డెక్కన్ చార్జెస్..క్రికెట్ అభిమానులు, ఐపీఎల్ వ్యూయర్స్ దాదాపుగా ఈ జట్టును మరిచిపోయి ఉండొచ్చు. ఐపీఎల్ ప్రారంభంలో హైదరాబాద్ బేస్డ్ జట్టుగా డెక్కన్ చార్జెస్ వచ్చింది. తొలి ఆక్షన్ లోనే భారీ మొత్తాలతో ఆటగాళ్లను కొని ఔరా అనిపించింది డీసీ యాజమాన్యం. ఫస్ట్ సీజన్లలో క్రికెటర్లకు భారీ పారితోషకాలు ఇచ్చిన యాజమాన్యం డీసీనే. తొలి సీజన్లో ఫ్లాప్ అయిన డీసీ జట్టు రెండో సీజన్ లో విజేతగా నిలిచింది. ఆ తర్వాతి సీజన్లలో అంత చెప్పుకోదగిన ప్రదర్శన లేదు కానీ.. 2012లో ఈ జట్టును రద్దు చేస్తూ ఐపీఎల్ నిర్ణయం తీసుకుంది. దీని స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. డెక్కన్ క్రానికల్ గ్రూప్ కు యాజమాన్య హక్కులు రద్దు చేసి, తమిళనాడుకు చెందిన సన్ గ్రూప్ కు అవకాశం ఇచ్చింది బీసీసీఐ.
దాంట్లో వేరే మతలబు ఉందని అంటారు. అది వేరే కథ. ఆ సంగతలా ఉంటే.. తమ ప్రాంచైజ్ ను అర్థాంతరంగా రద్దు చేయడంపై ఎనిమిదేళ్ల కిందటే కేసు వేసిందట డీసీ. ఆ కేసు ముంబై కోర్టులో విచారణ జరిగి, జరిగి తాజాగా తీర్పు వచ్చిందని సమాచారం. దాని ప్రకారం.. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తప్పు అని, అందుకు పరిహారంగా డీసీ యాజమాన్యానికి 4,800 కోట్ల రూపాయల భారీ పరిహారాన్ని చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చినట్టుగా సమాచారం.
పదేళ్ల పాటు ప్రాంచైజ్ హక్కులు అని అప్పట్లో వేలం వేశారు. ఐదేళ్లకే ఆ జట్టును తొలగించారు. తమ ఒప్పందాలను డీసీ జట్టు ఉల్లంఘించింది అనేది అప్పట్లో బీసీసీఐ చెప్పిన మాట. తాము అలాంటి తప్పులు చేయలేదనేది డీసీ వాదన. ఎనిమిదేళ్ల వాదోపవాదాల తర్వాత బీసీసీఐకి ఝలక్ ఇచ్చేలా కోర్టు తీర్పు వచ్చింది. మరి ఈ పరిహారాన్నే బీసీసీఐ చెల్లిస్తే.. డీసీ గ్రూప్ కు అంతకన్నా కావాల్సింది ఉండకపోవచ్చు. అయితే బీసీసీఐ అంత తేలికగా లొంగుతుందా? అనేది అనుమానమే అంటున్నారు పరిశీలకులు. ఇది వరకూ కొచ్చీ టస్కర్స్ కు సంబంధించి కూడా బీసీసీఐ తన ఇష్టానుసారం వ్యవహరించి ఆ జట్టును రద్దు చేసింది. దానిపై ఆ జట్టు కోర్టుకు వెళ్లింది. బీసీసీఐకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయితే ఇప్పటికీ బీసీసీఐ ఆ డబ్బులు చెల్లించకుండా తప్పించుకుంటోందని టాక్. మరి డెక్కన్ చార్జెస్ వసూలు చేసుకుంటుందా?