కోడెల మరణం.. పవన్ కల్యాణ్ వీర రియాక్షన్ ఎందుకో!

'ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సింది కాదు.. పోరాడాల్సింది..' అంటూ కోడెల శివప్రసాద్ మరణంపై వ్యాఖ్యానించి పవన్ కల్యాణ్ తను చంద్రబాబు నాయుడుకు మరో రూపమే తప్ప మరోటికాదని ఇంకోసారి స్పష్టతను ఇచ్చారని అంటున్నారు విశ్లేషకులు. చనిపోయింది…

'ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సింది కాదు.. పోరాడాల్సింది..' అంటూ కోడెల శివప్రసాద్ మరణంపై వ్యాఖ్యానించి పవన్ కల్యాణ్ తను చంద్రబాబు నాయుడుకు మరో రూపమే తప్ప మరోటికాదని ఇంకోసారి స్పష్టతను ఇచ్చారని అంటున్నారు విశ్లేషకులు. చనిపోయింది జనసేన నేత కాదు, అలాగని తెలుగుదేశం పార్టీలోని అతిసాత్విక నేతా కాదు! కోడెల చరిత్ర పవన్ కల్యాణ్ కు తెలియకపోవచ్చు. జనాలకు మాత్రం బాగా తెలుసు. కోడెల కూతురు, కొడుకుల దాష్టీకాలు పాల్నాడు ప్రాంత వాసులకు మరింత బాగా తెలుసు. 

వాళ్ల దాష్టీకాలు, వాళ్ల దందాలు నంద్యాల, తిరుపతిల వరకూ వెళ్లాయంటే.. దుర్మార్గాలు ఏ రీతిన సాగాయో అందరికీ అర్థం అయ్యే ఉంటుంది. ప్రభుత్వాసుపత్రులకు దూది సరఫరాలోనే వారు పెద్ద స్కామ్ లు చేసి దందాలు నడిపించారంటే.. వారి ఘనత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి కోడెలకు ఆయన సొంత పార్టీ కూడా అండగా రాలేదంటే.. కథేంటో అర్థం చేసుకోవచ్చు.

సొంత పార్టీ అండగా నిలవకపోవడం, ఆఖరికి ఆయనను సత్తెనపల్లి బాధ్యతల నుంచి కూడా తప్పించడానికి రంగం సిద్ధంకావడం, స్పీకర్ హోదాలో తనతో అడ్డగోలు పనులు చేయించిన చంద్రబాబు నాయుడు తను కష్టాల్లో ఉండగా మాత్రం తనకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడం.. అన్నింటికీ మించి కొడుకు కనుసన్నల్లో సాగిన ఫర్నీచర్ వ్యవహారంతో తన పరువు గంగలో కలవడం… అంతబతుకూ బతికి ఫర్నీచర్ కు కక్కుర్తి పడ్డారంటూ మరకపడటం.. కోడెలే జీర్ణించుకోలేకపోయినట్టున్నారని పరిశీలకులు అంటున్నారు. 

కోడెల మీద ప్రభుత్వం కేసులు పెట్టలేదు. అయినా కోడెల వంటి వ్యక్తిని కేసులు ఏమీ చేయలేవు. అయితే పల్నాటిపులిగా తనను తాను చెప్పుకున్న కోడెల శివప్రసాద్ పరువును ఆయన తనయుడే తీశారని జనాలు అనుకోసాగారు. అది ఆయన భరించలేకపోయినట్టున్నారు. ఒకవేళ ప్రభుత్వ వేధింపులతోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటే ఒక లేఖ రాయడం ఆయనకు కష్టంకాదు. చెప్పులేని పరిస్థితుల్లో ఆయన తనువు చాలించారని స్పష్టం అవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

ఇవన్నీ సామాన్యులకు కూడా అర్థం అవుతున్నాయి. అయితే పచ్చ కళ్లాద్దాలు పెట్టుకున్న పవన్ కల్యాణ్ కు మాత్రం అర్థంకాలేదు! అచ్చం చంద్రబాబు రీతినే మాట్లాడి..తమ బంధం ఏ రేంజ్లో ఉందో పవన్ కల్యాణ్ మరోసారి చాటి చెప్పుకున్నారని మాత్రం సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.

మారని చంద్రబాబు నాయుడు తీరు