గత ఎన్నికల సమయంలో త్యాగధనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. తెరమరుగు అయ్యారనుకున్న వారికి ప్రాధాన్యతను ఇస్తూ మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. జడ్పీ చైర్మన్ ఎన్నికను ఇందుకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఇప్పటికే వైఎస్ఆర్ కడప జిల్లా జడ్పీ చైర్మన్ పీఠాన్నీ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డికి కేటాయించి ఆసక్తిదాయకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసిన అమర్ నాథ్ రెడ్డిని కడప జడ్పీ చైర్మన్ గా చేశారు జగన్ మోహన్ రెడ్డి. అలా అమర్ నాథ్ రెడ్డికి తగిన ప్రాధాన్యత లభించింది.
ఇక ప్రకాశం జిల్లాలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. దర్శి నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన బూచేపల్లి కుటుంబానికి ప్రకాశం జిల్లా జడ్పీ పీఠం దక్కింది. గత ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ టికెట్ ను త్యాగం చేసింది బూచేపల్లి కుటుంబం.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట ఆది నుంచి నిలుస్తూ వచ్చిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గత ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేయలేదు. అక్కడ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో అభ్యర్థిని నిలపగా.. ఆయన విజయానికి బూచేపల్లి సహకరించారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చాకా కూడా.. అక్కడ వర్గపోరును ఏమీ రెచ్చగొట్టలేదు.
ఈ క్రమంలో ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మకు జడ్పీ చైర్మన్ పదవి దక్కింది. రాజకీయంగా ప్రాధాన్యత తగ్గినట్టుగా కనిపించిన బూచేపల్లి ఫ్యామిలీకి ఇప్పుడు జడ్పీ చైర్మన్ పీఠం దక్కింది. తద్వారా త్యాగధనులకు తగిన ప్రాధాన్యత ఉంటుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పష్టత ఇచ్చినట్టుగా అవుతోంది.