ఢిల్లీ.. దేశ రాజధాని ప్రాంతం.. దేశంలో కరోనా కేసులకు తొలి హాట్ స్పాట్ కూడా ఇదే. దాదాపు నాలుగు నెలల కిందట తబ్లిగీ మర్కజ్ ప్రార్థనల దగ్గర నుంచి ఢిల్లీలో కరోనా వ్యాప్తి తీవ్రం అయ్యింది. దేశంలో కరోనా కేసుల గురించి ప్రజలకు, వైద్యులకు కూడా పూర్తిగా అవగాహన లేని సమయంలోనే ఢిల్లీలో కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. అత్యధిక కేసులతో నిలిచింది ఢిల్లీ. ఆ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు ఢిల్లీతో పోటీకి వచ్చాయి.
ఒకానొక సమయంలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆ స్థానానికి చేరింది తమిళనాడు. ఇప్పుడు కూడా ఢిల్లీలో కేసుల సంఖ్య ఏమీ తక్కువ కాదు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షలకు పైగా ఉండగా.. ఢిల్లీలో కేసుల సంఖ్య లక్షకు పైగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 1,16,993 కరోనా కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. అయితే రికవరీ రేటులో కూడా ఢిల్లీ పరిస్థితి మెరుగ్గా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకూ ఢిల్లీలో కరోనా నుంచి రికవర్ అయ్యి, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 95,669 మందిగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 17,807గా ఉంది.
ప్రస్తుతం కొత్త కేసుల సంఖ్య కన్నా డిశ్చార్జి కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఢిల్లీ విషయంలో ఊరటగా మారింది. నిన్న దాదాపు 1647 కొత్త కేసులు నమోదు కాగా, 2,463 మంది డిశ్చార్జ్ అయినట్టుగా సమాచారం. ఇదే నిష్ఫత్తిలో రికవరీల సంఖ్య నమోదైతే.. ఢిల్లీలో అతి త్వరలోనే యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గనుంది. కొత్త కేసుల సంఖ్యను కూడా నియంత్రించగలిగితే.. దేశంలో కరోనా పై విజయం సాధించే తొలి రాష్ట్రంగా ఢిల్లీనే నిలిచే అవకాశాలున్నాయి. అయితే.. ఢిల్లీలో కరోనా మరణాల సంఖ్య మాత్రం గణనీయంగా ఉంది. 3,487 మంది అక్కడ కరోనాతో మరణించినట్టుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర తర్వాత అత్యధిక స్థాయిలో కరోనా మరణాలు రికార్డు అయ్యింది ఢిల్లీలోనే. నిన్న కూడా ఏకంగా 41 మంది కరోనా పేషెంట్లు మరణించినట్టుగా ప్రకటించారు. రికవరీల రేటులో ముందున్న ఢిల్లీ కరోనా మరణాల సంఖ్యలోనూ ముందుంది.