మరో వారాంతం మొదలుకాబోతోంది. ఈసారి ఒక రోజు ముందే బాక్సాఫీస్ కు వీకెండ్ వస్తోంది. ఈ వారం సినిమాల సందడి రేపట్నుంచే షురూ కాబోతోంది. రేపు దుల్కర్ సల్మాన్ నటించిన 'కింగ్ ఆఫ్ కొత్త' రిలీజ్ అవుతోంది.
సీతారామం నుంచి దుల్కర్ పై తెలుగు ఆడియన్స్ ఫోకస్ పెరిగింది. అందుకు తగ్గట్టే దుల్కర్ కూడా, టాలీవుడ్ పై గట్టిగా ఫోకస్ పెట్టాడు. తన కొత్త సినిమా కోసం టాలీవుడ్ లో గట్టిగా ప్రచారం చేశాడు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రేపు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది. మలయాళంలో కొత్త అంటే టౌన్ అని అర్థం. తెలుగులో దీనికి వేరే అర్థం ఉంది. అందుకే తెలుగులో దీన్ని 'కింగ్ ఆఫ్ కోతా'గా వ్యవహరిస్తున్నారు.
ఇక శుక్రవారం రోజున అంచనాలతో వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. పూర్తిస్థాయి యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ట్రయిలర్ హిట్టవ్వడం ఈ సినిమాకు ప్లస్ అయింది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాజర్, విమలా రామన్ కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది వరుణ్ తేజ్ కు ఇదే తొలి సినిమా.
గాండీవధారి అర్జునకు పోటీగా వస్తోంది బెదురులంక. కెరీర్ లో కాస్త గ్యాప్ తీసుకున్న కార్తికేయ నుంచి వస్తున్న సినిమా ఇది. డీజే టిల్లూ బ్యూటీ నేహాశెట్టి హీరోయిన్. 2012లో బెదురులంక అనే లంక గ్రామంలో జరిగే ఫిక్షనల్ కథ ఇది. యుగాంతం అవుతుందనే పుకార్ల నేపథ్యంలో.. ఆ గ్రామంలోని కొంతమంది దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రపంచం అంతం అయిపోతుందంటూ నమ్మించి, గ్రామస్తుల్ని దోచుకుంటారు.
సరిగ్గా అదే టైమ్ లో గ్రామంలోకి ప్రవేశిస్తాడు హీరో. ఈ కట్టుకథలు, మోసాల నుంచి హీరో తన గ్రామాన్ని ఎలా కాపాడుకున్నాడనేది ఈ సినిమా స్టోరీ. చెప్పుకోడానికి సీరియస్ సబ్జెక్ట్ గా ఉన్నప్పటికీ, దీన్ని కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు. మణిశర్మ సంగీతం హైలెట్ అంటున్నారు.
గాండీవధారి అర్జున, బెదురులంక సినిమాలతో పాటు అదే రోజు దక్ష, నేనేనా, ఏం చేస్తున్నావ్ సినిమాలొస్తున్నాయి. రెజీనా లీడ్ రోల్ పోషించిన సినిమా నేనేనా. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వస్తోంది. ఇక దక్ష సినిమాలో శరత్ బాబ దత్తపుత్రుడు హీరోగా నటించాడు.
ఇక 26వ తేదీ శనివారం, కన్నడ డబ్బింగ్ మూవీ బాయ్స్ హాస్టల్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాల్లో ఈ వీకెండ్ ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి. ఆల్రెడీ గతవారం రిలీజైన సినిమాలు నిరాశపరచడంతో, ఈ వారం వరుణ్ తేజ్, కార్తికేయ లాంటి హీరోలకు మంచి అవకాశం దక్కింది.