టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేశ్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అదిరిపోయే పంచ్ విసిరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. పనిలో పనిగా అయ్యన్నపాత్రుడు తమ నాయకుడు చంద్రబాబును శ్రీరాముడితో పోల్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇటీవల కాలంలో బూతులు మాట్లాడ్డమే పనిగా పెట్టుకున్నారనే విమర్శ వుంది. అలాంటిది ఆయన మాట్లాడిన మంచి మాటలు వివాదాస్పదం కావడం గమనార్హం. చంద్రబాబును శ్రీరామ చంద్రుడితో పోల్చుతూ, జగన్‌ను గద్దె దించేందుకు అందరి సాయం తీసుకోవాలని అయ్యన్న కోరారు.
టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో అయ్యన్న మాట్లాడుతూ…” శ్రీరామ చంద్రుడు దేవుడు. ఆయన ఒక్కడే వెళ్లి బాణం వేస్తే రావణుడు చనిపోడా? అయిన లోక కల్యాణం కోసమే ఆంజనేయుడు, విభీషణుడు, ఉడత… ఇలా అందరి సాయం తీసు కున్నాడు. ఇప్పుడు రాష్ట్ర కల్యాణం కోసం చంద్రబాబు అలాంటి ఆలోచన చేయాలి” అని విన్నవించారు. అయ్యన్న కామెంట్స్‌పై జీవీఎల్ తనదైన శైలిలో విమర్శల బాణాల్ని సంధించారు. ఇందుకు ట్విటర్‌ను వేదికగా వాడుకున్నారు.
“భగవంతుడైన శ్రీరాముడితో తమ నాయకుడిని పోలుస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు. ఇతరపార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి? మీ నాయకుడి ఆరాటం “లోక”కల్యాణం కోసం కాదు. “లోకేశ్”కల్యాణార్థం అని అందరికీ తెలుసు” అని ట్వీట్ చేశారు. లోకేశ్‌పై జీవీఎల్ అదిరిపోయే పంచ్ విసిరారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.