సైరా ట్రయిలర్ వచ్చేసింది. విడుదలైన మరుక్షణం నుంచి సోషల్ మీడియాలో రికార్డుల మోత మొదలైంది. ప్రేక్షకుల నుంచి స్టార్స్ వరకు అంతా సైరా ట్రయిలర్ ను అద్భుతం అంటూ పొగిడేస్తున్నారు. కానీ ట్రయిలర్ లో ఓ చిన్న ఎలిమెంట్ మాత్రం మిస్ అయింది. అదే పంచ్ డైలాగ్స్.
ఇదంతా పంచ్ డైలాగ్స్ కాలం. సినిమాలో హీరో ఎవరైనా, కథ ఏ జానర్ కు చెందినదైనా అందులో పంచ్ డైలాగ్స్ ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా కీలకమైన కొన్ని డైలాగ్స్ ను ట్రయిలర్ లోనే పెట్టడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. సైరా ట్రయిలర్ లో అలాంటి డైలాగ్స్ మిస్ అయ్యాయంటున్నారు చాలామంది. చివర్లో చిరంజీవి చెప్పిన గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అనే డైలాగ్ మినహా డైలాగ్స్ పరంగా పెద్దగా మెరుపుల్లేవ్.
అయితే ట్రయిలర్ లో ఇలా జరగడానికి ఓ కారణం కూడా ఉంది. సైరా సినిమా 5 భాషల్లో రిలీజ్ అవుతోంది. మిగతా భాషల్లో జనాల్ని కూడా ఎట్రాక్ట్ చేయాలంటే సుదీప్, విజయ్ సేతుపతి, అమితాబ్ లాంటి నటుల డైలాగ్స్ పెట్టాల్సిందే. అలా చేయడం వల్లనే ట్రయిలర్ లో అసలు పంచ్ మిస్ అయింది. అంతకుమించి మరే కారణంలేదు. సినిమాల్లో తూటాల్లా పేలే డైలాగ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ట్రయిలర్ లో వాటిని మచ్చుకు కూడా చూపించలేదంతే.
మరోవైపు ట్రయిలర్ లో సినిమా కథ మొత్తం చూపించారనే విమర్శ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. దీనికి కూడా యూనిట్ వద్ద సమాధానం ఉంది. ఇది దాచాల్సిన కథ కాదు. పైగా సస్పెన్స్ థ్రిల్లర్ అంతకంటే కాదు. ఇదొక చరిత్ర. ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నమే ఎక్కువగా జరిగింది. అందుకే కథను టచ్ చేస్తూ ట్రయిలర్ కట్ చేశారు. ప్రేక్షకుడ్ని సైరా వైపు ఎట్రాక్ట్ చేయడం, మితిమీరిన అంచనాల్లేకుండా చేయడంలో భాగంగానే ట్రయిలర్ ను ఇలా కట్ చేశారు.