ఈ విషయాన్ని స్వయంగా ఏబీఎన్ ఆర్కేనే పలు సార్లు చెప్పుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే తన ఓపెన్ హార్ట్ కార్యక్రమానికి ఆహ్వానించినట్టుగా ఆర్కే మరొకరిని ఇంటర్వ్యూ చేస్తున్న సమయాల్లో చెప్పుకున్నారు! జగన్ ను తను పిలిచినట్టుగా అయితే ఆయన రాలేదన్నట్టుగా వారితో కంప్లైంట్ చేశారు ఆర్కే. అయితే ఒకవైపు జగన్ పై తీవ్ర స్థాయి వ్యక్తిగత దాడికి ఏ రోజూ ఆర్కే వెనుకాడలేదు. తన వీకెండ్ కామెంట్స్ లో జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వీకెండ్ కామెంట్ లో ఆర్కే ఆత్మఘోషను చదివే యాంకర్ జగన్ ను ఉద్దేశించి ఏకవచనంలోనే సంబోధించే వారు. ఆ మాటలు కూడా తీవ్రంగా ఉండేవి. జగన్ కు అనేక రకాల సవాళ్లు విసిరారు ఆ కామెంటరీల్లో. ఒక రాజకీయ నేత మరో రాజకీయ నేతకు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసిరితే అదో లెక్క. అయితే ఆర్కే మాత్రం జగన్ తో వ్యక్తిగత సవాళ్లు, ప్రతిసవాళ్ల విషయంలో టీడీపీ నేతలను మించిన స్థాయిలో వ్యవహరించారు తన వీకెండ్ కామెంట్లలో. అంతేకాదు జగన్ పై దుష్ప్రచరానికి వెనుకాడలేదు. మరి అలాంటిది అలాంటి ఆర్కే పిలవగానే జగన్ ఇంటర్వ్యూ కోసం వెళతారని ఎవ్వరూ అనుకోలేరు!
మీడియాతో జగన్ ఇంటరాక్ట్ అవుతున్నదే తక్కువ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ను మీడియా పట్టించుకోలేదు, మీడియాను జగన్ కూడా ఖాతరు చేయలేదు. పాదయాత్ర ముగింపు సమయంలో మాత్రం కొన్ని చానళ్లు ఇంటర్వ్యూలు చేశాయి. అయితే ఆ సమయంలో కూడా జగన్ డైరెక్టుగా ప్రజలతో మాట్లాడటానికి, జాతీయ మీడియాతో మాట్లాడానికి ఆసక్తి చూపించారు తప్ప, ఎలాగూ తనపై వ్యతిరేక ప్రచారానికే కట్టుబడి ఉండే వర్గ మీడియాతో మాట్లాడటానికి పెద్ద ఆసక్తి చూపలేదు.
అలా జగన్ ను ఇంటర్వ్యూ చేయాలన్న ఆర్కే ప్రయత్నం నెరవేరలేదు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకు ఇది వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో భూమన వంటి వారు హాజరయ్యారు. ఆ మధ్య గాలి జనార్ధన్ రెడ్డిని ఇంటర్వ్యూను చేశారు ఆర్కే. జనార్ధన్ రెడ్డిపై కూడా ఆంధ్రజ్యోతి లెక్కలేనన్ని కథనాలను రాసింది. బ్రహ్మణీ స్టీల్స్ ఏర్పాటు సమయంలో ఆంధ్రజ్యోతి రాసిన కథనాలు అసెంబ్లీలో సైతం చర్చకు వచ్చాయి. అవి అదే స్థాయిలో అభాసుపాలయ్యాయి కూడా.
అందుకు ప్రతిగా ఆంధ్రజ్యోతిపై గాలి జనార్ధన్ రెడ్డి కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. చాలా విరామం తర్వాత జనార్ధన్ రెడ్డి తో ఇంటర్వ్యూ పెట్టుకున్నారు. ఇలాంటి పరంపరలో.. ఇప్పుడు షర్మిలతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సంభాషణ ప్రసారం అయ్యే సమయం వచ్చినట్టుగా ఉంది.