అస్సాంలో జరిగింది ఈ వింత ఘటన. కేవలం వింత ఘటన మాత్రమే కాదు, గుండెల్ని పిండేసే విషయం కూడా. చనిపోయిన ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేశాడు ప్రియుడు. ఆమె నుదిటిపై సింధూరం పెట్టాడు.
బితుపన్ తమోలి, ప్రార్థన కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా తమ ప్రేమ వ్యవహారాన్ని తమ ఇళ్లల్లో కూడా చెప్పారు. వీళ్ల ప్రేమను అంగీకరించాలా వద్దా అనే చర్చల్లో రెండు కుటుంబాలూ ఉన్నాయి.
వీళ్ల ప్రేమ విషయం ఓవైపు ఇలా నలుగుతుంటే, మరోవైపు ఊహించని విధంగా ప్రార్థన అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆమెను గౌహతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కొన్ని రోజులుగా హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్న ప్రార్థనను వైద్యులు కాపాడలేకపోయాడు. ఆమె చనిపోయింది.
ప్రేయసి మరణించిన విషయం తెలుసుకున్న బితుపన్, వెంటనే హాస్పిటల్ కు పరుగెత్తుకొచ్చాడు. పెళ్లాడతానంటూ ప్రేయసికి ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. ప్రార్థన భౌతిక కాయానికే దండ వేశాడు. పార్థిక దేహానికి సింధూరం పెట్టాడు. అలా ఆమెను బరువెక్కిన గుండెతో, కన్నీళ్లు పెట్టుకుంటూ పెళ్లి చేసుకున్నాడు.
ఈ సందర్భంగా బితుపన్ ఓ ప్రతిజ్ఞ కూడా చేశాడు. తన జీవితాంతం ప్రార్థన తన భార్యగా కొనసాగుతుందని, మరో అమ్మాయిని పెళ్లాడనని శపథం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇలా చనిపోయిన వ్యక్తుల్ని పెళ్లాడడం అస్సాంలో వింత. కాకపోతే సౌత్ లో మాత్రం ఇది మరీ కొత్తేం కాదు. దక్షిణ కర్నాటక, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం ఉంది. దీన్ని అక్కడ 'ప్రేత కల్యాణం'గా వ్యవహరిస్తారు.