాళీగా వున్న చాలా మంది డైరక్టర్లు ఇప్పుడు రీమేక్ లు కొన్న నిర్మాతల వెంట పడుతున్నారట.
నిర్మాతలకు ఫోన్ చేసి, మీరు ఫలానా రీమేక్ సినిమా కొన్నారు కదా? అది నేను డైరక్ట్ చేస్తా..నాకు బాగానచ్చింది, నేను చూసాను. నాకు ఐడియా వుంది అంటూ రకరకాల స్టోరీలు చెప్పేస్తున్నారట. చిత్రమేమిటంటే గతంలో వీళ్లు అలాంటి జోనర్ సినిమా డీల్ చేయగలిగారా? లేదా? అన్నది కూడా ఆలోచించుకోకుండా, తాము రెడీ అని చెప్పేయడం.
అయితే సినిమాలో విషయాన్ని బట్టి, సినిమా తెలుగుకు నప్పుతుందా? లేదా అన్న క్లారిటీ, ఈ సినిమా ఏ నటులతో చేయాలి? ఏ డైరక్టర్ కు అప్పగించాలన్న క్లారిటీ లేకుండా ఏ నిర్మాతా కూడా సినిమా కొనేయడు. అందువల్ల ఈ ఫోన్ లు అన్నీ ఇలా వినేసి, అలా వదిలేయడం తప్ప, ఎవరికి చాన్స్ ఇవ్వాలన్నది వేరే వుంటుంది అనుకోవాలి. కానీ ఏం చేస్తాం. ఖాళీగా వున్న డైరక్టర్ల ఎవరి ఆశ వారిది.