బాలీవుడ్ లో మరో ప్రేమకథ మొదలైంది. మాజీ మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉంది. ఆమె ప్రేమిస్తున్న వ్యక్తి పేరు నిఖిల్ కామత్. ఇతడో వ్యాపారవేత్త.
నిజానికి వీళ్లిద్దరూ మూడేళ్ల నుంచి ప్రేమలోనే ఉన్నారట. కాకపోతే ఆ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. కలిసి ఇప్పటికే 3 దేశాలు తిరిగొచ్చారు. అయితే మన దేశంలో ఎక్కడా కలిసి కనిపించలేదు. అందుకే ఇన్నాళ్లూ వీళ్ల సీక్రెట్ డేటింగ్ సాగింది.
అయితే ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ రోజులు దాగవు. తాజాగా రిషికేష్ లో వీళ్లిద్దరూ కలిసి పూజలు నిర్వహించారు. అదిగో, సరిగ్గా అక్కడే వీళ్లిద్దరి వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా ఉంది.
2017 నుంచి లైమ్ లైట్లోకి వచ్చింది మానుషి ఛిల్లర్. అక్షయ్ కుమార్ నటించిన పృధ్వీరాజ్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తన మనసులో ఎవ్వరూ లేరని, తను సింగిల్ అంటూ ఆ సినిమా ప్రమోషన్స్ లో ఆమె ప్రకటించుకుంది. కట్ చేస్తే, ఇప్పుడు నిఖిల్ తో ప్రత్యేక పూజలు చేస్తూ మీడియా కంటపడింది.
ఇక నిఖిల్ కామత్ విషయానికొస్తే, ఇతగాడికి ఆల్రెడీ పెళ్లయింది. 2019లోనే ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత ఏడాదికే భార్యతో విడిపోయాడు. గతేడాది ఆమె నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నాడు. 2019లోనే మానుషి-నిఖిల్ ఒకరికొకరు బాగా క్లోజ్ అయ్యారంట.