ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వైపుకు వెళ్తున్న ఒక కార్లో ఐదు కోట్ల రూపాయలపై మొత్తం దొరికినట్టుగా తెలుస్తోంది. ఆ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించారట. అందులోని ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఆ కారు రిజిస్ట్రేషన్ తమిళనాడుదే. ఆ కారు రిజిస్టర్ అయ్యింది కూడా తమిళనాడు వ్యక్తి పేరు మీదే. ఈ వ్యవహారంపై తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించడమే ఆసక్తిదాయకం.
ఇంతకీ నారా లోకేష్ ఏమన్నారంటే.. అదంతా అక్రమ సంపాదన అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదన అని లోకేష్ తేల్చాడు. అంతే కాదట.. శ్యాండ్, ల్యాండ్, వైన్ అంటూ ఏదో ప్రాస కూడా ప్రయోగించారు లోకేష్ బాబు. ఇతర రాష్ట్రాలకు ఇలా అక్రమ సంపాదన తరలిపోతోందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని తేల్చారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం కాదు, ఈ రాష్ట్రం నుంచి తరలిపోయే డబ్బును పట్టుకోవాలని లోకేష్ ఉచిత సలహా ఇచ్చారు ప్రభుత్వానికి.
ఈ మద్యం ప్రస్తావన ఎందుకంటే.. ఇటీవలే పలువురు తెలుగు తమ్ముళ్లు పక్క రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం తరలిస్తూ దొరికారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం తరలిస్తూ పలువురు టీడీపీ రత్నాలు దొరికారు. బహుశా వారిని వెనకేసుకు రావడానికి లోకేష్ ఈ ప్రస్తావన తెచ్చారేమో!
అయినా ఐదు కోట్ల రూపాయల మొత్తానికే లోకేష్ ఈ రేంజ్ లో ట్వీటేశారు. అది కూడా తమిళనాడు రిజిస్టర్డ్ వెహికల్ లో. ఎమ్మెల్యే అనే స్టిక్కర్ దానికి ఉందని, దీంతో వైసీపీ ఎమ్మెల్యేలదే అని లోకేష్ తేల్చారు. దొంగలు కూడా అలాంటి స్టిక్కర్లు అతికించుకుని వెళ్లి ఉండొచ్చు కదా. ఆ కథేంటో తేలకముందే లోకేష్ కు ఈ తొందరేమిటో! అందునా కేసు తమిళనాడు పరిధిలో ఉంటుంది. కాబట్టి.. అసలు సంగతేమిటో అక్కడ నుంచినే బయటకు వస్తుంది. ఆ డబ్బు వైసీపీ ఎమ్మెల్యేదే అయినా ఆ సంగతీ బయటకు వస్తుంది.
అయినా చంద్రబాబు జమానాలో ఏకంగా వందల కోట్ల రూపాయల లోడు ఒకటి దొరికింది. అది తమిళనాడు నుంచి ఏపీకి వస్తూ దొరికింది. ఆ తర్వాత దాని కథేమిటో ఎవరికీ అంతుబట్టలేదు. అలాగే హెరిటేజ్ వ్యాన్లో ఎర్రచందనం దుంగలు దొరికాయి. 2017 జూలై నాలుగున ఏకంగా కోటి రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలు హెరిటేజ్ వ్యాన్లో దొరికాయి. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడో, లేక లోకేష్ బాబే.. ఆ స్మగ్లింగ్ చేయించారని ఎవరైనా అంటే.. లోకేష్ ఒప్పుకుంటారా?