Advertisement

Advertisement


Home > Politics - Opinion

చంద్రబాబుది కామన్ సెన్స్ లేని బిలో యావరేజ్ బ్రెయిన్

చంద్రబాబుది కామన్ సెన్స్ లేని బిలో యావరేజ్ బ్రెయిన్

ఏ రాజకీయపార్టీ చిత్తశుద్ధి ఏమిటో ఇక్కడ చర్చించబోవడం లేదు. ఏ రాజకీయనాయకుడు ఎంత ఉత్తముడో వివరించే పని ఇక్కడ పెట్టుకోవడం లేదు. రెండు వర్గాలు ఆడుతున్న రాజకీయచదరంగాన్ని విశ్లేషించడమే ఇక్కడ చేస్తున్న పని. ఎవరు ఆట ఎలా అడుతున్నారు, ఎవరు ఎటువంటి ఎత్తులు వేసి ఎలా దిక్కుతోచకుండా ఉన్నారు..అనేదే ఈ టాపిక్. 

ఈ విశ్లేషణలో ముందుగా కాస్త ప్రస్తుత పరిస్థితిని, కొంచెం భవిష్యత్తుని విశ్లేషించుకుని తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. 

తెదేపా-జనసేన కలిసి పోటీ చెయ్యాలనుకున్నారు. అన్నీ బాగుంటే బీజేపీతో కూడా కలవాలనుకున్నారు. తెదేపాకి-బీజేపీకి మధ్యన వారధి కట్టగలిగే శక్తి పవన్ కళ్యాణ్ కి ఉందని చంద్రబాబు నమ్మాడు. కానీ వ్యవహారం బెడిసికొట్టింది. జనసేన తెదేపాతో కలవడానికి వీల్లేదని భాజపా తాజాగా కుండబద్దలుకొట్టింది. 

అసలు ఇన్నాళ్లూ పవన్ కళ్యాణ్ ని మోసిందెవరు? ఆయనొకడున్నాడంటూ రాష్ట్ర ప్రజలకి చెప్పిందెవరు? కేవలం తెదేపా అనుకూల మీడియానే కదా! అంటే ఇన్నాళ్లూ తమ పార్టీకి ఉపయోగపడతాడని మోసారు. ఇప్పుడు ఎలాగూ ఉపయోగపడట్లేదు కాబట్టి మోయడం ఆపేస్తారా? ఆపేస్తే పరిస్థితి ఏంటి? కొనసాగిస్తే ముప్పేమిటి?

ఇప్పటికిప్పుడు పవన్ కి కవరేజ్ ఆపేస్తే జనానికి చంద్రబాబు అవకాశవాదం తేటతెల్లమవుతుంది. జనసేనవర్గాల్లో ఉన్న సోషల్ మీడియా యోధులు తెదేపా మీద, ఆ పార్టీ అనుకూల మీడియా మీద, వాళ్ల కులం మీద మామూలు దాడి చేయరు. ఆల్రెడీ ఆ మధ్య ఒక వకీల్ సాబ్ తన యూట్యూబ్ ఛానల్లో "చంద్రజ్యోతి రాకి" అంటూ ఏబీయన్ రాధాకృష్ణ మీద భయంకరమైన సెటైర్లు వేస్తూ వినోదాత్మక దాడి చేసాడు. కానీ పొత్తుల సమీకరణాల వల్ల ఆ యుద్ధం ఆపేసాడు. మళ్లీ ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ ని పట్టించుకోవడం మానేస్తే మళ్లీ ఆ దాడి మొదలుపెట్టి జనాన్ని చైతన్యవంతుల్ని చేసే పని పెట్టుకోవచ్చు. ఆ ట్రోలింగ్ దెబ్బకి తెదేపా చావుకేక పెట్టొచ్చు కూడా. 

అలాగని విధానం మార్చకుండా పవన్ కళ్యాణ్ కి యాజిటీజుగా మీడియా కవరేజ్ కంటిన్యూ చెయ్యాలా అంటే అంతకంటే కామెడీ మరొకటి ఉండదు. ప్రత్యర్థి అయిన బీజేపీ కూటమిలో ఉన్నవాడికి పాజిటివ్ కవరేజిస్తూ పోతే సొంతపార్టీవాళ్లే ఉమ్మి పోతారు. 

మరిప్పుడు ఎలా? 

ఇక పవన్ కళ్యాణ్ కోణంలోంచి చూస్తే తెదేపా అనుకూల మీడియా తనని పక్కనపెడితే భుజమ్మీద మోసే మరో మీడియా లేదు. తనకంటూ ఏవో కొన్ని చానల్స్ అవీ వచ్చినా జనంలోకి అస్సలు వెళ్లలేకపోయాయి. చంద్రబాబులాగ మీడియాని పోషించుకోగలిగే శక్తియుక్తులు పవన్ కి లేవు. ఉంటే ఈపాటికి ఎప్పుడో ఆ పని చేసేవాడు. 

ఈ నేపథ్యంలో సింపుల్గా చెప్పాలంటే పవన్ పరిస్థితి ప్రస్తుతం తెలంగాణాలో షర్మిల పరిస్థితిలా ఉంటుంది. నిజానికి షర్మిల తెగ కష్టపడుతోంది, పాదయాత్రలు చేస్తోంది, జనాన్ని కలుస్తోంది...కానీ మోయడానికి మీడియానే లేదు. పవన్ కి ఎదురుగా ఉన్న పెను సవాల్ ఇదే. 

అది సరే..అసలేవిటీ చంద్రబాబు ఆట? తన ఎత్తుల్ని ఎంత దయనీయంగా వేసాడు? అష్టదిగ్బంధనంలో ఇరుక్కుని ఎలా ఎటూ కదల్లేక ఉన్నాడు? వీటికి జవాబులు కాస్త గతంలోకి వెళ్లి తవ్వుకుందాం. 

అందరికీ తెలుసు..చంద్రబాబు చంద్రుడులాగానే స్వయం ప్రాకశమున్నవాడు కాదు. తన మీద కిరణాలు ప్రసరింపజేయడానికి మరొక సూర్యుడు కావాలి. అందుకే తన రాజకీయ ప్రస్థానం మొదటి నుంచీ పొత్తులతోనే సాగింది. పొత్తులేనిదే ఎత్తువేయలేని చదరంగమాట చంద్రబాబుది. కొన్నాళ్లు వాజపేయితోటి, ఇంకొన్నాళు వామపక్షాలతోటి, మరికొన్నాళ్లు మోదీ తోటి, ఆ తర్వాత రాహుల్ గాంధీతోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటి...ఇలా ప్రతిసారి తనకి ఆనుకోవడానికి ఒక గోడ కావాలి. స్వంతంగా నిలబడడానికి వెన్నెముకలో బలం లేదు బాబుకి. 

అందుకే ఇప్పుడు పెట్టుకున్న పొత్తు కూడా గంగలో కలుస్తోందనగానే తదుపరి ఎత్తు ఏం వెయ్యాలో పాలుపోవట్లేదు. అతనిలో కంగారు కనిపిస్తోంది. ఇదే తనకి "లాస్ట్ చాన్స్" అంటూ దీనంగా డయలాగులు కూడా పలుకుతున్నాడు. 

చంద్రబాబుని చాణక్యుడని, రాజనీతిజ్ఞుడని రకరకాలుగా అనుకూలమీడియా చాటింపు వేసింది కానీ నిజానికి అతనొక అమాయకుడు, కనీసమైన కామన్ సెన్స్ కూడా లేని బిలో యావరేజ్ బ్రెయిన్ అనిపిస్తుంది. 

నిజంగా తన కాళ్ల మీద తాను నిలబడగలిగేవాడే అయితే పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎప్పుడో కిల్ చేసుండాలి. ప్రత్యర్థుల్ని పెంచి పోషించడమంటే వాళ్లు ఎగస్పార్టీవాళ్లు పెట్టే ఆశ వల్లో, భయం వల్లో ఎప్పుడైనా ప్లేటు ఫిరాయించొచ్చు. 

నిజానికి సుజనా చౌదరి వంటి వాళ్లని భాజపాలోకి పంపి, పవన్ కళ్యాణ్ ని రాయబారానికి పంపి భాజపాతో మంతనాలు చేసుకుందామనుకున్నాడు చంద్రబాబు. కానీ ఆ ఇద్దర్నీ తమవైపుకు తిప్పేసుకుని చంద్రబాబుని అవతలకి పొమ్మంటోంది ప్రస్తుతం కేంద్ర బీజేపీ. 

అయినా పైన చెప్పుకున్న వాజపేయితోటి, మోదితోటి పొత్తంటే అర్ధం చేసుకోవచ్చు. ఆజన్మ శత్రువైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో పొత్తుపెట్టుకున్నప్పుడు తెదేపాని రాజకీయవ్యభిచారపార్టీ అన్నారు. అయినా సరే అదేదో దిక్కుమాలినతనం అనుకోవచ్చు. కానీ జీవితంలో ఒక్కసారికూడా కనీసం ఎమ్మెల్యేగా అయినా నెగ్గని, పట్టుమని పది మంది ఎమ్మెల్యేలని కూడా నెగ్గించుకోలేని పవన్ కళ్యాణ్ తో పొత్తనగానే చంద్రబాబు అమాయకత్వం, రాజకీయ శూన్యత బయటపడ్డాయి. 

ఇప్పుడు ఆ పొత్తుకూడా కాకెత్తుకుపోతే ఏం చెయ్యాలి? 

ఏ ఎత్తు వెయ్యాలి? 

ఆట ఏమాడాలో ఎలా ఆడాలో పాలుపోని స్థితిలో ఇప్పుడు చంద్రబాబు వామపక్షాల పొత్తు కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది. అది ఇంకా దయనీయం. ప్రస్తుత ఆంధ్రప్రదేశులో వామపక్షాల శక్తి అసలుందా? ఓటర్సున్నారా? కనీసం సానుభూతిపరులున్నారా అంటే...దిక్కులు చూడాల్సిన పరిస్థితి. 

అందుకే ఎవరితోటీ పొత్తు లేకుండా కేవలం తనతో తానే పొత్తు పెట్టుకుని విజయమో వీరస్వర్గమో అని రంగంలోకి దూకితే మర్యాదన్నా దక్కుతుంది. లేకపోతే రాజకీయచరిత్రలో చంద్రబాబు తనమీద తనకి నమ్మకంలేని వ్యక్తికి అతిపెద్ద ఉదాహరణగా మిగిలిపోవాల్సి వస్తుంది. అది నారావారి కీర్తికే శాశ్వత కళంకం. 

శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?