సానుభూతితో అధికారాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు తన మార్క్ ఎత్తుగడ వేశారు. చంద్రబాబుకు సమస్య ఏంటంటే … కాలంతో పాటు ఆయన మారకపోవడం. ఇదే ఆయనకు తీవ్ర ప్రతికూల అంశంగా మారింది. టీడీపీ ఎదుగుదలకు బాబు విపరీత పోకడలు తీవ్ర అడ్డంకిగా మారాయనే విమర్శ వుంది. తన అభిప్రాయాల్ని జనంపై రుద్ధి లబ్ధి పొందాలనే తపన తప్ప, వారి ఆలోచనలను బట్టి నడుచుకోవడం లేదు.
ఒకే ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ ఏడుస్తూ డిమాండ్ చేస్తే… జనం కరిగిపోయి తనకు ఓట్లు వేస్తారని చంద్రబాబు కల కంటున్నారు. తనపై జనం సానుభూతి చూపుతారని అనుకోవడంలోనే ఆయన ఆలోచన గతి తప్పింది. ఎందుకంటే బాబుది సానుభూతి పొందే మనస్తత్వం కాదు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రజల హృదయాలకు ఆయన చేరువకాలేకపోయారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పని చేయడం వేరే సంగతి.
మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రజామోదం పొందేందుకు నేతలు తమదైన రీతిలో వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు సానుభూతి ఓట్లతో గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మాటలే చెబుతున్నాయి. తన భార్యపై వైసీపీ నేతల అభ్యంతరకర వ్యాఖ్యలు, అలాగే వయసు పైబడిన రీత్యా చివరి అవకాశం ఇవ్వాలనే నినాదంతో ఆయన ముందుకు రానున్నట్టు అర్థమవుతోంది.
అయితే తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద బాబుపై హత్యాప్రయత్నం జరిగినప్పుడు కూడా ప్రజలు సానుభూతి చూపకపోవడాన్ని గ్రహించాలి. అలిపిరి వద్ద నక్సల్స్ దాడిని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. చావు అంచుల వరకూ వెళ్లిన చంద్రబాబుపై 2004లో ఏపీ జనం సానుభూతి చూపలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్కు పట్టం కట్టారు. 2009లో కూడా వైఎస్సార్నే జనం ఆదరించారు.
అప్పట్లో అలిపిరి దుర్ఘటనకు సంబంధించి సిట్ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చంద్రబాబును ప్రాణాలతో వదిలిపెట్టిన నక్సలైట్లను జనం తిట్టుకున్నారంటే… బాబు తొమ్మిదేళ్ల పాలన ఎంత దారుణంగా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వయసు పైబడిందని, రాజకీయ చివరి మజిలీలో ఉన్న తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఏడిస్తే… జనం ఆదరిస్తారనుకోవడం ఉత్తి భ్రమే.
ఎందుకంటే బాబును ఎన్నుకుంటే తాము ఏడ్చాల్సి వస్తుందనే భయం కొన్ని వర్గాల ప్రజల్లో నాటుకుపోయింది. అదే ఇప్పుడు బాబుకు సమస్యగా మారింది.