వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే బ్యాంకింగ్ వెబ్ సైట్లే.. నెలకోసారి ఇబ్బంది పెడుతుంటాయి, వారానికోసారి సర్వర్ డౌన్ అవుతుంది. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ డౌన్ కావడంలో వింతేముంది. అయితే ఆ వింతలో మరో వింత జరగడంతో కలకలం రేగింది. టీటీడీ వెబ్ సైట్ సర్వర్ డౌన్ కావడంతో పాటు, ఆ సైట్ లోకి వెళ్లినవారంతా టికెట్ బుకింగ్ పేజ్ పై క్లిక్ చేసిన వెంటనే జియో మార్ట్ అనే సబ్ డొమైన్ లోకి వెళ్లడంతో అసలు సమస్య మొదలైంది.
టీటీడీ వెబ్ సైట్ ని రిలయన్స్ సంస్థకు అమ్మేశారని, టీటీడీ టికెట్లను రిలయన్స్ సంస్థ విక్రయిస్తోందని, ప్రైవేటు పరం చేయడం దారుణం అని, సామాన్యులకు శ్రీవారి దర్శనం దుర్లభం అయిపోతోందని రకరకాల ప్రచారం జరిగింది.
300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను శుక్రవారం టీటీడీ విడుదల చేసిన తర్వాత ఈ సమస్య తలెత్తింది. మీడియాలో, అందులోనూ టీడీపీ అనుకూల మీడియాలో దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ కూడా ఇచ్చారు. టీటీడీ వెబ్ సైట్ నిర్వహణకు జియో సంస్థ 3 కోట్ల రూపాయల విలువైన క్లౌడ్ సేవలను ఉచితంగా అందించడానికి ముందుకొచ్చిందని చెప్పారు.
ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేసిన సమయంలో ఒక్కసారిగా సర్వర్ పై భారం పెరగడంతో సమస్య తలెత్తిందని, ఆ సమయంలో క్లౌడ్ సేవలు ఇస్తున్న జియో సంస్థకు చెందిన జియోమార్ట్ అనే సబ్ డొమైన్ వినియోగించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. అంతలోనే జియో మార్ట్ పేరుతో హంగామా మొదలైందని, టీటీడీపై తప్పుడు ప్రచారం చేయడం తగదని చెప్పారాయన.
ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తగా టాటా సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ సిబ్బంది దాన్ని పరిష్కరించారని చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. క్లౌడ్ సేవల కోసం జియో, అమెజాన్, అభీ బస్, బుక్ మై షో వంటి ఏజెన్సీలను సంప్రదించిన సందర్భంలో జియో సంస్థ 3కోట్ల రూపాయల విలువైన సేవలను ఉచితంగా అందిస్తామంటూ ముందుకొచ్చిందని, అందుకే తాము ఆ సంస్థకు మొగ్గు చూపామన్నారు. దర్శనాల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు నిన్నంతా సామాన్య భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా ఆన్ లైన్ వ్యవస్థ ప్రారంభించి, ఇన్నాళ్లూ అమల్లో ఉన్న టోకెన్ సిస్టమ్ ను నిలిపివేయడంతో, ఆ సమాచారం లేని చాలామంది భక్తులు నిన్న టోకెన్ల కోసం వచ్చి ఇబ్బంది పడ్డారు.