ఇప్పుడు సిసలైన లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటోంది నయనతార. సరిగ్గా నయనతార కెరీర్ ఆరంభించిన సమయంలోనే సినిమాలు మొదలుపెట్టిన హీరోయిన్లు చాలామంది కేవలం గ్లామర్ డాల్స్ గా మిగిలిపోయారు. అయితే నయనతార మాత్రం ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. వ్యక్తిగత జీవితంలో ప్రేమ వ్యవహారాలతో నయనతార ఇబ్బందిపడినా, అవేవీ కెరీర్ వరకూ రాకుండా చూసుకున్నారామె.
అలా లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార ఇప్పుడు తనే ప్రధాన పాత్రలో నటిస్తూ పలు సినిమాలను ప్రేక్షకులకు అందిస్తోంది. వేరే హీరోల అవసరమే లేకుండా.. నయనతార సినిమాలను చేయగలుగుతోంది. ఆమెను నమ్మి నిర్మాతలు భారీ పెట్టుబడులు పెడుతున్నారు. అందులో ముఖ్యమైనది నయనతార పారితోషకమే. ఇప్పుడు సౌత్ లో ఆమెను నటింపజేయాలంటే.. కనీసం ఆరుకోట్ల రూపాయల పారితోషకాన్ని ఇవ్వాల్సి వస్తోందట.
చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి', రజనీకాంత్ 'దర్బార్'కు నయనతార ఇదే పారితోషకం తీసుకుందని టాక్. ఆమె హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాకా.. కొన్ని సినిమాలకు కోటిరూపాయల పారితోషకాన్ని డిమాండ్ చేయగా.. నిర్మాతలు వేరే హీరోయిన్లను చూసుకున్న సందర్భాలున్నాయట. అలాంటిది ఇప్పుడు ఆరుకోట్ల రూపాయలు ఇచ్చి నయనతారను పెద్ద పెద్ద బ్యానర్ల వాళ్లే హీరోయిన్ గా తీసుకుంటున్న పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు.
అయితే నయనతార ఈ భారీ రెమ్యూనరేషన్లను కేవలం బయటి భాషల సినిమాలకే తీసుకుంటోంది. ఆమె సొంత భాష మలయాళంలో చేసే సినిమాలకు మాత్రం తీసుకునే రెమ్యూనరేషన్ చాలా తక్కువ. మలయాళంలో స్టార్ హీరోల పారితోషకం కూడా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. దీంతో ఆరుకోట్ల రూపాయలతో పోలిస్తే చాలా చాలా తక్కువ పారితోషకానికి కూడా ఈమె అక్కడ కొన్ని సినిమాలు చేస్తూ ఉండటం గమనార్హం.