ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాల కంపు కొడుతున్నాయి. ఎవరైతే అధిక జనాభా ఉన్న కులాలపై ఆధిపత్యం సాధిస్తారో వాళ్లే అధికారంలోకి వస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీని కమ్మేతర కులాల్లో వ్యతిరేకత పెంచి, ఒంటరిని చేయడంతో నాటి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ విజయం సాధించగలిగింది. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి మార్గం సుగుమం అయింది.
టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల్లో ఆ పార్టీకి గట్టి పట్టు ఉండేది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి బీసీలను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక దళితులు, గిరిజనులు, మైనార్టీల విషయానికి వస్తే వైసీపీకి గట్టి మద్దతుదారులుగా నిలుస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యంగా దళితుల్లో ఎలాగైనా జగన్ సర్కార్‌పై వ్యతిరేకత పెంచాలనే వ్యూహంలో భాగంగా టీడీపీ తన ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని విశ్వ ప్రయత్నం చేస్తోంది. తాజాగా చంద్రబాబు ట్వీట్ ఒకటి చూద్దాం.
“దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణపై దాడి అమానుషం. రాష్ట్రంలో దళిత మేధావి వర్గాలకు చెందిన వారిపై వరుసగా జరుగుతున్న దాడుల పరంపరలో ఇదొకటి. మాజీ ఎంపీ హర్షకుమార్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, మహాసేన రాజేష్ వంటి వారిని ఇలాగే వేధించారు. దళిత మేధావులు ఏకీకృతమై ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడాలి”
ఇదే టీడీపీ పాలనలో, చంద్రబాబు సామాజికవర్గం కమ్మ వాళ్ల చేతిలో దళితుల ఊచకోతకు 35 ఏళ్లు పూర్తయింది. భారతదేశం వ్యాప్తంగా దళితుల చైతన్యానికి కారణమైన కారంచేడు దుర్ఘటన గురించి తప్పక గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ సంఘటనే టీడీపీని శాశ్వతంగా దళితులు, గిరిజనులు, ఇతర అణగారిన వర్గాలకు దూరం చేసింది. ఈ దుర్ఘటనే ఎన్టీఆర్ వియ్యంకుడు దగ్గుబాటి చెంచురామయ్య హత్యకు దారి తీసింది.
ప్రకాశం జిల్లా చీరాలకు ఏడు కిలోమీటర్ల దూరంలో కారంచేడు గ్రామం ఉంటుంది. ఇది గ్రామ పంచాయతీ. మొత్తం 16 వార్డు లున్నాయి. మొదటి నుంచి గ్రామంలో కమ్మ కులస్తులదే పెత్తనం. కమ్మ సామాజిక వర్గీయులు 8 వార్డుల్లో ఉండేవారు. మిగిలిన 8 వార్డుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు ఉండేవారు.
ఆ గ్రామంలో కమ్మ రాజ్యాంగం నడిచేది. ఆ సామాజిక వర్గం పెద్దలు చెప్పిందే శాసనంగా ఉండేది. ఈ నేపథ్యంలో 1985 జూలై 16న కారంచేడు దళితవాడలోని మంచినీటి చెరువులోకి పశువులు తాగిన కుడితి నీటిని పోశారు. మంచినీటి చెరువులో కుడితి పోయడం ఏంటని దళితులు నిలదీశారు. తమను ప్రశ్నించడం కమ్మ భూస్వాములు తట్టుకోలేక పోయారు. దీంతో దళితులపై దాడి చేయాలని కమ్మ సామాజికవర్గమంతా రాత్రికి రాత్రి గట్టిగా నిర్ణయించుకొంది. మారణాయుధాలు సిద్ధం చేసుకున్నారు.
1985 జూలై 17న తెల్లవారుజామున కత్తులు, బరిసెలు, గండ్రగొడ్డళ్లు తదితర ఆయుధాలు చేతపట్టి మాదిగ పల్లెపై దాడికి పాల్పడ్డారు. నిద్ర నుంచి మేల్కోకపోతే ఎదురైన దాడికి భీతిల్లిన దళితులు చిన్నాపెద్దా, ఆడామగా అనే తేడా లేకుండా ప్రాణ భయంతో పంట చేలల్లోకి పరుగులు పెట్టారు. అయినా వాళ్లు వదిలి పెట్టలేదు. కమ్మల పెత్తందారి దౌర్జన్యానికి ఆరుగురు దళితులు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయాలపాలయ్యారు.
ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరికొందరు మహిళలతో అసభ్యంతా ప్రవర్తించారు. ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. టీడీపీ పాలనలోని ఈ అమానవీయ ఘటన దళితుల్లో చైతన్యాన్ని నింపింది. అస్తిత్వ ఉద్యమాలకు కారంచేడు ఉద్యమమే స్ఫూర్తిగా నిలిచింది.
కారంచేడు దుర్ఘటనలో ఎన్టీఆర్ వియ్యంకుడు దగ్గుబాటి చెంచురామయ్య ప్రధాన పాత్ర ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శ లొచ్చాయి. చెంచురామయ్యను వెంటనే అరెస్ట్ చేయాలని నాటి సీపీఐ నాయకుడు చండ్ర రాజేశ్వరరావు లాంటి వారు డిమాండ్ చేశారు. కారంచేడులో దళితుల ఊచకోతకు ప్రతీకారంగా 1987 ఏప్రిల్ 6న ఉగాది పండగ రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో దగ్గుబాటి చెంచురామయ్యకు నక్సలైట్లు మరణశిక్ష విధించారు.
ఈ దగ్గుబాటి చెంచురామయ్య కుమారుడే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఒకప్పుడు రాజకీయంగా కీలకంగా వ్యవహరించే వారు. ఈయన ఎన్టీఆర్ పెద్దల్లుడు. ప్రస్తుతం బీజేపీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి మరెవరో కాదు…హత్యకు గురైన చెంచురామయ్య కోడలే.
టీడీపీని దళితులు శాశ్వతంగా దూరం పెట్టడానికి కారణం ఏంటో అర్థమైంది కదా! చంద్రబాబు ఎన్ని ట్వీట్లు చేస్తే మాత్రం ప్రయోజనం ఏంటి? నేడు జగన్ సర్కార్ దళితులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు మొసలి కన్నీళ్లు పెట్టడం విచిత్రంగా ఉంది.
ఇలాంటి దొంగ ఏడ్పులు కార్చే కన్నీళ్లు కారంచేడు మారణహోమాగ్నిని ఆర్పలేవు. ఎందుకంటే కారంచేడు అనేది దళితుల గుండెల్లో కమ్మ సామాజిక వర్గం గుచ్చిన గునపం. అది చేసిన గాయం భౌతికపరమైంది కాదు. అది హృదయానికి చేసిన గాయం. కమ్మలను దళితులు ఎప్పటికీ క్షమించరు గాక క్షమించరు.