జ‌గ‌న్ స‌మ‌ర్పించిన జీరో బ‌డ్జెట్ ఎన్నిక‌లివి!

పైసా ఖ‌ర్చు పెట్ట‌కుండా జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వులు పొందుతున్నారు, జ‌డ్పీ వైస్ చైర్మ‌న్లు, ఎంపీపీలు.. జ‌డ్పీ స‌భ్యులు, ఎంపీటీసీలూ అంద‌రి క‌థా ఇదే! ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇదొక అరుదైన సంఘ‌ట‌న‌గా చెప్పుకోవ‌చ్చు. ఈ…

పైసా ఖ‌ర్చు పెట్ట‌కుండా జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వులు పొందుతున్నారు, జ‌డ్పీ వైస్ చైర్మ‌న్లు, ఎంపీపీలు.. జ‌డ్పీ స‌భ్యులు, ఎంపీటీసీలూ అంద‌రి క‌థా ఇదే! ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇదొక అరుదైన సంఘ‌ట‌న‌గా చెప్పుకోవ‌చ్చు. ఈ రోజు జ‌డ్పీ చైర్మ‌న్ గా ఎన్నిక అవుతున్న‌, బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న వాళ్ల‌లో ఒక్క‌రంటూ ఒక్క‌రు కూడా తెలునాట రొటీన్ గా అయ్యే 'ఎన్నిక‌ల ఖ‌ర్చు' పెట్ట‌లేదు! దీనికి ఏ ఎన్నిక‌ల క‌మిష‌నో సాక్ష్యం అవ‌స‌రం లేదు. క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే చాలు!

ఎంత‌లా అంటే.. ఇది వ‌ర‌కూ ల‌క్ష‌లు, కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి జ‌డ్పీ చైర్మ‌న్లు అయిన నేత‌లు ఇప్పుడు జ‌డ్పీ చైర్మ‌న్లుగా ఎన్నిక‌వుతున్న నేత‌ల‌ను చూసి కుళ్లుకుంటున్నారు! తాము  జ‌డ్పీ చైర్మ‌న్లుగా ఎన్నికైన‌ప్పుడు పెట్టిన ఖ‌ర్చుల‌ను వ‌ల్లె వేస్తున్నారు! జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను గ‌తంలో పార్టీ ఫండ్ ల‌కు అమ్ముకున్న అధ్య‌క్షులున్నారు! అలాగే జ‌డ్పీటీసీ స‌భ్యుల‌కు ఖ‌ర్చుల‌కు ఇచ్చి చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను పొందిన వారూ ఉన్నారు! పార్టీ అధినేత వ‌ద్ద కోట్ల రూపాయ‌లు చెల్లించుకుని జ‌డ్పీ చైర్మ‌న్లు అయిన వారూ ఉన్నారు. 

ఇక తాము గెల‌వ‌డానికి, పార్టీ అభ్య‌ర్థులు గెల‌వ‌డానికి కోట్లు వెచ్చించిన సంద‌ర్భాలూ ఉన్నాయి. చాలా చోట్ల రాజ‌కీయ లాబీయింగ్ చేయ‌గ‌లిగే వారే జ‌డ్పీ చైర్మ‌న్లు అయ్యారు చ‌రిత్ర‌లో!  లాబీయింగ్ అంటే మ‌రేం లేదు.. జ‌స్ట్ ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హార‌మే!

అయితే.. ఇప్పుడు జ‌డ్పీ చైర్మ‌న్లుగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న వారికి అలాంటి లంపటాలు లేవు! రూపాయి ఖ‌ర్చు లేదు, జ‌డ్పీటీసీ స‌భ్యుల‌ను బుజ్జ‌గించేది లేదు, వారిని సంతృప్తి ప‌ర‌చ‌డానికి గిఫ్ట్ లు, కోట్ల రూపాయ‌ల సొమ్ముల చెల్లింపు లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓటుకు నోటు పంచింది లేదు, మ‌ద్యం పంపకాలు లేవు, కోట్ల రూపాయ‌ల వ్య‌య‌ప్ర‌యాసాలు లేవు! అలా పోటీ చేశారు, ఇలా గెలిచారు, ఇప్పుడు చైర్మ‌న్లు అవుతున్నారు. మ‌ధ్య‌లో కోర్టు తీర్పుల‌తో.. కాస్త లేటు అయ్యిందంతే!

తెలుగుదేశం పార్టీ  ఈ ఎన్నిక‌ల‌ను పేరుకు బ‌హిష్క‌రించినా, ఆ పార్టీ మ‌ద్ద‌తుదార్లు ప్ర‌చారం చేసుకున్నారు. 22 శాతం ఓట్ల‌ను కూడా పొందారు. టీడీపీ త‌ర‌ఫున ఎలాగూ గెలుపు మీద న‌మ్మ‌కం లేదు కాబ‌ట్టి.. వాళ్లు కూడా ఖ‌ర్చు పెట్టింది లేదు. చాలా చోట్ల నామినేష‌న్ల‌ను వేయ‌డానికి కూడా క్యాడ‌ర్ ముందుకు రాలేదు. అయితే క్యాడ‌ర్ ను స‌మావేశం అంటూ పిలిపించి, ఆయా నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జిలు.. దొరికిన వారి చేత నామినేష‌న్ ప‌త్రాల‌పై సంత‌కాలు పెట్టించారు.

ఇలా టీడీపీ ఎలాగోలా పోటీలో నిలిచింది. తీరా నామినేష‌న్ల ప‌ర్వం అయ్యాకా.. పంచాయ‌తీ, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల స‌ర‌ళిని చూసి చంద్ర‌బాబు నాయుడు వ్యూహాత్మ‌కంగా బ‌హిష్క‌ర‌ణ అంటూ కొత్త డ్రామాకు తెర‌తీశారు. చంద్ర‌బాబు బ‌హిష్క‌రించిన‌ట్టుగా పిలుపునిచ్చినా, పోటీ చేసిన అభ్య‌ర్థులు ఆశ‌లు వ‌దులుకోలేదు. టీడీపీ మద్ద‌తుదారులూ ఓటేయ‌కుండా ఆగ‌లేదు. దీంతోనే 22 శాతం ఓట్ల‌ను టీడీపీ పొందింది.

అధికార పార్టీనే రూపాయి కూడా అడ్డగోలు ఖ‌ర్చు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌తిప‌క్షాల‌కు ఆ అవ‌స‌ర‌మే లేక‌పోయింది. ఓటుకు నోటు, మ‌ద్యం, ఇత‌ర జ‌మాఖ‌ర్చులు లేకుండా.. తెలుగునాట జ‌రిగిన పెద్ద ఎన్నిక‌లు ఇవి! పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అయినా ప‌ల్లెల్లో పోటాపోటీ ప‌రిస్థితి త‌లెత్తి ప్ర‌లోభాలు ఏమైనా జ‌రిగి ఉండొచ్చు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పార్టీ క‌న్నా.. వ్య‌క్తిగ‌త ప‌రువే ప్రాధాన్య‌త కావ‌డంతో అభ్య‌ర్థులు ప్రలోభాల‌కు తెర‌తీసి ఉండొచ్చు. అది కూడా ప‌రిమిత స్థాయిలోనే. ఇక మున్సిపాలిటీల వ‌ర‌కూ వ‌చ్చేస‌రికే.. ఓటుకు నోటు కానీ, మ‌ద్యం కానీ అడ్ర‌స్ లేదు.

ఇక ఎంపీటీసీ, జ‌డ్పీ ఎన్నిక‌లు రూపాయి అద‌న‌పు ఖ‌ర్చు లేకుండా సాగాయి. గ‌తంలో కోట్లు ఖ‌ర్చు పెట్టి జ‌డ్పీ చైర్మ‌న్లు అయిన వారు, ఇప్పుడు ప‌ద‌వుల‌ను అలంక‌రిస్తున్న వారి అదృష్టాన్ని చూసి అక్క‌సు చెందుతున్నారంటేనే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. అచ్చంగా ఇవి జ‌గ‌న్ స‌మ‌ర్పించిన జీరో బ‌డ్జెట్ ఎన్నిక‌లే. రానున్న రోజుల్లో.. అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల విష‌యంలో కూడా.. ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే.. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఏపీ క్లీన్ స్టేట్ గా నిల‌వడం ఖాయం! 1995-99ల నుంచి ఏపీలో తీవ్రం అయిన ఓటుకు నోటు, మ‌ద్యం సంస్కృతికి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పూర్తిగా చ‌ర‌మ‌గీతం పాడ‌గ‌లిగితే.. జ‌గన్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన‌వాడ‌వుతాడు!