మేమైతే ఇప్ప‌టికే బెయిల్ ఇచ్చేవాళ్లం!

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. బెయిల్ విష‌యంలో హైకోర్టు చ‌ర్య‌ల్ని సుప్రీంకోర్టు ప‌రోక్షంగా త‌ప్పు ప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో త‌మ‌పై న‌మోదైన‌ కేసు కొట్టి…

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. బెయిల్ విష‌యంలో హైకోర్టు చ‌ర్య‌ల్ని సుప్రీంకోర్టు ప‌రోక్షంగా త‌ప్పు ప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో త‌మ‌పై న‌మోదైన‌ కేసు కొట్టి వేయాల‌ని నిందితుడు రామ‌చంద్ర‌భార‌తి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై జస్టిస్ బీఆర్ గ‌వాయ్‌, జ‌స్టిస్ విక్ర‌మ‌నాథ్ ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది.

నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విచార‌ణ‌లో తాము జోక్యం చేసుకోలేమ‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. పిటిష‌న్‌ను స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కొట్టి వేయ‌డం గ‌మ‌నార్హం. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించే హక్కు పిటిష‌న‌ర్‌కు ఉందని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది.  

తామైతే ఇప్పటికే బెయిల్ ఇచ్చేవారమని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పోలీసుల రిమాండ్ రిపోర్టును ట్రయల్ కోర్టు తిరస్కరించిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. హైకోర్టు జడ్జి వ్యాఖ్యల‌పై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంత‌రం చెప్పింది.

బెయిల్ నిరాక‌ర‌ణ‌కు హైకోర్టు చూపిన కార‌ణాలు సంతృప్తికరంగా లేవని స్పష్టం చేసింది. అయిన‌ప్ప‌టికీ తాము విచార‌ణ‌లో జోక్యం చేసుకోలేమ‌ని, బెయిల్ కోసం కింది కోర్టుకే వెళ్లాల‌ని సూచించ‌డం గ‌మ‌నార్హం. ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం తెలంగాణ రాజ‌కీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ అగ్ర‌నేత సంతోష్‌కుమార్‌కు కూడా సిట్ నోటీసు పంప‌డం తెలిసిందే.