ఎలాంటి ఆవేశంతో ఉన్నారో.. వారి ఏ దుడుకు చర్యలను గుర్తుకు తెచ్చుకున్నారో తెలియదు గాని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశాన్ని తెలుగు బూతుల పార్టీగా, జనసేనను రౌడీ సేనగా అభివర్ణించారు. తమాషాగా అనిపించినప్పటికీ జనాలు జాగ్రత్తగా వెతుక్కుంటే ముఖ్యమంత్రి మాటల్లో నిజం అర్థమవుతుంది. రాజకీయ ప్రత్యర్థుల మీద జగన్మోహన్ రెడ్డి చేసిన తీవ్రమైన విమర్శలు ఇవి. అయితే జనసేన తరఫునుంచి తమను రౌడీసేనగా పేర్కొనడాన్ని ఖండించడానికి పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ముందుకు రాలేదు. బహుశా ఆయన షూటింగ్ లో బిజీగా ఉండి ఉంటారు. లేదా జగన్ మాటలకు ఘాటయిన కౌంటర్ కావాలని తన స్క్రిప్టు రచయితకు పురమాయించి ఉంటారు.
పవన్ కళ్యాణ్ కు అసలే ఒక దారుణమైన ఆపకీర్తి ఉంది. ఆయన షూటింగ్ కు షూటింగుకు మధ్య షెడ్యూల్ గ్యాప్ లో రాజకీయాలు చేస్తుంటారు తప్ప.. సీరియస్ పొలిటీషియన్ కానే కాదని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ వ్యవహార సరళి కూడా అదే విధంగా ఉంటుంది. ఒకసారి ప్రజల ముందుకు వస్తే నాలుగైదు రోజులపాటు నిరాటంకంగా రకరకాల కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత ఒక్కసారిగా తన షేల్ లోకి వెళ్లిపోయారంటే.. మళ్లీ షూటింగ్ కు ఎప్పుడు గ్యాప్ వస్తుందో ఏంటో కర్మ అని ప్రజలందరూ లెక్కలు వేసుకుంటూ ఉండాలి. పవన్ కళ్యాణ్ రాజకీయం ఆ తీరుగా ఉంటుంది.
చివరికి తన సొంత పార్టీని ఉద్దేశించి రౌడీసేనగా చెప్పిన మాటలను ఖండించడానికి కూడా ఆయన కు కాళీ లేదు. ఈ మాటలను ఖండించడానికి కూడా పార్టీలో నెంబర్ టు నాదెండ్ల మనోహర్ విరుచుకుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో సొంత పుత్రుడు దత్తపుత్రుడు అంటూ ఎద్దేవా చేసే మాటలు మాట్లాడితే.. కనీసం వాటిని ఓపెన్ గా ఖండించడానికి కూడా పవన్ కళ్యాణ్ ముందుకు రావడం లేదు.
పవన్ ప్రస్తుతానికి ఉత్తరాంధ్రలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ, పాపం హీరో వద్ద రాజకీయాలకు కాల్షీట్లు మాత్రం తక్కువగా ఉన్నాయి. అప్పటిదాకా ఎవరెన్ని తిట్టినా.. ఒకేసారి ఏదో ఒక బహిరంగసభలో వాటికి కౌంటర్లు ఇచ్చేసి చప్పట్లు కొట్టించుకుంటారు పవన్.