గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో కార్పొరేట్ హాస్పిటళ్ల ఆగడాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎక్కువ డబ్బుల కోసం ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ చేయడం.. బెడ్లు ఖాళీ లేవని చెప్పి పంపించడం లాంటి ఘటనలు ఈమధ్య కాలంలో చూశాం. వీటన్నింటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
బెడ్లు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయంపై పారదర్శకంగా వ్యవహరించాలని ప్రైవేట్ హాస్పిటల్స్ కు సూచించారు ముఖ్యమంత్రి. కృత్రిమ కొరత సృష్టించే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు గ్రేటర్ పరిథిలోని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటిపై నిఘా ఏర్పాటుచేస్తామన్నారు ముఖ్యమంత్రి.
మరోవైపు ఈ విషయంలో ప్రజలకు కూడా సందేశమిచ్చారు కేసీఆర్. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లి లక్షల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గాంధీ, టిమ్స్ లో 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయని స్పష్టంచేశారు.
మరోవైపు పెరుగుతున్న కేసులు, మరణాలపై స్పందించారు సీఎం. రాష్ట్రంలో రికవరీ రేటు 67శాతంగా ఉందని.. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న 200 మంది మాత్రం కరోనాతో ఇబ్బంది పడుతున్నారని, మిగతావారంతా కోలుకుంటున్నారని కేసీఆర్ స్పష్టంచేశారు.
కరోనా కట్టడిపై రివ్యూ మీటింగ్ పెట్టిన ముఖ్యమంత్రి.. వైరస్ వ్యాప్తి నివారణ చర్యల కోసం అదనంగా మరో 100 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో పీజీ పూర్తిచేసిన 12వందల మంది వైద్యులను సర్వీసుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు.