తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు జనసేన అధిపతి పవన్ కల్యాణ్ రహస్య మిత్రుడు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేలి చేస్తూ ఉంటుంది. పవన్ కల్యాణ్ ఏం చేసినా అది చంద్రబాబు శ్రేయస్సు కోసమే, చంద్రబాబు గైడెన్స్ మేరకే.. అని వేరే చెప్పనక్కర్లేదనే అభిప్రాయాలు కూడా తరచూ వినిపిస్తూ ఉంటాయి.
ఈ క్రమంలో ఏపీ ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన సాధించిన కొద్దో గొప్పో సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కోసం ధారపోసింది. టీడీపీ, జనసేన అనధికారిక పొత్తు ఓపెన్ గా సాగింది ఎంపీపీ ఎన్నికల సందర్భంలో. ఈ రెండు పార్టీలు కూడా స్థానిక ఎన్నికల్లో పొడిచింది ఏమీ లేకపోయినా, ఇద్దరూ కలిస్తే సీటు దక్కే చోట మాత్రం బాహాటంగా చేతులు కలిపాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో రెండు ఎంపీపీ స్థానాల విషయంలో ఇదే జరిగింది. ఇక్కడ హంగ్ తరహాలో ఫలితాలు వెల్లడి కాగా.. పవన్ కల్యాణ్ పార్టీ తెలుగుదేశానికి తోకగా మిగిలింది. ఒక చోట అయితే జనసేన అధిక స్థాయిలో ఎంపీటీసీ స్థానాలను పొందినా, ఎంపీపీ సీటును మాత్రం టీడీపీ సొంతం చేసుకుంది! రెండు చోట్ల ఇలాంటి పరిస్థితి తలెత్తగా.. రెండు చోట్లా టీడీపీనే ఎంపీపీ పీఠాన్ని తీసుకుంది. జనసేన జస్ట్ ఒక తోక పార్టీగా మిగిలింది.
తమకు కొద్దోగొప్పో బలం వచ్చిన చోట కూడా జనసేన ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయింది. టీడీపీకి బలం లేకపోయినా ఆ పార్టీకి మద్దతు ఇచ్చి ఎంపీపీ సీటును కట్టబెట్టింది. తద్వారా తెలుగుదేశం పక్కన తన పాత్ర ఏమిటో జనసేన స్పష్టం చేసినట్టుగా అయ్యింది. జనసేన భజనసేనగా, తెలుగుదేశం పార్టీకి రహస్య మిత్ర పార్టీగా ఉండగలదు తప్ప అంతకు మించి సీనేమీ లేదని మరోసారి స్పష్టం అయ్యింది!