సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాభవం పాలైన టీడీపీ.. 23మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కూడా కాచుకోలేకపోతోంది. పడిపోతున్న వికెట్లను లెక్కపెట్టుకోవడం మినహా చంద్రబాబు చేసింది, చేయగలిగింది కూడా ఏమీ లేదు.
తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని అధిష్టానానికి షాకిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, ప్రస్తుతం విజయవాడ కార్పొరేటర్ గా ఉన్న తన కుమార్తె శ్వేత కూడా ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయదని స్పష్టం చేశారు.
నాని రాజకీయ వైరాగ్యం..
2019లో టీడీపీ ఓటమి తర్వాత కేశినేని నాని, బుద్ధా వెంకన్న మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఇందులో బోండా ఉమ కూడా ఎంటరవడంతో విజయవాడ టీడీపీలో ముసలం పుట్టింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది. ఓ దశలో నాని బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా వినిపించింది. అయితే తన కుమార్తె శ్వేతను విజయవాడ మేయర్ గా చూడాలనే ఆశతో.. ఆయన అన్నీ సర్దుకుపోయారు.
చివరకు శ్వేత కార్పొరేటర్ గా గెలిచినా.. నాయకుల మధ్య సమన్వయం లేక పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత శ్వేత బాగా యాక్టివ్ అయ్యారు. చిన్న చిన్న నాయకులందర్నీ కలుపుకొని వెళ్తూ విజయవాడ పాలిటిక్స్ లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలో నాని షాకింగ్ న్యూస్ చెప్పారు.
సన్యాసమా..? కాషాయమా..?
రాజకీయాలకు దూరం, పోటీకి దూరం అంటున్న నాని.. కాషాయ కండువా కప్పుకుంటారా అనే అనుమానం అందరిలో ఉంది. అయితే బీజేపీలోకి వెళ్లినా పెద్ద ఉపయోగం లేదని అనుకున్నారని, అందుకే గతంలోనే ఆ ఆలోచన విరమించుకున్నారని తెలుస్తోంది.
రాజకీయాలపై ఆయనకు వైరాగ్యం ఉన్నా, కూతురు పేరు కూడా కలిపి మేమంతా పోటీకి దూరం అని స్టేట్ మెంట్ ఇవ్వడం, విజయవాడలో కొత్త అభ్యర్థిని వెదుక్కోవాలని చంద్రబాబుకి ఉచిత సలహా ఇవ్వడం చూస్తుంటే.. ఆయన అలిగారని, బుజ్జగింపు కోరుకుంటున్నారనే విషయం స్పష్టమవుతోంది.
ఒక్కొక్కటిగా పడుతున్న పెద్ద వికెట్లు..
టీడీపీకి ప్రజాబలం తగ్గిపోయిన తర్వాత, ఆర్థిక స్తంభాలు ఒక్కొక్కటే కుప్పకూలుతున్నాయి. 2014 ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన నారాయణ పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇప్పుడు కేశినేని నాని కూడా ఇదే రూట్లో ఉన్నారు. మురళీమోహన్ వంటి వారు కూడా పార్టీని పట్టించుకోవడం మానేశారు. ఆర్థిక మూలాలన్నీ కుప్పకూలుతుండటంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు బాబు.