అవేళ క్లబ్బులో అడుగు పెట్టేటప్పటికే నీరసంగా ఫీలయ్యాను. న్యూయార్క్ నగరజీవితం నా శక్తిని హరించివేస్తోంది. రోజూ ఒకటే పని, దానికోసమే ఉరుకులు, పరుగులు. ఎటు చూసినా జనం, జనం. అలసట పోగొట్టుకోడానికంటూ యీ డాన్సింగ్ క్లబ్బుకి రావడం, ఇక్కడా నానా హైరాన పడడం! డాన్సింగ్ ఫ్లోర్ మీద అనేక జంటలు తెగ డాన్సు చేసేస్తున్నాయి. పాటగాడు గ్రామీణ జీవనమాధుర్యం గురించి యిటీవలే బాగా పాప్యులర్ అయిన పాట ఒకటి దంచేస్తున్నాడు. ‘మా ఊరి రైలెక్కుతా నన్నాపొద్దు, ఈ గడబిడ సిటీ లైఫు నాకొద్దు..’ అంటూ సాగుతున్న ఆ పాట విని నవ్వొచ్చింది. ఎంతో ఫీలవుతూ పాడుతున్న ఆ సింగర్‌ను పక్కకు లాగి ‘ఇదిగో రైలు టిక్కెట్టు, బండెక్కు’ అంటే ఏమంటాడు? ‘భలేదానివే, ఓసారి సిటీకి వచ్చాక మళ్లీ వెనక్కి వెళ్లడం మన తరమా?’ అనడూ!
ఖాళీ టేబుల్ ఎక్కడుందాని వెతుకుతుంటే ఎక్కణ్నుంచో కుప్పిగంతేసి దుమికినట్లు ఒకతను నా ఎదుట సాక్షాత్కరించాడు. చూడగానే పల్లెటూరి బైతని తెలుస్తూనే ఉంది. ‘‘హాయ్, కేథరీన్ కదూ!’’ అన్నాడు. నేను తెల్లబోతూ ‘‘ఔను’’ అన్నాను. ‘‘అదేమిటి నన్ను గుర్తు పట్టలేదా? నేనూ చార్లీని. ఏడాది క్రితం ఏప్రిల్‌లో నేను యీ క్లబ్బుకి వచ్చినపుడు కలిశాం. ఇద్దరం కలిసి డాన్సు చేశాం కూడా! మర్చిపోయారా?’’ అన్నాడు అతను కాస్త నిరుత్సాహంగా.
నేను నవ్వుకున్నాను. ‘కలవడం అంటూ జరిగితే డాన్సు చేయక తప్పుతుందా నాయనా! ఒంటరిగా వచ్చే మగాళ్ల దగ్గర బయట నుంచి కస్టమర్లా నటిస్తూ వాళ్లతో డాన్సు చేసి ఉత్సాహ పరచడానికేగా క్లబ్బు వాళ్లు నాకు ఉద్యోగం యిచ్చినది! రోజుకో యిద్దరితో చేస్తూంటే మీ అందరి మొహాలు గుర్తు పెట్టుకోవడం సాధ్యపడే విషయమా?’ అనుకున్నాను. న్యూయార్కులో రెండు మూడు రోజులు గడపడానికి పల్లెటూరి నుంచి వచ్చే కుర్రాళ్లందరూ తమ రాకను న్యూయార్కు జనాభా యావత్తు గుర్తు పెట్టుకుంటుందని అనుకుంటారు. తమ స్మృతులను న్యూయార్కు నగరం కలరా ఉండలేసి భద్రపరుస్తుందని అనుకుంటారు. ఊరికి తిరిగెళ్లి ‘నేను న్యూయార్కులో ఉన్నపుడు….’ అని ఏడాదంతా చెప్పుకునే వీళ్లకి ఆ సిటీ యిలాటి కోన్కిస్కాయిలను తన చరిత్రలోంచి ఎప్పటికప్పుడే డస్టర్ పెట్టి తుడిచేస్తుందని గ్రహించరు. కానీ యివాళ నా క్లయింటు యితను. కాస్త నటించక తప్పదు.
‘‘ఓహ్, మీరా చార్లీ, గుర్తొచ్చింది. ఏమిటి సంగతులు? ఇవాళ కూడా అవాళ్టిలా కలిసి డాన్సు చేద్దామా?’’ అన్నా. అతను పొంగిపోయాడు. ఫ్లోరు మీదకు నడిచాం. కరస్పాండెన్స్ కోర్సులో డాన్సు క్లాసులు నేర్చుకుని వచ్చేసినట్టున్నాడు. కాళ్లు తెగ తొక్కేస్తున్నాడు. ఏమీ అనలేని పరిస్థితి. వీడు కాకపోతే యింకోడు. ఏనుగు వచ్చి నాతో డాన్సు చేయ్ అన్నా చేయాల్సిన ఉద్యోగధర్మం నాది. కానీ మరీ బొత్తిగా పల్లెటూరి బైతు తగులుతాడని అనుకోలేదు. ఇవాళ పొద్దున్న లేచిన దగ్గర్నుంచి పల్లెటూరి పచ్చివాసన నన్ను వెంటాడుతోంది. కోళ్లకూతలు, మేకల అరుపులు చెవిలో రొద పెట్టినట్లుంది. క్లబ్బుకి వచ్చే దారిలో తగిలే పార్కులోని పచ్చగడ్డి యివాళ ప్రత్యేకంగా నన్ను ఆకర్షించింది. ఓ గడ్డిపరక కోసి పళ్ల కింద కొరికి చూశా. కాపలావాడు అదిలిస్తాడన్న భయం లేకపోతే దోసిటి నిండా పువ్వులు కోసుకుందా మనుకున్నా. క్లబ్బులోకి రాగానే ‘మా ఊరి రైలెక్కుతా..’ పాట వినబడుతోంది. అన్నీ కలిసి సామూహిక కుట్ర పన్ని యివాళ నాకీ చార్లీని అంటగట్టాయి.
కాస్సేపు డాన్సు చేశాక ఏదో ఒకటి మాట్లాడాలి కదా, పొద్దుటి నుంచి సాగుతున్న మూడ్‌ని కొనసాగిద్దామని ‘‘ఈ ఏడాది పంటలెలా పండాయి?’’ అని అడిగాను. కానీ చార్లీ దృష్టి దాని మీద లేదు. పాటలో గొంతు కలుపుతున్న కోరస్ గర్ల్స్ మీద ఉంది. ‘భలే ఉన్నారు కదూ’ అని మురిసిపోయాడు. తలెత్తి వెలిగి ఆరుతున్న లైట్లను చూసి ‘లైఫంటే యిదే!’ అని డిక్లేర్ చేశాడు. గ్రామాల నుంచి వచ్చే కుర్రాళ్లందరూ తరచుగా వాడే మాటే యిది! ‘ఔనౌను’ అన్నాను. ‘మీరు లక్కీ. ఇలాటి చోట్లకు తరచుగా వస్తూంటారు కాబోలు, మాకైతే ఏడాది కోసారి రావడమే గగనం. ఎప్పుడు చూసినా పంటలూ, కోతలూ, నూర్పుళ్లూ, పాడీపశువూ, యిదే గోల.’ అంటూ వాపోయాడు.
తరచుగా కాదురా బాబూ, రోజూ రావలసి వస్తుంది అని నేను అతనికి చెప్పలేదు. మా క్లబ్బు రూల్స్ ప్రకారం చెప్పకూడదు కూడా. లేకపోతే ప్రతీ రోజూ క్లబ్బు యిచ్చే లవర్లీ సిల్వర్ కప్ మాకే ఎందుకు వస్తుందో ఆ రహస్యం తెలిసిపోతుందిగా! ప్రతీ రోజూ డాన్సులు పూర్తవుతూండగా మా క్లబ్బు ప్రతినిథి ఒక ప్రకటన చేస్తాడు. డాన్సు చేస్తున్న ప్రతీ మహిళకూ ఒక్కో టిక్కెట్టు యిస్తాడు. తర్వాత లాటరీ తీస్తారు. ఎవరికి బహుమతి వస్తే వాళ్లకు ఆ సిల్వరు కప్పు యిస్తాడు. సోమ, బుధ, శుక్ర వారాల్లో ఆ కప్పు నాకు వస్తుంది. మంగళ, గురు, శని వారాల్లో నాలాటి ఉద్యోగినే ఐన మేబెల్కు వస్తుంది. ఇదంతా ప్లాను ప్రకారమే జరుగుతుందని తెలియని డాన్సర్లందరూ మమ్మల్ని అభినందిస్తారు. ఆ కప్పు క్లబ్బు గుమ్మం దాటదు. మేం యిక్కడ ఉద్యోగినులమని తెలిస్తే అల్లరై పోదూ! అందుకని ఏదో వేరే ఉద్యోగం చేస్తున్నామని, సరదాగా డాన్సు చేయడానికి వచ్చామనీ మేం చెప్పుకోవాల్సి వస్తుంది.
‘‘బతకాలంటే న్యూయార్కులోనే బతకాలి. నేను సిటీ అంటే పడి ఛస్తాను.’’ అన్నాడు చార్లీ. ‘‘మరింకేం? ఇక్కడే ఉండవచ్చుగా.’’ అన్నాను. ‘‘ఎలా? మా నాన్న పోయాడు. నామీద కుటుంబబాధ్యత ఉంది. పొలాలతో బాటు మాకో మందుల షాపు కూడా ఉంది మా ఊళ్లో. అవన్నీ చూసుకోవాలి. పైగా నాకు పెళ్లయింది కూడా. మా ఆవిడ పల్లెటూరు వదలనంటుంది.’’ అన్నాడతను దిగులుగా.
‘‘ఏమిటీ పెళ్లయిందా? మరి భార్యను దిక్కుమాలిన పల్లెటూరి యింట్లో కిటికీ దగ్గర దిగులుగా వదిలిపెట్టేసి, ఠింగురంగా అంటూ బ్రహ్మచారిలా క్లబ్బుకి వచ్చేశారా?’’
‘‘అబ్బే, వదిలిపెట్టి రాలేదు. కూడా తీసుకుని వచ్చాను. అదిగో ఆ పై బాల్కనీ కూచుంది చూడండి, మేరీ, తనే నా భార్య. మా ఏష్లీ కంటె కుగ్రామం వాళ్ల రోడ్నీ. ఒట్టి పల్లెటూరి గబ్బిలాయి. సిటీ అంటే వెగటు. నా పోరు భరించలేక వచ్చింది. డాన్సు రాదు కాబట్టి అక్కడే కూర్చుంది.’’ అంటూ ఒకామె కేసి చూపించాడు. నేను డాన్సు చేస్తూండగా ఆమెను యిందాకనే గమనించాను. మాకేసే గుర్రుగా చూస్తున్నట్లు కనబడింది. కారణం ఏమిటో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. వాళ్లాయన్ను ఎగరేసుకుని పోతానని బెంగ పడుతోందేమో, అలాటిదేదీ లేదు తల్లీ, రేపు పొద్దున్నకల్లా వీడి మొహం మర్చిపోతాన్నేను.
‘‘మీరు డాన్సు చేస్తూ తనను అక్కడ కూర్చోబెడితే ఏమైనా అనుకోదూ? తనతోనే డాన్సు చేయవచ్చుగా!’’ అన్నాను చార్లీతో. ‘‘అబ్బే, తనకు డాన్సు రాదు.’’ అని ఘంటాపథంగా చెప్పాడు చార్లీ.
‘‘అదేమిటి, డాన్సు రాకుండా ఎలా ఉంటుంది? మీ ఏష్లీలో డాన్సులు చేయరా?’’ ‘‘అహ అస్సలు రాదని కాదు. ఏష్లీకైతే తన డాన్సు ఫర్వాలేదు. కానీ న్యూయార్క్! న్యూయార్కుకి తన డాన్సు చాలదు.’’ అన్నాడు నా కాళ్లు యిప్పటికే పదిసార్లు తొక్కేసిన ఘననాట్యకళాకారుడు. ‘‘మరి మీరో!’’ అని అడిగితే ‘‘నేను న్యూయార్కుకి ఓసారి వచ్చాను కదా. నాకీ సంగతులన్నీ తెలుసు.’’ అంటూ గొప్పలు పోయాడు. నాకు ఒళ్లు మండింది. ‘నీ పెళ్లం నీ లెవెలు కాదని నీ బోడి అభిప్రాయం. క్లబ్బుకి తీసుకుని వచ్చి ఓ కుర్చీలో కూలవేసి, యిక్కడ పరాయి ఆడదానితో పెద్ద డాన్సర్లా వెధవ పోజు’ అనుకున్నాను కానీ పైకి అనలేదు, అంటే నా ఉద్యోగానికి ముప్పు. ‘‘నేను అలసిపోయాను. మా ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తాను. వాళ్లతో డాన్స్ చేయండి.’’ అంటూ వచ్చేశాను.
సరాసరి బాల్కనీకి వెళ్లి చార్లీ భార్య మేరీ దగ్గర కూర్చున్నాను. పల్లెటూరి నుంచి వచ్చినట్లు ఆమె వేషధారణే చెప్తోంది. అందగత్తె. వగలేవీ కురిపించే పని పెట్టుకోలేదు. బెరుకుగా, అసౌకర్యంగా కుర్చీలో కూర్చుని ఉంది. వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి ఆమె పెద్ద కళ్లు. బాల్కనీలోంచి డాన్సింగ్ ఫ్లోర్ కేసి, భర్త కేసి చూస్తోంది. ‘‘మీ ఆయనతో డాన్సు చేసి వస్తున్నాను.’’ అన్నాను. ‘‘చూశా’’ అందామె. ఆమె భుజం వేసి ‘‘సంగతేమిటి చెప్పండి’’ అన్నాను. ‘‘చెప్పడానికేముంది?’’ ‘‘అదే, పల్లెటూరి నుంచి యీ పట్నానికి ఎందుకు వచ్చావో చెప్పు. వచ్చి అంటీముట్టనట్టుగా ఎందుకు కూర్చున్నావో చెప్పు, మేరీ!’’ అన్నాను.
ఆమె కాస్సేపు మాట్లాడలేదు. టేబుల్ మీద ఉన్న వస్తువులు సర్దుతూ కాలం గడిపింది. తర్వాత ఏమనుకుందో నోరు విప్పింది. ‘‘హనీమూన్‌కి న్యూయార్క్‌కి వచ్చాం. నేను వద్దన్నాను. కానీ మా ఆయన వెళదామని పట్టుబట్టాడు. తను యింతకుముందే న్యూయార్క్‌కి వచ్చారట. తన కంతా కొట్టిన పిండి అన్నారు. తనకు యీ ఊరంటే వెర్రి…’’ ‘‘…నీకు మాత్రం ఆ వెర్రి లేనట్లుంది.’’ ‘‘అస్సలు లేదు. నాకు న్యూయార్కంటే భయమే కాదు, అసహ్యం కూడా. ఇక్కడకి వస్తే మనుషులు మారిపోతారు. ఇదొక పెద్ద మాయానగరం.’’ అందామె ఆవేశంగా.
‘‘నువ్విక్కడకి మొదటిసారి వచ్చావు. ఊరు కూడా సరిగ్గా చూసి ఉండవు. ఇంత దృఢమైన అభిప్రాయాలు ఎలా ఏర్పరచుకున్నావ్?’’ ‘‘విషయాలు తెలియడానికి స్వయంగా రావాలా? మాది రోడ్నీ అనే పల్లెటూరు. ఇల్లినాయి నుంచి రెండేళ్ల క్రితం అక్కడకు వెళ్లి స్థిరపడ్డాం. మా ఊళ్లో జాక్ టైసన్ అనే ఒకతను ఉండేవాడు. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు, ఎవరినీ దగ్గరకు రానిచ్చేవాడు కాదు. అదేమిటో నాకర్థమయ్యేది కాదు. ఓసారి ఎవరో చెప్పారతని కథ. అదే ఊళ్లో ఉన్న ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్లిద్దరూ హనీమూన్‌కి న్యూయార్కు వచ్చారు. ఆ అమ్మాయి సిటీ మోజులో పడింది. జీవితంలో మజా అనుభవించాలంటే యిక్కడే ఉండాలంది. కానీ అతనికి పల్లెటూరంటే ప్రాణం. వెనక్కి వెళ్లిపోదామన్నాడు. కావాలంటే నువ్వెళ్లు నేను యిక్కడే ఉంటానంది ఆమె. బలవంత పెట్టి తీసుకుని వచ్చాడు. రెండు నెలలుండి, ఓ రోజు పారిపోయింది. న్యూయార్కులోనే ఎక్కడో ఉండి వుంటుంది.’’
‘‘ఓఁ, విడాకులు తీసుకున్నారా మరి?’’
‘‘లేదు. అతనికి ఆ ఐడియానే లేదు. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తుందని ఆశ పెట్టుకుని కూర్చున్నాడు మానవుడు. ఆమె పారిపోయి మూడేళ్లయినా ఆమె గదిని, దానిలో వస్తువులనూ అలాగే ఉంచాడు.’’ ‘‘ఏడిసినట్టుంది. అదే నేనైతే, నా భార్యే అలా పారిపోతే, తిరిగి వస్తే, ఇన్నాళ్లూ ఎక్కడ తిరిగావే అని కోపం తెచ్చుకుని మర్డర్ చేసేదాన్ని.’’ ‘‘అతనలాటి రకం కాదు. నేనూ అంతే. ఒకసారి మనిషిని ప్రేమిస్తే వదిలిపెట్టను. రోజు రైల్వే స్టేషన్‌కు వెళ్లి న్యూయార్కు నుంచి వచ్చే రైలు కోసం చూస్తాను, అచ్చు అతనిలాగే!’’ ఈ మాటలు చెప్తూ ఉంటే ఆమె కళ్ల నుండి కన్నీటి బొట్లు జారి టేబుల్క్లాత్ మీద పడ్డాయి.
నేను కదిలిపోయాను. ‘‘ఎందుకు లేనిపోనివి ఊహించుకుంటావ్? ఇప్పుడేం జరగలేదు కదా’’ అన్నాను. ‘‘జరుగుతుంది, నాకు తెలుసు. ఆ రోడ్నీ అమ్మాయి లాగానే నా భర్త కూడా నన్ను పల్లెటూళ్లో పడేసి, న్యూయార్కులో సెటిలై పోతాడు. చూడండి, ఆయన వరస చూడండి.’’ అంది. చూశాను. చార్లీ లైఫంటే ఇదే అనుకుంటూ కాబోలు విరగబడి డాన్సు చేసేస్తున్నాడు. ‘‘నేను సిటీ అమ్మాయిల్లా కాదు. నా మోటు పద్ధతులు తనకు నచ్చవు. నేను తనకి తగనని అనుకుంటాడు. నాకు తనపై ఉన్న ప్రేమలో పదో వంతు తనకు నా మీద లేదు.’’ అంది కన్నీళ్లు తుడుచుకుంటూ.
ఆమెను ఎలా అనునయించాలో నాకు అర్థం కాలేదు. అంతలోనే మైకులో ఇజ్జీ కంఠం ఖంగుమని మోగింది. ‘‘లేడీస్ అండ్ జంటిల్మెన్, ఇప్పుడు లవర్లీ కప్ పోటీ జరుగుతుంది. ఇది దక్కాలంటే డాన్సు చేసే నైపుణ్యం, అదృష్టం రెండూ ఉండాలి. మేం ఆడవారి కందరికీ టోకెన్లు యిస్తాం. ఒక్కో నెంబరు చదువుతూంటే వాళ్లు ఫ్లోరు లోంచి కిందకు దిగి వెళ్లిపోవాలి. చివరకి ఎవరు మిగిలితే వారిదే కప్పు. అయితే వాళ్లు అప్పటిదాకా డాన్సు చేస్తూ ఉండాలి. ప్రేక్షకుల మెప్పు పొందుతూ ఉండాలి.’’ అనే ప్రకటన అందరికీ వినబడింది. నాకు మనసులో ఒక ఆలోచన మెరిసింది.
మేరీతో ‘‘కళ్లు తుడుచుకుని, మొహానికి కాస్త పౌడరు రాసుకుని వచ్చి డాన్సు చేయి.’’ అన్నాను. ‘‘వద్దండీ, ‘నీకు డాన్సు రాదు, పదిమందిలో చేసి నా పరువు తీయకు’ అని మా ఆయన చెప్పాడు.’’ అందామె. ‘‘నువ్వు తనతో చేయక్కరలేదు. ఒకతనికి పరిచయం చేస్తాను. అతనితో చెయ్యి చాలు.’’ అంటూ మొహమాట పెట్టబోయాను. ఆమె వద్దువద్దంది. ‘‘చూడు, అదృష్టవశాత్తూ లవర్లీ కప్ నీకే వచ్చిందనుకో. మీ ఆయనకు నీ మీద గౌరవం పెరుగుతుంది. అంతేకాదు, భవిష్యత్తులో అతను న్యూయార్క్ మాట ఎత్తగానే నువ్వు ‘ఔనౌను, నాకు కప్పు వచ్చిన న్యూయార్కు కదూ’ అందువుగాని. దెబ్బకి నోరు మూతపడుతుంది.’’ అని నచ్చచెపితే చివరకు సరేనంది.
నేను ఇజ్జీకి కంటపడగానే ‘హమ్మయ్య, నువ్వు కనబడకపోతే వచ్చావో లేదో అని హడిలి ఛస్తున్నాను. ఇదిగో నీ టిక్కెట్టు.’ అని యివ్వబోయాడు. ‘ఇంకోటి కూడా ఇయ్యి, నాతో పాటు మా ఫ్రెండ్ వచ్చింది.’ అన్నాను. ‘సరే నీది ముఫ్పై ఆరు. ఆమెది పది. కన్ఫ్యూజ్ కావద్దు.’ అని చెప్పాడు లోగొంతుతో. నేను మేరీ దగ్గరకు వచ్చి ఆమెకు టిక్కెట్టిచ్చి, డాన్సింగ్ ఫ్లోర్ దగ్గరకు తీసుకెళ్లి బాగా డాన్సు చేసే ఒక ఫ్రెండుకి అప్పచెప్పాను. నేను చార్లీ దగ్గరకు వెళ్లి ‘పద డాన్సు చేద్దాం’ అన్నాను.
కప్ మీద ఆశతో ఫ్లోర్ మీదకు అన్ని జంటలూ వచ్చేశాయి. ఉధృతంగా డాన్సు జరిగిపోతోంది. సంగీతం మోతెక్కిపోతోంది. ఇజ్జీ ఒక్కో నెంబరు చదువుతూంటే ఆ జంట తప్పుకుని ఫ్లోర్ ఖాళీ అవుతోంది. చార్లీ చేరిన కరస్పాండెన్స్ కోర్సులో డాన్సు చేస్తూ చుట్టూ చూడగలగడం నేర్పలేదు. అందువలన అతను తన కాళ్లూ చేతుల కేసి తప్ప మరేదీ చూడకపోవడం వలన గ్రహించలేక పోయాడు కానీ అతి త్వరలో అతనూ, నేనూ, మేరీ, ఆమె భాగస్వామీ, మరో జంట మాత్రమే మిగిలాం. నేను మేరీని గమనిస్తూనే ఉన్నా, చాలా చక్కగా డాన్సు చేస్తోంది. స్వేచ్ఛగా, ఉల్లాసంగా, తన కోసమే తను నృత్యం చేస్తున్నట్లు చేస్తోంది. అందరూ ఆమె కేసే చూస్తున్నారు. ఇంతలో యింకో జంట తప్పుకుంది.
నేను చార్లీతో, ‘‘మనకు పోటీగా యింకో జంట ఉంది. మనం అందరి దృష్టినీ ఆకర్షించాలంటే నువ్వేదైనా తమాషాగా చేయాలి.’’ అన్నాను. దాంతో అతను వంకర్లు తిరిగిపోతూ కుప్పిగంతులు వేయడం మొదలెట్టాడు. అప్పుడప్పుడు తూలి పడబోతూ ఉంటే నేను పట్టుకుంటూంటే ప్రేక్షకులు నవ్వుతున్నారని గ్రహించలేక పోయాడు. మా జంటకు బహుమతి వస్తే ప్రేక్షకులు హర్షించరని ఇజ్జీ అనుకున్నా, నన్ను నెగ్గించడం అతని ధర్మం కాబట్టి తప్పక ‘నెంబరు పది తప్పుకోవాలి’ అని ఎనౌన్సు చేశాడు. దాంతో నేను డాన్సు చేయడం మానేయడంతో ఇజ్జీ తెల్లబోయాడు. అతని లెక్క ప్రకారం పది మేరీది, ముప్ఫయిఆరు నాది. ‘‘పద చార్లీ, నా నెంబరు పది. మనం దిగాలి.’’ అన్నాను. చార్లీ చెమటలు కక్కుతూ, రుమాలుతో తుడుచుకుంటూ, తలెత్తి బాల్కనీ కేసి చూశాడు. పైన భార్య కనబడలేదు. నేను అతని మొహాన్ని ఫ్లోర్ కేసి తిప్పాను.
మేం ఫ్లోర్ దిగి వచ్చాక మేరీ, ఆమె భాగస్వామి మాత్రమే మిగిలారు. విజేతలుగా మిగిలిన ఆ ఇద్దరూ అద్భుతంగా డాన్సు చేయసాగారు. తన భార్య నాట్యం చూస్తూంటే చార్లీ నోరు తనంతట తానే తెరుచుకు పోయింది. తూలి పడబోయాడు. ‘తను.. తనకు…’ అంటూ ఏదో అనబోయాడు. ‘‘చూస్తున్నావుగా, తన డాన్సుతో సిటీ వాళ్లను కూడా మెప్పిస్తోంది. నీతో డాన్సు చేయడానికి తగదని నువ్వునుకున్నావు, హుఁ, రా కూర్చో, డ్రింక్ తాగుదువుగాని’’ అన్నాను. కుర్చీలో కూలబడ్డాడు కానీ అతనికి నోట మాట రావటం లేదు. అందరూ చప్పట్లు కొడుతూ ఆమెను అభినందిస్తున్నారు. ‘‘లవర్లీ కప్ తనదే కదా!’’ అన్నాడు పెదాలు తడారిపోతూండగా.
‘‘నిక్షేపంలా. మీకో సలహా చెప్పనా? మీరు మీ ఆవిణ్ని తీసుకుని తక్షణం ఏష్లీ వెళ్లిపోండి. లేకపోతే సిటీ భూతం తనను ఆవహించేస్తుంది. చూస్తున్నారుగా, యీ చప్పట్లు ఆమె తలకెక్కాయంటే రేపు మళ్లీ క్లబ్బుకి వస్తానని తయారవుతుంది. పల్లెటూర్లో ఏముంది మట్టి పిసుక్కోవడమే కదా, సిటీలోనే కాపురం పెడదామంటుంది. ఆమెకు ఆరాధకులు తయారవుతారు…’’
‘‘ఔనౌను, వ్యవహారం చూడబోతే అలాగే ఉంది.’’ అన్నాడతను దిగులుగా. ‘‘ఇందాకా బాల్కనీలో కూర్చున్నపుడు తను చెప్తోంది, వాళ్ల ఊళ్లో ఒకతని భార్య యిలాగే న్యూయార్కు వచ్చి అద్భుతంగా డాన్సు చేస్తే చప్పట్లు పడ్డాయట, అంతే, కాపురాన్ని అటకెక్కించి, సిటీలోనే తిష్ట వేసిందట…’’
‘‘జాక్ టైసన్ పెళ్లం గురించి మీకు చెప్పిందా? అంటే తనకూ మనసులో అలాటి ఊహలున్నా యన్నమాట’’ అంటూ బెంబేలెత్తాడు చార్లీ. ‘‘అనే నాకూ అనిపించింది. ఈ క్లబ్బులో ఉత్సాహం, ఉత్తేజం చూస్తే చూస్తే ఆమె ఎందుకలా చేసిందో తనకర్థమైంది అంది.’’ అన్నాను. చార్లీ తన సీటులో బిగుసుకు పోయాడు. అతని చేతులు వణికి డ్రింక్ తుళ్లిపడబోయింది. ‘‘రేపే తిరుగు ప్రయాణం’’ అన్నాడు. అంటూనే ‘తను ఒప్పుకుంటుందో లేదో’ అని సందేహించాడు. ‘‘అడిగి చూడండి, ఒప్పుకుంటే అదృష్టమే.’’ అంటూ లేవబోయాను.
ఇంతలో మేరీ కప్పు పట్టుకుని వచ్చింది. కప్పు టేబుల్ మీద పెట్టి దాని కేసి తృప్తిగా చూసి ‘‘చార్లీ డియర్, నీతో కలిసి డాన్స్ చేసి ఉంటే బాగుండేది.’’ అంది. నేనే తన స్థానంలో ఉంటే అలాటి డైలాగు ఛస్తే నా నోటి నుంచి వచ్చేది కాదు. చార్లీ గుటకలు మింగాడు. ‘‘మేరీ, మనం ఏం చేద్దామంటే, యీ కప్పు తీసుకుని రేపు పొద్దున ట్రెయిన్కే మనూరు వెళ్లి మనవాళ్లందరికీ చూపిద్దాం, సంతోషిస్తారు.’’ అన్నాడు. మేరీ సంతోషంగా ఓ అలాగే, అనడంతో మనసులో దేవుడికి దణ్ణం పెట్టుకున్నాడనుకుంటాను. అంతలోనే మేరీ ‘‘మరి నువ్వు సిటీలో చాలాకాలం ఉందావనుకున్నావు కదా, పోనీ ఓ వారం ఆగి వెళదామా?’’ అంది సందేహిస్తూ. ‘‘చూసింది చాల్లే. జన్మలో సిటీకి రావనక్కరలేదు.’’ అన్నాడు చార్లీ వణుకుతూ.
వాళ్లనలా వదిలేసి నేను ఇజ్జీ దగ్గరకు వెళ్లాను. నన్ను చూస్తూనే మనసులో అనుకున్న తిట్లన్నీ కలగాపులగం అయిపోయి, ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. ఏవేవో సౌండ్స్ చేశాడు. నేను నవ్వుతూ ‘‘నువ్వో నేనో పొరపాటు చేసి ఉంటాం. నంబర్లు తారుమారయ్యాయి.’’ అన్నాను. తన తప్పుందని అనడంతో దెబ్బకి మాటలు దూసుకు వచ్చాయి. ‘‘నాదేం పొరపాటు లేదు. నీ నెంబరు ముప్ఫయిఆరని స్పష్టంగా చెప్పాను…’’ అంటూ లంకించుకోబోయాడు. ‘‘పోన్లే, నాదే తప్పు. సారీ. ఇంక వదిలేయ్. కానీ ఆ అమ్మాయి డాన్సు చూశాక అందరూ నీ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు చూడు. పైగా ఆమె భర్తా చూడు ఎంత ఆనందంగా ఉన్నారో. ఆ పుణ్యం నీకే దక్కుతుంది.’’ అన్నాను కూల్‌గా.
ఇజ్జీ వాళ్ల కేసి, నాకేసి తేరిపార చూశాడు. తర్వాత అంతా అర్థమైనట్లు ‘‘ఇదంతా నీ కుట్ర. కావాలని ఆ అమ్మాయిని గెలిపించావు. ఎందుకో నాకు తెలియదు. ఈ సంగతి ఓనరు గారికి చెప్తాను. ఆయన నీ తాట తీస్తాడు, ఉద్యోగం పీకేసినా పీకేస్తాడు. తర్వాత ఏడ్చి ప్రయోజనం లేదు. వీధుల్లో పడి..’’ అంటూ ఆవేశపడుతూండగానే నేను ఆపాను.
‘‘ఆయనకా శ్రమ అక్కర్లేదు. నేనీ క్షణమే రాజీనామా చేస్తున్నా. న్యూయార్క్ రోడ్ల మీద అడుక్కోను. అసలీ సిటీ అంటేనే రోత పుట్టింది, తప్పనిసరిగా చేసే డాన్సంటే కూడా. నేను మా పల్లెటూరికి వెళ్లిపోతా. హాయిగా పాడీపంటా చూసుకుంటూ కులాసాగా గడుపుతా. భర్తతో ప్రేమగా ఉంటూ పిల్లల్ని కంటా. ఎంత లేటైనా సరే ఈ రాత్రి ట్రెయిన్కే వెళ్లిపోతా. ఓనరు గారికి సారీ అని చెప్పు.’’
ఇజ్జీ కంగారు పడ్డాడు. ‘‘నువ్వయితే తెగించావు. కానీ యిందులో నా తప్పేమీ లేదని ఓనరుగారికి చెప్పి వెళ్లు. లేకపోతే నా పీక పిసుకుతాడు.’’
‘‘..నీపై సందేహముంటే మా ఆయన అడ్రసుతో ఉత్తరం రాయమను. తప్పందే నాదేనని రాసిస్తా.’’
‘‘ఇంతకీ అతని అడ్రస్సేమిటి?’’
‘‘జాన్ టైసన్, రోడ్నీ!’’
(పి.జి.ఉడ్‌హౌస్ రాసిన ‘‘ఎట్ గైసెన్హైమర్స్’’ కథకు స్వేచ్ఛానువాదం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2022)
చదువుతుంటే అనిపించింది ఈ ట్విస్ట్…ఎండింగ్ చాలా బాగుంది
పెశాదు పూర్తిగా మారిపోయాదా, మారిపోయినట్టు నటిస్తున్నాడా లేకపోతే తప్పు తెలుసుకొన్నాడా… గగన్ గాడి భజన ఆపేసినాడు… వాడు లోకాకళ్యాణం కోసం పుట్టినోడు అని టముకు వెయ్యడం మానేసినాడు… ఇదంతా నమ్మలేకపోతున్నా…