విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ బీజేపీ నేతల ప్రకటనలు ఎలా ఉన్నా కేంద్రం మాత్రం ఒక పద్ధతి ప్రకారమే ముందుకు సాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి డెడ్ లైన్ పెట్టుకుని పనిచేస్తోంది అన్నది అంతా అనుమానిస్తున్న విషయమే.
దానికి బలం చేకూర్చే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ముంగిటలోనే చావు కబురు చల్లగా చెప్పారు కేంద్ర ఉక్కు కార్యదర్శి ఎన్ ఎన్ సిన్హా. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించారు. అక్కడ పరిస్థితులు తెలుసుకున్నారు, ఉన్నతాధికారులతో మీటింగ్ నిర్వహించారు.
ఉక్కు కార్యదర్శి వస్తున్నారు అంటే ఏదైనా మంచి వార్త మోసుకొస్తారని కార్మిక సంఘాల నేతలు ఆశలు పెట్టుకుంటే ఆయన సందర్శకుల బుక్ లో రాసిన మాటలు చూసి భారీ షాక్ కి గురి అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రెండేళ్ల లో మూతపడనుంది అంటూ ఆయన రాసిన ఈ కామెంట్స్ స్టీల్ ప్లాంట్ కార్మిక లోకంలో మంటను పుట్టిస్తున్నాయి. రెండేళ్ళకు మించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పాదక ఉండని ఆయన తేల్చేశారు. ఇంతటి శుభకరమైన సందేశాన్ని ఆయన రాసి ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెబుతూ సంతకం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కి రెండేళ్ళు మాత్రమే గడువు అంటూ ఆయన రాసిన ఈ మాటల మీద ప్లాంట్ అంతా చర్చ సాగుతోంది. ఆయన అంటున్నది ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగదు అనా లేక ఏకంగా ప్లాంటే మూత పడడమా అని తర్కించుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ జాతకాన్ని ఇంత చక్కగా రాసిన ఎస్ ఎస్ సిన్హా కార్మికుల ఆశల మీద నీళ్ళు చల్లేసి పోయారని మండుతున్నారు.
విశాఖలో బుధవారం రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి స్టీల్ ప్లాంట్ మీద తమకు చిత్త శుద్ధి ఉందని, తాము మేలు జరిగేలా చూస్తామని అంటున్నారు. సాక్షాత్తూ కేంద్ర ఉక్కు కార్యదర్శి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆయుష్షు ఇంతే అని చెప్పేశాక బీజేపీ నేతలు ఇలా మాట్లాడడం నిజంగా విడ్డూరంగానే ఉందని ఉక్కు ఉద్యమకారులు అంటున్నారు.