‘జబర్దస్త్’తో ఇంటిల్లిపాది హాస్యాన్ని పండిస్తున్న బుల్లితెర స్టార్స్ సుధీర్, రష్మీ గురించి జనానికి పరిచయం అక్కర్లేదు. అన్‌లాక్ నేపథ్యంలో మళ్లీ బుల్లితెర షూటింగ్‌లు స్టార్ట్ అయ్యాయి. దీంతో వాళ్లిద్దరు మళ్లీ బుల్లితెరపై వాళ్లిద్దరూ మెరుస్తున్నారు. ఓ చానల్‌కు వాళ్లిద్దరు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మొదటి సారి జబర్దస్త్ సెట్లోనే తమకు పరిచయమైనట్టు రష్మీ, సుధీర్ తెలిపారు. అంతకు ముందెప్పుడూ తమకు పరిచయం లేదన్నారు. లాక్డౌన్ కాలంలో వైజాగ్‌లో అమ్మతో గడిపినట్టు రష్మీ తెలిపారు. వీధి కుక్కల ఆకలి తీర్చేదాన్నని ఆమె తెలిపారు. ఇక సుధీర్ విషయానికి వస్తే ఇంట్లోనే ఉంటూ తనకు కావాల్సింది వండుకు తినేవాడినన్నాడు. బ్యాచిలర్‌గా నేర్చుకున్న వంట ఇప్పుడు ఉపయోగపడిందన్నాడు.
లాక్డౌన్లో తాను అమ్మను బాగా మిస్ అయినట్టు సుధీర్ వాపోయాడు. అక్క దగ్గర ఉండడానికి కెనడాకు వెళ్లిన అమ్మ, అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నాడు. లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత రోజే అక్కకు బాబు పుట్టినట్టు సుధీర్ తెలిపాడు.
అన్‌లాక్ తర్వాత షూటింగ్స్ మొదలు కావడంతో మళ్లీ హైదరాబాద్ వచ్చినట్టు రష్మీ తెలిపారు. ప్రపంచంలో అమ్మను మించిన బలం, ధైర్యం లేవన్నారు. లాక్డౌన్ తనకు అనేక విషయాల్లో కళ్లు తెరిపించినట్టు రష్మీ తెలిపారు. లాక్డౌన్ ముందు వరకు తన ప్రపంచం షూటింగ్, ఇల్లు మాత్రమే ఉండేవన్నారు. లాక్‌డౌన్‌తో ప్రజల ఆలోచనలేంటో తెలిసి వచ్చాయన్నారు. తానేం చేసినా నెగిటివ్‌గా తీసుకున్నారని, దీంతో షాక్‌కు గురైనట్టు ఆమె చెప్పుకొచ్చారు.
లాక్డౌన్ టైమ్‌లో చాలా మందితో గొడవపడినట్టు రష్మీ తెలిపారు. కుక్కలకు ఆహారం ఇవ్వడానికి బయటకు వెళితే కొంత మంది వచ్చి ‘ఇక్కడ పెట్టకండి.. అక్కడ పెట్టకండి’ అనేవారని వాపోయారు. ఆ క్షణాన తనకు కోపం వచ్చి ‘అవి కావు జంతువులు… మీరు జంతువులు’ అని గొడవ పడినట్టు చెప్పుకొచ్చారు.
సుధీర్ చాలా రొమాంటిక్ అని రష్మీ తెలిపారు. రొమాంటిక్ అనే డ్రమ్ము ఉంటే అందులో సుధీర్‌ను దేవుడు ముంచి తీశాడని ఆమె సరదాగా చెప్పారు. సుధీర్‌లో రొమాంటిక్ యాంగిల్ చాలా బాగుంటుందన్నారు. సుధీర్ సున్నితమైన మనిషి అని పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే సుధీర్‌లో రొమాంటిక్ యాంగిల్‌కు 10కి 100 మార్కులు రష్మీ వేశారు. దీన్ని బట్టి సుధీర్ రొమాంటిక్ యాంగిల్‌కు రష్మీ ఫిదా అయ్యారని అర్థమవుతోంది.
అంతేకాదు. ఈ సందర్భంగా సుధీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సుధీర్‌ను పెళ్లి ఎవరు చేసుకుంటారో గానీ, తొలి ఆరునెలలు జీవితాన్ని సినిమాటిక్‌గా చూపిస్తాడన్నారు.
టీవీ చానల్స్‌లో హిట్ పెయిర్‌గా పేరొందిన ఈ జంటపై సినిమాలు తీసేందుకు చాలా మంది ముందుకొచ్చినట్టు సుధీర్ తెలిపాడు. ఇంకా వస్తున్నారని కూడా చెప్పాడు. మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్టు అతను తెలిపాడు. ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే కథ వస్తే తప్పక చేస్తామని రష్మీ తెలిపారు.